cloudfront

Advertisement


Home > Politics - Gossip

కాంగ్రెస్ నుంచి బాబుకు ఈ రియాక్షనేంటి?

కాంగ్రెస్ నుంచి బాబుకు ఈ రియాక్షనేంటి?

చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ తో పొత్తు పట్ల ఎంత ఆసక్తి ఉందో చెప్పనక్కర్లేదు. కాంగ్రెస్ తో పొత్తు వద్దు అని వ్యాఖ్యానించిన తన పార్టీ సీనియర్లపై చంద్రబాబు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశాడు. పొత్తుల గురించి మీరు మీడియాతో మాట్లాడొద్దు అని బాబు వాళ్లకు హెచ్చరికే చేశాడు. ఏదో ఒక పార్టీతో పొత్తులేనిదే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వెళ్లడు, వెళ్లలేడు. ఆయన రాజకీయ గమనం అంతా పొత్తులతోనే ఉంటుంది.

పొత్తులు వర్కవుట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గెలవడం, పొత్తులు వికటించినప్పుడు ఓడటం అనేది ముందు నుంచి జరుగుతున్నదే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి అంతా దూరం అయ్యారు. మిగిలింది కాంగ్రెస్ పార్టీనే. ఆ పార్టీతో జట్టుకట్టడానికి చంద్రబాబు నాయుడు చాలావేగంగా అడుగులు వేస్తున్నాడు. అటు తెలంగాణలో, ఇటు ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు అవసరంగా భావిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది బహిరంగ రహస్యమే.

ఇటీవల కుమారస్వామి చంద్రబాబుతో సమావేశం కావడం వెనుక కూడా పొత్తు మధ్యవర్తిత్వం ఉందనే మాట వినిపించింది. ఆ సమావేశం ఇటీవలే జరుగగా.. ఇప్పుడు కాంగ్రెస్ వైపు నుంచి పొత్తు లేదు అనే ప్రకటన వచ్చింది. పార్టీ సీనియర్ నేత, గతంలో ఏపీ వ్యవహారాల ఇన్ చార్జిగా వ్యవహరించిన వీరప్ప మొయిలీ ఈ ప్రకటన చేశాడు. ఈ ప్రకటన చేసిన సమయంలో ఆయన వెంట కేవీపీ రామచంద్రరావు కూడా ఉండటం గమనించాల్సిన విషయం.

అవకాశవాదం కొద్దీ కాంగ్రెస్ హై కమాండ్ ఇప్పుడు చంద్రబాబుతో చేతులు కలపడానికి ముందుకు వచ్చినా.. చంద్రబాబుతో చేతులు కలపడానికి ఇష్టంలేని వారు కాంగ్రెస్ లో ఇంకా ఉన్నారు. వారిలో కేవీపీ ముందు వరసలో ఉంటాడని చెప్పవచ్చు. చంద్రబాబుతో చేతులు కలపం అని ఒక సీనియర్ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించడం ప్రముఖమైన అంశమే.

అందునా పొత్తు పట్ల చంద్రబాబే చాలా ఉత్సాహం చూపిస్తున్న వేళ కాంగ్రెస్ వైపు నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఇది చంద్రబాబుకు మింగుడుపడే అంశం కాదేమో. అయినా రాహుల్‌తో బాబుకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయని.. పొత్తు వ్యవహారాన్ని బాబు అక్కడ తెగ్గొడతాడనే వార్తలు కూడా వస్తున్నాయి.