cloudfront

Advertisement


Home > Politics - Gossip

కాంగ్రెస్‌, టీడీపీ ఫ్రెండ్లీ ఫైట్‌

కాంగ్రెస్‌, టీడీపీ ఫ్రెండ్లీ ఫైట్‌

2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీల మధ్య అవగాహనకు సంబంధించి ఓ క్లారిటీ వచ్చేసింది. రెండు పార్టీలూ కలిసి పోటీచేస్తాయా.? లేదా.? అన్నదానిపై ఇంకాస్త క్లారిటీ రావాల్సి వుంది. తెరచాటు 'ఒప్పందాలు' అయితే కుదిరిపోయాయి. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి టీడీపీ మద్దతివ్వడం, ఈరోజు పార్లమెంటు సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీలను స్వయంగా సోనియాగాంధీ కలిసి అభినందించడం.. కాంగ్రెస్‌ - టీడీపీల మధ్య బలోపేతమైన బంధాన్ని చెప్పకనే చెప్పేశాయి.

'పార్లమెంటులో మోడీ సర్కార్‌కి వ్యతిరేకంగా మీరు చేస్తోన్న పోరాటం అద్భుతం..' అంటూ సోనియాగాంధీ, టీడీపీ ఎంపీల్ని అభినందించారు. మరీ ముఖ్యంగా, ఇటీవలి కాలంలో రకరకాలైన వేషధారణలతో పార్లమెంటులో హల్‌చల్‌ చేస్తోన్న టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ వద్దకు వెళ్ళిన సోనియా, 'మీ నిరసనలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.. చాలా బాగా చేస్తున్నారు..' అని అభినందించారట. సోనియాగాంధీతోపాటు పలువురు కాంగ్రెస్‌ ముఖ్య నేతలు, టీడీపీ ఎంపీలతో రెగ్యులర్‌గా టచ్‌లో వుంటున్నారిప్పుడు.

నిన్న మొన్నటిదాకా విభజన పాపానికి సంబంధించి కాంగ్రెస్‌ని తొలి ముద్దాయిగా భావించిన టీడీపీ, ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి బీజేపీని తీసుకొచ్చింది. 'విభజన ద్వారా కాంగ్రెస్‌ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేసిందన్నది వాస్తవం. ఈ విషయంలో మాకు రెండో ఆలోచన లేదు. అయితే, ఇప్పుడు నరేంద్రమోడీ సర్కార్‌ ఆంధ్రప్రదేశ్‌కి చేస్తున్న అన్యాయం చాలా ఎక్కువ. అందుకే, కాంగ్రెస్‌ని రెండో స్థానంలోకి నెట్టి, బీజేపీని మొదటి స్థానంలోకి తీసుకొచ్చాం. బీజేపీతో పోరాడే క్రమంలో కాంగ్రెస్‌తో కలిస్తే తప్పేంటి.?' అని టీడీపీ నేతలు చెబుతున్నారు.

అయితే, టీడీపీలో కొందరు నేతలు మాత్రం కాంగ్రెస్‌ - టీడీపీల కలయికను ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు వాలకం చూస్తోంటే, 2019 ఎన్నికల్లో 'ఫ్రెండ్లీ ఫైట్‌' పేరుతో తెరచాటు స్నేహం తప్పకపోవచ్చని టీడీపీ నేతలే ఆఫ్‌ ది రికార్డ్‌గా చెబుతుండడం గమనార్హం.