Advertisement


Home > Politics - Gossip
మోడీతో భేటీలో కుదిరిన బేరం అదేనా?

అదానీ... ఈ నీడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడింది. ప్రధాని నరేంద్రమోడీ మరియు అమిత్ షా ల చల్లని కరుణతో.. భారత వ్యాపార సామ్రాజ్యంలో అనూహ్యంగా, అతిస్వల్ప వ్యవధిలో ఎదిగిన కెరటం అదానీ గ్రూపు అని అంతా అనుకుంటూ ఉంటారు. అదానీ వ్యాపార సామ్రాజ్య విస్తరణతో మోదీ దళానికి అక్రమ సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా లేకపోలేదు.

అలాంటి అదానీ గ్రూపునకు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా సంకల్పిస్తున్న భావనపాడు పోర్టును గంపగుత్తగా కట్టబెట్టేస్తూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ.. సుదీర్ఘ కాలం దూరం పెట్టిన చంద్రబాబునాయుడు ఇన్నాళ్ల తర్వాత అపాయింట్ మెంట్ ఇచ్చింది ఇందుకేనా.. అదానీకి కేటాయింపు జరగడం కోసమే.. మోదీ-చంద్రబాబు భేటీ సంభవించిందా అనే అనుమానాలు ఇప్పుడు పలువురిలో కలుగుతున్నాయి.

చంద్రబాబునాయుడు కేబినెట్ శనివారం నాడు సమావేశం అయినప్పుడు.. తీసుకున్న అనేకానేక నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి. శ్రీకాకుళం జిల్లా భావనపాడులో నిర్మించదలచుకున్న గ్రీన్ ఫీల్డ్ నాన్ మేజర్ పోర్టును ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడిగా ముద్ర ఉన్న అదానీ గ్రూపునకు కట్టబెట్టారు. ప్రభుత్వ ప్రెవేటు భాగస్వామ్యంలో ఈ పోర్టు ఏర్పాటు అవుతుంది.

అయితే సహజంగానే ఈ కేటాయింపులపై కూడా ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రధానితో ఇన్నాళ్ల తర్వాత భేటీ అయిన చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ఏం సాధించారో స్పష్టంగా.. ఇప్పటిదాకా ఒక్క అంశం కూడా తేలలేదు గానీ.. ఆయన మోదీ కోసం ఏం చేయదలచుకున్నారో.. ఆ భేటీలో ఏం బేరం కుదుర్చుకున్నారో.. ఈ అదానీ గ్రూపునకు కేటాయింపులతో స్పష్టంగానే కనిపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు.

ప్రభుత్వ నిర్ణయాలు అనేకం ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేవిగానే ఉన్నాయనే మాటలు వినవస్తున్నాయి. ఎన్నికల సంవత్సరం ముంచుకు వచ్చేస్తున్నది గనుక.. ఎక్కడికక్కడ పదుగురికీ లబ్ది చేకూరుస్తూ ఆ మేరకు ప్రత్యుపకారాలు పొందడానికి సర్కారులోని తెదేపా ప్రభుత్వం వ్యూహరచన చేస్తున్నట్లుగా ఉన్నదనే అభిప్రాయాలు కూడా వినవస్తున్నాయి.

సామర్ల కోట ప్రాంతంలో పారిశ్రామిక అవసరాలకు ఇచ్చే నీటికి కిలో లీటర్ కు 30రూపాయలు ఉన్న ధరను ఒకేసారి రూ.10కి తగ్గించడం కూడా ఇలాంటి అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం ఎన్ని అరాచక నిర్ణయాలు అయినా తీసుకోవచ్చు గాక.. కానీ ప్రజలు వాటిని గుర్తించకుండా ఉపేక్షించినంత వరకే వారి ఆటలు సాగుతాయని పాలకులు తెలుసుకోవాలి.