Advertisement


Home > Politics - Gossip
'కోదండ' పార్టీ కోసం కాంగ్రెసు చూస్తోందా?

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఏ రాష్ట్రంలో చూసినా రాజకీయ పార్టీలన్నీ పొత్తుల గురించే మాట్లాడుకుంటున్నాయి. చర్చలు జరుపుతున్నాయి. ఎన్నికలకు సుమారుగా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటినుంచే చర్చలు జరిపి ఒప్పందాలు కుదుర్చుకోవాలని అనుకుంటున్నాయి. ఉన్న పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవాలనే ఆలోచన చేస్తూనే పుట్టబోతున్న లేదా పుడతాయని అనుకుంటున్న కొత్త పార్టీల కోసం కూడా ఎదురుచూస్తున్నాయి.

ప్రజాదరణ ఉన్నవారు పార్టీ పెడితే, దాంతో పొత్తు పెట్టుకుంటే ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నాయి. అధికార పార్టీలను ఓడించాలనే పట్టుదలతో ఉన్న ప్రతిపక్షాలు తమ తరతరాల రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి పొత్తులకు సిద్ధమంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెసు పార్టీ ఇదివరకటికంటే చురుగ్గా ఉంది. యాక్టివ్‌గా పోరాటాలు చేస్తోంది. మళ్లీ పుంజుకుంటున్నట్లు కనబడుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది. సర్కారుకు ప్రశాంతత లేకుండా చేస్తోంది.

ఈమధ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు గంటలపాటు మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెసుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడుతోందని తిట్టిపోశారు. సుదీర్ఘంగా సమావేశం పెట్టి కాంగ్రెసును తిట్టడానికి కారణం ఏమిటి? కాంగ్రెసంటే కేసీఆర్‌కు భయం పెరిగింది కాబట్టే తిడుతున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. బీజేపీని ఆయన ఖాతరు చేయడంలేదు. టీడీపీ అసలు ఆయన దృష్టిలోనే లేదనుకోండి. కమ్యూనిస్టు పార్టీలు పూర్తిగా నిల్‌ అని అభిప్రాయం.

కాని కాంగ్రెసు మాత్రం తనకు ముప్పుగా మారుతుందని, అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుందని, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం కూడగడుతుందని కేసీఆర్‌ భావిస్తుండొచ్చు. ఇదిలావుంటే, కేసీఆర్‌ను గద్దె దింపుతామని చెబుతున్న కాంగ్రెసు పార్టీ తోటి విపక్షాలను కూడగట్టుకొని కూటమి ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కలసికట్టుగా పోరాటాలు చేస్తున్నాయి.

కాంగ్రెసు, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల మధ్య సిద్ధాంత రాద్ధాంతాలు ఎన్నివున్నా కూటమిగా ఏర్పడి పోటీ చేయాలని అనుకుంటున్నాయి. టీఆర్‌ఎస్‌ను ఓడించాలనే భావసారూప్యత ఇందుకు ప్రధాన కారణం. ఏ పార్టీకాపార్టీ పోటీ చేసినందువల్ల ప్రయోజనం ఉండదు. ఓ పక్క కూటమిగా ఏర్పడాలని ఆలోచన చేస్తున్న కాంగ్రెసు పార్టీ మరోపక్క టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే రోజు కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

అంటే ఆయన రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగుతారని, అదే జరిగితే ఆయనతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెసు ఆశగా ఉంది. కాని ఆయన పార్టీ పెడతారనే గ్యారంటీ లేదు. పార్టీ పెట్టాలనే ఆలోచన ఉందేమోగాని ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. కోదండరామ్‌ పార్టీ పెడితే కలిసి పనిచేయాలని కాంగ్రెసు ఒక్కటే కాదు, ఇతర విపక్షాలు కోరుకుంటున్నాయి.  ఓసారి పార్టీ ప్రస్తావన వచ్చినప్పుడు  'కాలమే సమాధానం చెబుతుంది' అన్నారు. అంటే  పార్టీ పెట్టేందుకు అవకాశం ఉందని అనుకోవాలా? 

వ్యక్తిగతంగానో లేదా జేఏసీ తరపునో రాజకీయ పార్టీ పెట్టే అవకాశం లేదని ఓ సందర్భంలో  చెప్పిన ప్రొఫెసర్‌ కొంతకాలం కిందట రాజకీయ పార్టీ పెడతానని అర్థమొచ్చేలా మాట్లాడారు. 'రాజకీయ అభివ్యక్తీకరణ ఉంటుంది' అన్నారు.  రాజకీయ అభివ్యక్తీకరణ బలంగా చేయాలంటే పార్టీ ఉండాల్సిందే కదా. రాజకీయ అభివ్యక్తీకరణ పార్టీ రూపంలో ఉంటుందా? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుందన్నారు. అంటే తాను రాజకీయ పార్టీ పెట్టేది లేదని స్పష్టంగా చెప్పడంలేదు.  'రాజకీయాలు బాగాలేనప్పుడు సమాజాన్ని తిట్టుకుంటూ కూర్చునే బదులు బాగుచేసే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో విజయం దక్కకపోయినా కొంత ఫలితం ఉంటుంది' అన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఢిల్లీలో సాధించిన విజయాన్ని  ప్రస్తావించారు.

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు బాగాలేవని, ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాలని జేఏసీ కోరుకుంటోందని కూడా చెప్పారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకడిగా ఉండి, ఆ తరువాత అరవింద్‌ కేజ్రీవాల్‌తో విభేదాల కారణంగా బయటకు వచ్చిన యోగేంద్ర యాదవ్‌ 'కొత్త పార్టీ పెట్టండి' అంటూ కోదండరామ్‌కు అదే పనిగా చెబుతున్నారు. కోదండరామ్‌కు యాదవ్‌ సన్నిహితుడు, శ్రేయోభిలాషి. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులను, శక్తులను రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్‌ పక్కన పెట్టేశారని కోదండరామ్‌ సహా అనేకమంది అభిప్రాయపడుతున్నారు.