Advertisement


Home > Politics - Gossip
ఆంధ్రోళ్లవల్లనే అధికారం రాలేదా?

రాజకీయాల్లో కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరకవు. 'అవును... ఇదే సరైన సమాధానం' అని చెప్పుకునే అవకాశం ఉండదు. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు దాటినా ఇప్పటివరకు జవాబు దొరకని ప్రశ్న ఒకటుంది. ఏమిటది? కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ ఎందుకని అధికారంలోకి రాలేకపోయింది? కాంగ్రెసు నాయకులు ఇప్పటికీ జవాబు వెదుకుతూనే ఉన్నారు. తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్‌  భారీ మెజారిటీతో అధికారంలోకి రాలేదు. బొటాబొటి మెజారిటీతోనే కుర్చీ ఎక్కింది.

అంటే తమకు దక్కాల్సిన అధికారం ఎక్కడో పొరాపాటు జరగడంవల్ల మిస్సయిపోయి టీఆర్‌ఎస్‌కు దక్కిందని కాంగ్రెసు నాయకుల అభిప్రాయం. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం సాధించాలని కాంగ్రెసు పట్టుదలగా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెసు ఎందుకు అధికారంలోకి రాలేకపోయిందనే ప్రశ్నకు తెలంగాణకు కొత్తగా ఇన్‌చార్జిగా నియమితుడైన రామచంద్ర కుంతియా సమాధానం చెప్పారు. ఏమిటది? ఆంధ్రోళ్ల పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం నడిపారు. ఇది తీవ్రమైన తరువాత కూడా  ఆంధ్రా ప్రాంతానికి చెందిన వైఎస్‌ఆర్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రులయ్యారు.

వైఎస్‌ఆర్‌ అఖండమైన ప్రజాదరణతో ఎన్నికల్లో పార్టీని గెలిపించి రెండుసార్లు ముఖ్యమంత్రి కాగా, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డిని అధిష్టానం తెచ్చిపెట్టింది. వైఎస్‌ఆర్‌ దుర్మరణం తరువాత తెలంగాణ నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుంటే విభజన తరువాత కాంగ్రెసుకు అధికారం దక్కివుండేదని కుంతియా అభిప్రాయపడ్డారు. ఆంధ్రా నాయకులను ముఖ్యమంత్రులను చేయడం ఓ తప్పయితే, విభజనకు కాంగ్రెసు నిర్ణయం తీసుకున్న తరువాత, దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్‌కుమార్‌ రెడ్డిని తొలగించకపోవడం మరో తప్పని కుంతియా చెప్పారు.

కాంగ్రెసు వైఫల్యానికి వెతుకుతున్న కారణాల్లో ఇదొకటి. ముఖ్యమంత్రులను, పీసీసీ అధ్యక్షులను తరచూ మార్చడం కాంగ్రెసు అధిష్టానానికి అలవాటు. దాని కల్చర్‌లో అదో భాగం. ఎన్నికలనాటికి పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఉంటారా? ఊడుతారా? అనే సందేహం ఉండేది. పీసీసీ అధ్యక్షులను, ముఖ్యమంత్రులను కుదురుగా ఉండనివ్వకపోవడం కాంగ్రెసులో మొటినుంచి ఉంది. యూపీ ఎన్నికల సమయంలోనే తెలంగాణ కాంగ్రెసు కార్యవర్గం మారుతుందనే వార్తలు వచ్చాయి.

పార్టీ నాయకత్వాలను, రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చడమే సమస్యలకు పరిష్కారమని  కాంగ్రెసు మొదట్నుంచీ నమ్ముతున్న సిద్ధాంతం. కాంగ్రెసు ఎప్పుడూ వ్యక్తుల ఛరిస్మాను నమ్ముకుంటుందే తప్ప విధానాలను, సిద్ధాంతాలను కాదు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెసు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్‌ కిశోర్‌ తెలంగాణలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని మార్చి మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ను నియమించాలని గతంలో చెప్పారట.

అధ్యక్ష పదవి కోసం అజర్‌తోపాటు మల్లు భట్టి విక్రమార్క, గీతా రెడ్డి, డీకే అరుణ, షబ్బీర్‌ అలీ మొదలైనవారి పేర్లు పరిశీలనకు వచ్చాయి. విచిత్రమేమిటంటే...ఈ జాబితాలో మాజీ హీరోయిన్‌, గత ఎన్నికల్లో ఓడిపోయిన విజయశాంతి పేరు కూడా ఉండటం.  అసలామె కాంగ్రెసులో ఉందా? అనే విషయం బహుశా ఆ పార్టీ నాయకులు కూడా మర్చిపోయారేమోనని అనుమానంగా ఉన్న నేపథ్యంలో ఆమె పేరు పరిశీలనకు రావడం విచిత్రమే.

ఇక అజారుద్దీన్‌ పేరు తెర మీదకు రావడానికి కారణం ముస్లింలను ఆకర్షించడానికి. ఇక కొంతకాలం కిందట తెలంగాణ కాంగ్రెసులో బాహుబలి ఎవరు? అనే చర్చ జోరుగా సాగింది. రెండేళ్లలో ఎన్నికలు వస్తున్నాయి కదా. కాబట్టి టీ-కాంగ్రెసును ముందుకు నడిపించే, గెలిపించే బాహుబలి ఎవరు? అని అర్థమన్న మాట. కాంగ్రెసు పార్టీలో బలమైన నాయకుడు అనుకున్న సీనియర్‌ నేత జానారెడ్డి కాంగ్రెసు కంటే టీఆర్‌ఎస్‌కు ఎక్కువ ఉపయోగపడుతున్నారనే అభిప్రాయముంది. ఆయన తమకు పెద్ద తలనొప్పిగా మారారని కాంగ్రెసు నాయకులు తలలు పట్టుకుంటున్నారు. కాంగ్రెసు తరపున అసెంబ్లీలో నాయకుడైన జానా రెడ్డి ప్రభుత్వాన్ని బలంగా ఎదుర్కోలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన ఈమధ్య కాంగ్రెసును రక్షించడానికి బాహుబలి వస్తాడని, పార్టీని ముందుకు తీసుకెళతాడని వ్యాఖ్యానించారు. బాహుబలి రావడమంటే ప్రస్తుత టీ-కాంగ్రెసు అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి ఉద్వాసన చెప్పడమే. కాని ఆ ప్రమాదం తప్పింది. ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క నాయకత్వంలోనే 2019 ఎన్నికల్లో కాంగ్రెసు బరిలోకి దిగుతుందని  కొంతకాలం కిందట చెప్పిన కుంతియా తాజాగా ఈ విషయం మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెసు పరిస్థితి సంతృప్తికరంగానే ఉందన్నారు. సో...ఉత్తమ్‌, భట్టి నాయకత్వానికి ఢోకా లేదని అర్థమైపోయింది.