Advertisement


Home > Politics - Gossip
జగన్‌కు ద్రోహం.. బాబుకు అమ్ముడుపోయా: ఎమ్మెల్యే

నేను అమ్ముడుపోయా.. అని ఒక ఎమ్మెల్యే తెగ ఆవేదన వ్యక్తం చేశాడు. వైకాపా తరఫున తను 50వేలకుపై స్థాయి మెజారిటీతో, ఇంకా చెప్పాలంటే చంద్రబాబు కుప్పంలో సాధించిన మెజారిటీ కన్నా తన నియోజకవర్గంలో తను ఎక్కువ మెజారిటీతో గెలిస్తే.. ఫిరాయించి పరువుపోగొట్టుకున్నా అని ఆ ఎమ్మెల్యే తెగ బాధపడ్డాడు. తను అమ్ముడుపోయాను.. అని ఆయనే చెప్పుకోవడం విశేషం.

ఆయన పరిస్థితి మాత్రమే కాదట.. తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన చాలా మంది వైకాపా ఎమ్మెల్యేల పరిస్థితి అలానే ఉందట. ఈ విషయాన్ని కూడా సదరు ఎమ్మెల్యేనే వివరించి చెప్పాడు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ ఈ విధంగా వ్యాఖ్యానించడం.. ఆసక్తిదాయకంగా మారింది. ఫిరాయింపుదార్లలో మొదలైన కలవరానికి నిదర్శనంగా మారింది ఈ వ్యవహారం.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి.. తెలుగుదేశంలోకి చేరిపోయిన చాలా మంది ఎమ్మెల్యేలు చాలా డక్కామొక్కీలే తింటున్నారు. ఫిరాయింపులు చేసి నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా.. చాలా మంది ఇంకా దేశంలో కుదురుకోలేకపోతున్నారు. పార్టీలోని పాతకాపులకు, వీళ్లకు మధ్యన విబేధాలు తలెతుత్తూ ఉన్నాయి. దీనికి తోడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. టికెట్ విషయంలో వీళ్ల పరిస్థితి దయనీయాంగా మారింది.

ఫిరాయింపుదార్లందరికీ చంద్రబాబు చెప్పింది ఒకే మాట.. సీట్లు పెరుగతాయి, మీకు టికెట్ ఇస్తా.. అని బాబు చెప్పాడు. ఫిరాయింపుల నేపథ్యంలో అలిగిన తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జిలకు కూడా అదే మాటే చెప్పారు బాబు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని వారందరికీ అభయం ఇచ్చాడు. కట్ చేస్తే.. ఇప్పుడు పునర్విభజన ఇక కలలో మాటగా అగుపిస్తోంది.

ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్యన తలెత్తుతున్న పరిస్థితులను చూస్తుంటే.. బాబు కోరికలను కేంద్రం తీర్చే పరిస్థితి కనిపించడం లేదు. తెలుగుదేశంతో తెంచేసుకుందాం.. అని ఏపీ బీజేపీ నేతలే డేర్ గా అంటున్నారంటే.. కేంద్రం వాళ్లు చంద్రబాబుకు ఇంకా సహకరిస్తారని అనుకోవడం పొరపాటే అవుతుంది. సీట్లు పెంచినా, పెంచకపోయినా.. ఎన్నికల వరకూ చంద్రబాబు నాయుడు ఎన్డీయే నుంచి బయటకు రాలేడు అని బీజేపీకి కూడా తెలుసు.

ఎన్నికల సమయానికి ఎలాగూ తమను వదిలేసినా వదిలేస్తాడని కమలనాథులకు తెలియనిది కాదు. అందుకే.. ఇక సీట్ల సంఖ్యను పెంచే అవకాశాలు ఏమాత్రమూ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో.. టికెట్ల మీద ఆశలు పెట్టుకున్న వాళ్లందరిలోనూ కలవరం మొదలైంది. పాత కాపులతో పోట్లాడి టికెట్ సంపాదించుకోగలమనే కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్లు అలాగే సాగుతున్నారు.

అయితే టీడీపీ వాళ్లతో టికెట్ కోసం కొట్టుకోలేం అనే క్లారిటీకి వచ్చిన వాళ్లు మాత్రం.. ఇలాంటి మాటలతో వైకాపా అధినేతకు తిరిగి బాహాటంగానే సిగ్నల్స్ పంపిస్తూ ఉన్నట్టున్నారు. మరి వీటి పట్ల జగన్ ఇప్పటికే స్పందించాడు. తిరిగి వస్తామనే వాళ్లు రావొచ్చు.. టికెట్ మాత్రం ఆశించొద్దు.. అన్నట్టుగా జగన్ వాళ్లకు స్పష్టతను ఇచ్చాడు.