Advertisement


Home > Politics - Gossip
నాయకురాలే కాదు... ఎందుకు ఇంకా ఆరాటం?

నిరంతరం రాజకీయాల్లో ఉన్నవారు, ప్రజా సమస్యలపై పోరాటం చేసేవారు, ఏదో ఒక పార్టీలో లీడర్‌గా ఎదిగినవారు రాజకీయాల గురించి మాట్లాడితే అర్థముంటుంది. 'మా తాతలు నేతులు తాగారు..మా మూతులు వాసన చూడండి' అన్న సామెత మాదిరిగా తాను ఫలానా నాయకురాలి వారసురాలినని, కాబట్టి తనకు సర్వహక్కులు ఉంటాయని అంటే అర్థముంటుందా? తమిళనాడులో దివంగత జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ పరిస్థితి ఇలాగే ఉంది.

అన్నాడీఎంకేకు తానే వారసురాలినని జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ప్రకటించుకున్న దీపా జయకుమార్‌ మళ్లీ చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చి 'అన్నాడీఎంకేను, రెండాకుల గుర్తును కాపాడగల వ్యక్తిని నేనే' అని గొప్పగా ప్రకటించుకుంది. ముఖ్యమంత్రి పళనిసామి, మాజీ సీఎం పన్నీరుశెల్వం వర్గాలు విలీనం కావాలని ప్రయత్నిస్తున్న దశలో దీప ఉన్నట్లుండి ఎంటరైపోయి పార్టీ రక్షకురాలిని  చెబుతోంది. కొందరు బాబాలు, స్వాములు  తాము దేవుళ్లమని, మహిమలు ఉన్నాయని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినట్లుగా ఈమె కూడా తనకు తానే రక్షకురాలి అవతారం ఎత్తింది.

జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె మేనకోడలినంటూ వచ్చిన  దీపను కనీసం గేట్లోకి కూడా అడుగుపెట్టనివ్వలేదు. అప్పటివరకు జయకు మేనకోడలుందనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఇక అప్పటినుంచి అన్నాడీఎంకేకు, జయ ఆస్తులకు తానే వారసురాలినని ప్రకటించుకున్న దీప తానో పెద్ద నాయకురాలినని ఫీలైపోతూ హడావుడి చేయడం ప్రారంభించింది.

జయలలితతో దీర్ఘకాలంగా సంబంధాలు లేని, రాజకీయాలతో సంబంధం లేని, జయ మేనకోడలని కూడా ఎవ్వరికీ తెలియని దీప తానే రాజకీయ వారసురాలినని ఎలా అనుకుందో తెలియదు. ఇందుకు ఆమె  తాను అత్త పోలికలను పుణికిపుచ్చుకున్నానని, అచ్చం జయలా ఉంటానని చెప్పింది. ఆమె జయలలితను గుర్తుకు తెచ్చేలా ఉండటం వాస్తవమే.  జయలలిత ఆస్తులకే కాదు, పదవికీ తానే వారసురాలినని అంది. ఇలా అనుకోవడం ఆమె అజ్ఞానం. 

అన్న జయకుమార్‌ చనిపోయిన తరువాత ఆ కుటుంబంతో జయకు బంధం తెగిపోయింది. ఇందుకు వదిన (దీప తల్లి) కారణమని ఇదివరకు ఓ పత్రిక రాసింది. మొత్తంమీద విభేదాలు రావడానికి ఎవరెంత కారణమో తెలియదు. జయలలిత అనారోగ్యంపై, మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేసిన దీప తెర వెనక జరిగిన కుట్రలన్నీ బయటపెడతానంది. కాని ఇప్పటివరకు ఏం చేసిందో తెలియదు.

జయలలిత చనిపోయిన తరువాత  రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను అని అట్టహాసంగా ప్రకటించిన దీప చివరకు అంత సాహసం చేయలేక 'ఎంజీఆర్‌ అమ్మ దీప పేరవై' పేరుతో రాజకీయ వేదిక (ఫోరమ్‌) పెట్టి చేతులు దులుపుకుంది. ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నిక బరిలోకి దిగింది. ఆమెలో జయలలిత పోలికలు ఎక్కువగా ఉండటంతో అప్పట్లో  శశికళ వ్యతిరేకులు, జయ అభిమానులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు.  అభిమాన సంఘాలు పెట్టారు.  దీపలో అమ్మను చూసుకుంటున్నామన్నారు. ఆమెను చిన్నమ్మకు గట్టి పోటీదారుగా తయారుచేస్తామన్నారు. దీంతో తానే గొప్ప లీడర్‌నని దీప భ్రమపడింది.

తాను మేనత్తలా ఉండటం అదృష్టమని, తనలో వారు జయను చూసుకుంటున్నారు కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఆదరిస్తారని అనుకుంది. దీపలో జయ పోలికలుండటం, ఆమె అమ్మ మేనకోడలు కావడంతో మాజీ ముఖ్యమంత్రి పన్నీరు శెల్వం ఆమెను తమ వర్గంలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. మొదట శశికళకు మద్దతు ఇచ్చి ఆ తరువాత తిరుగుబాటు జెండా ఎగరేసిన పన్నీరుకు దీప మద్దతు ఇచ్చింది. దీంతో ఆమె ఆయన శిబిరంలోకి వెళుతుందని అనుకున్నారు. కాని ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక ప్రకటించిన తరువాత తాను స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. మేనత్తలా ఉన్న తాను పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తానని ధీమాగా ఉన్న దీప పన్నీరును కాదనుకుంది.

ఆయన మీద కూడా ఆరోపణలు చేసింది. కాని మీడియాలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. చివరకు ఆర్‌కే ఉప ఎన్నికను నిర్వహించకుండానే ఎన్నికల సంఘం వాయిదా వేసింది.  అప్పటినుంచి మౌనంగా ఉన్న దీపా జయకుమార్‌ మళ్లీ తెర ముందుకు ఎందుకు వచ్చిందో అర్థం కావడంలేదు. అన్నాడీఎంకే వర్గాలని కలపాలని, ఆ తరువాత ఎన్‌డీఏలో చేర్చుకోవాలని ప్రధాని మోదీ, అమిత్‌ షా ప్రయత్నాలు చేస్తుండగా పార్టీని రక్షించేది తానేనని వస్తే ఎవరైనా పట్టించుకుంటారా? ఈమె కనీసం ఆ పార్టీలో సభ్యురాలు కాదు. రాజకీయాల్లో ఓనమాలు తెలియవు. ఇలాంటి దీపకు ఎందుకు ఇంత ఆరాటం? ఏం సాధించాలని?