cloudfront

Advertisement


Home > Politics - Gossip

దానంకు రంగు పడుతుందా?!!

దానంకు రంగు పడుతుందా?!!

శాసనసభను రద్దు చేసిన వెంటనే.. కేసీఆర్ 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. అయితే, మిగిలిన 14లో ముఖ్యమైన స్థానాలులేవు. కానీ, కొందరు ముఖ్య నాయకులు ఇంకా టికెట్లు పొందకుండా మిగిలిపోయి ఉన్నారు. అలాంటి వారిలో ప్రధానంగా మాజీమంత్రి, మొన్నటిదాకా హైదరాబాద్ నగర కాంగ్రెస్ కు చుక్కానిగా ఉన్న దానం నాగేందర్ పేరు చెప్పుకోవాలి. తాజా సమీకరణల్లో.. ఆయనకు ఏ సీటు కేటాయించాలనే విషయంలో జరుగుతున్న చర్చ నేపథ్యంలో.. దానం నాగేందర్ కు ఈ ఎన్నికలు ఉపద్రవంగా మారే ప్రమాదమూ కనిపిస్తోంది.

నిజానికి దానం నాగేందర్ కొంతమేరకు నష్టజాతకుడు అని చెప్పాలి. 2004లో అప్పటికే చంద్రబాబు తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించాక.. మళ్లీ ఆయనే గెలుస్తాడని భ్రమపడ్డ నాగేందర్ కాంగ్రెస్ నుంచి తెదేపాలోకి ఫిరాయించి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఈలోగా తెదేపా ఓడిపోయింది. ఖంగుతిన్న ఆయన అప్పటికప్పుడు రాజీనామా చేసి.. ఆ ఉప ఎన్నికలో తిరిగి కాంగ్రెస్ తరఫున నెగ్గారు. ఇలా కుప్పిగంతులు వేసినా వైఎస్ఆర్ ఆయనకు మంత్రిపదవి ఇచ్చారు.

అలాంటి నాగేందర్.. కొంతకాలం కిందటే కాంగ్రెస్ కు రాజీనామాచేసి తెరాసతీర్థం పుచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం తొలిజాబితాలో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. కాకపోతే.. ఆయన కోరుతున్న స్థానం కూడా ఇంకా ఖాళీగానే ఉంది. ఈ స్థానం నాగంకు దక్కుతుందా.. మళ్లీ కొత్త చోటకు వెళ్లి.. ఆయన ఇబ్బంది పడతాడా అని ఇప్పుడు విశ్లేషణలు సాగుతున్నాయి.

దానం నాగేందర్ ఖైరతాబాద్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈ సీటుకోసం తెరాసలో కీలక నాయకుడు కె.కేశవరావు కుమార్తె విజయలక్ష్యి, పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి నుంచి ఆయనకు తీవ్రమైన పోటీ ఉంది. కేటీఆర్ అందరితోనూ మంతనాలు సాగిస్తున్నారు. సిటీలో భాజపా స్థానాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి. వీటిలో గోషామహల్ ను పార్టీ ప్రతిపాదించగా.. అక్కడినుంచి పోటీకి నాగేందర్ ససేమిరా అన్నట్లు సమాచారం.

మిగిలిన వాటిలో భాజపా స్థానాలైన అంబర్ పేట్, ముషీరాబాద్ ఉన్నాయి. అంబర్ పేట్ నుంచి కిషన్ రెడ్డి, ముషీరాబాద్ నుంచి కె.లక్ష్మణ్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరికీ అవి బలమైన స్థానాలే. దానం కోరుకుంటున్నట్లుగా ఖైరతాబాద్ స్థానం ఆయనకు దక్కకపోతే.. ఈ రెండింటిలో ఒకదానిని ఎంచుకోక తప్పదు. అదే జరిగితే.. ఫలితం ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. మరోసారి దానంకు పరాభవం ఎదురైనా ఆశ్చర్యం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు.