Advertisement

Advertisement


Home > Politics - Gossip

'దేశం' దళిత రాజకీయం

'దేశం' దళిత రాజకీయం

వరదలో కొట్టుకుపోతున్నవాడు పట్టుకునేందుకు ఏం దొరకుతుందా అని డిస్పరేట్ గా చూస్తుంటాడు. తెలుగుదేశం పరిస్థితి అలాగే వుంది. వైకాపా విజయం కులాల ఆలంబనగా సాధ్యమైందని తెలుగుదేశం పార్టీ గట్టిగా నమ్ముతోంది. వైకాపా బ్యాక్ ఎండ్ లో ప్రశాంత్ కిషోర్ అనే వ్యూహకర్త వుండి, కులాల సమతూకం విషయంలో రకరకాల స్ట్రాటజీలు వండి వార్చాడని, దాని ఫలితంగానే విజయం సాధ్యమైందని తెలుగుదేశం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏ కులం దగ్గర అవకాశం దొరికితే ఆ కులం కార్డు వాడుతూ ముందుకు వెళ్లే ఆలోచన చేస్తున్నారు. కానీ ఎక్కడా ఏ పాచికా పారడం లేదు. 

ఏడాదిన్నర కిందట వైకాపా అధికార ప్రాభవం ప్రారంభమైన దగ్గర నుంచి తెలుగుదేశం అనుకూల మీడియాను పరిశీలిస్తే తేదేపా కులాల స్కీము క్లారిటీగా కనిపిస్తుంది. ముందుగా కాపుల విషయంలో యాగీ ప్రారంభించారు. ఇబిసిల కోసం కేంద్రం ఇచ్చిన దాన్ని చంద్రబాబు కాపులకు కంటితుడుపుగా మార్చేస్తే, జగన్ అది సరిచేసారనే సాకును వాడుకోవాలనుకున్నారు. కానీ కానీ అటు నుంచి స్పందన, మద్దతు కనిపించలేదు. తరువాత తరువాత బిసి ల యాంగిల్ లో ట్రయ్ చేయడం ప్రారంభించారు.

అచ్చెం నాయుడు అంశాన్ని బిసిలకు ముడిపెట్టాలని చూసారు. కానీ అక్కడా పని జరలేదు. ఇటీవల ఆదరణ స్కీము పెట్టి బిసి లకు డబ్బులు అందచేయడంతో అక్కడా ఫలితం లేకుండా పోయింది. వీటన్నింటికన్నా ముందుగా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇస్యూను చూపించి బ్రాహ్మణులను దూరం చేయాలనే ప్రయత్నం చేసారు. 

ఇలాంటి నేపథ్యంలో దళితులను వైకాపాకు దూరం చేసే స్కీమును టేకప్ చేసారు. దీనికి తేదేపా చూపిస్తున్న కీలక ఉదాహరణలు మూడు. ఒకటి విశాఖ డాక్టర్ ఉదంతం, రెండు న్యాయమూర్తి రామకృష్ణ వైనం, మూడు ఈస్ట్, వైజాగ్ ల్లో జరిగిన శిరో ముండనం కేసులు. ఇవి కాక ఎక్కడక్కడో చిన్న చితక కేసులు. వాస్తవం మాట్లాడకుంటే దళితుల మీదనే కాదు, ఏ వ్యక్తుల మీద,మరే సామాజిక వర్గం మీద దాడులు అన్నవి ప్రోత్సహించేవి కాదు. కచ్చితంగా ఖండించి తీరాల్సిందే. కానీ వీటన్నింటిని గుత్త కట్టి వైకాపా ఖాతాలోకి వేయాలనే తెలుగుదేశం, దాని అనుకుల మీడియా యత్నాలను కూడా కచ్చితంగా ఖండించాల్సిందే.

డాక్టర్ సుధాకర్ కేసును సిబిఐ విచారిస్తోంది. అందువల్ల అందులో మంచి చెడ్డలు, నిజానిజాలు విచారణలో తేలుతాయి. రెండవది న్యాయమూర్తి రామకృష్ణ వ్యవహారం. ఇది ఇవ్వాళ నిన్నటిది కాదు. ఇది ఏళ్ల కాలంగా రకరకాల మలుపులు తిరుగుతూ ముందుకు వెళ్తోంది. ఇక రెండు శిరోముండనం కేసులు. ఈ రెండూ నేరాలు. ఇంకా మాట్లాడితే దారుణాలు. కానీ ఇవి వ్యవస్థీకృతంగా అంటే రాజకీయపరంగా, పార్టీల పరంగా జరిగినవి కాదు. వ్యక్తిగతంగా జరిగినవి. ఒక కేసులో వైకాపా నాయకుడో, మరో కేసులో జనసేన సింపతైజర్ నో వుంటే వుండొచ్చు. 

అంత మాత్రం చేత దళితులను అణచివేయడానికి వైకాపా కుట్రపన్నుతోంది అంటూ యాగీ చేయడం అన్నది ఎంత వరకు లాజికల్ ? అన్నది ఆలోచించాలి. ఈ రెండు కేసుల్లో దోషులను రక్షించడానికి ప్రభుత్వం లేదా అధికార పార్టీ నాయకులు కృషి చేస్తే అప్పుడు కనీసం ఓ ఆరోపణ చేయొచ్చు. నిర్దాక్షిణ్యంగా అరెస్టులు చేసారు. సాయాలు అందించారు. మరి వైకాపా తప్పు ఇంకెక్కడ? 

ఇదిలా వుంటే దళితుల కోణం వాడడం ఎందుకోసం? దేని కోసం? ఆంధ్ర రాష్ట్రంలో దళితుల ఓటు బ్యాంకు చిరకాలంగా కాంగ్రెస్ తో వుంటూ వస్తోంది. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత కూడా  కాంగ్రెస్ తోనే వుంది కానీ, ఎటూ మళ్లలేదు. ఇలాంటి టైమ్ లో దళితుల ఓటు బ్యాంకును తెలుగుదేశం పార్టీ చీల్చే ప్రయత్నం చేసింది. దళితులలో వర్గీకరణ అన్న కొత్త కోణాన్ని బయటకు తెచ్చింది చంద్రబాబే.  ఆ విధంగా ఐక్యంగా వున్న దళితులను రెండుగా చీల్చే ప్రయత్నం చేసి, కొంత ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసారు.

కానీ తెలుగుదేశానికి వెన్నుదన్నుగా వున్న సామాజిక వర్గాన్ని, ఆ వర్గం తమ పట్ల కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చేసిన దాష్టీగాలను దళితులు  మరిచిపోలేదు. అందుకే తెలుగుదేశం పార్టీకి దళితుల ఓటు బ్యాంకు ఎప్పడూ అందని పండుగానే వుంది. ఇలాంటి టైమ్ లో వైకాపా వచ్చింది. కాంగ్రెస్ నుంచి దళితుల ఓటు బ్యాంకు అటు మళ్లింది. నిజానికి దళితుల విషయంలో సరైన నిర్ణయం తీసుకుని వారికి ఇవ్వాల్సిన ఫండ్స్ విషయంలో కీలక చర్యలు తీసుకున్నది మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. అంతే తప్ప చంద్రబాబు కాదు. 

చంద్రబాబును దళితులు నమ్మలేదు కాబట్టే, వైకాపా నుంచో కాంగ్రెస్ నుంచో కొంత మంది దళిత నాయకులు ఆయన వైపు మొగ్గినా ఓటు బ్యాంక్ మాత్రం మొగ్గలేదు. ఇప్పుడు ఈ తరుణంలో దళితులపై దాడులను భూతద్దంలో చూపించి, ఆ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం. కానీ ఇది సాధ్యమేనా? ఎందుకంటే మిగిలిన దళితుల ఓటు బ్యాంకు అన్నది వార్తలను బట్టి, వండి వార్చే వ్యాఖ్యాలను బట్టి మారిపోయేది కాదు. నాయకులు ఇష్టం వచ్చినట్లు తిప్పేది కాదు. ఊర్లలో చిరకాలంగా వస్తున్న కట్టుబాట్లు, ఐక్యత, నిర్ణయాలు ఆధారంగా ఆ ఓటు బ్యాంకు దాదాపు కొద్దిశాతం అటు ఇటుగా ఒకవైపే వుంటాయి తప్ప.

ఉత్తరాంధ్ర చివరి నుంచి ప్రకాశం జిల్లా వరకు దళితుల వైఖరి అన్నది అనాదిగా దాదాపు ఫిక్స్ డ్ గా వుంటూ వస్తోంది. వివిధ వర్ణాలతో సైద్దాంతిక విబేధాలు కావచ్చు, స్థానిక విబేధాలు కావచ్చు, ఇంకా మరే కారణాలైనా కావచ్చు, దళిత ఓటు బ్యాంకు అన్నది పెద్దగా చెదిరిపోకుండా, స్ధిరంగానే వుంటూ వస్తోంది. ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా 'దళిత ప్రేమ' అనే కొత్త సినిమా చూపించి వారిని తమ వైపు తిప్పేసుకోవచ్చు అనే రాజకీయ ఎత్తుగడను అమలు చేసినంత మాత్రాన పరిస్థితి మారిపోదు. వివిధ సమతూకాలు కచ్చితంగా పని చేస్తాయి. అవే సమతూకాలు 'దేశం' ఎత్తుగడను పనిచేయకుండా చేస్తాయి. 

ఇవన్నీ  ఇలా వుంచితే దళితుల ఓటు బ్యాంకు కోసం లేని ప్రేమ ఒలకబోయడం అన్నది తెలుగుదేశం పార్టీకి బెడిసి కొట్టినా కొట్టే ప్రమాదం వుంది. ఎందుకంటే ఆంధ్రలో కులాల సమతూకం, కులాలను ఓ తక్కెడలోకి చేర్చడం అన్నది అంత అంత సులువైన వ్యవహారం కాదు. అత్యంత సున్నితమైన అంతం. కరవ మంటే కప్పకు కోపం, విడవ మంటే పాముకు కోసం అనే టైపు.

ఒక వర్గాన్ని వెనుకేసుకు వస్తే మరో వర్గానికి కోపం వస్తుంది. ఇంకో వర్గాన్ని బుజ్జగించాలని చూస్తే, మరో వర్గం అలుగుతుంది.  అసలే తెలుగుదేశం పార్టీ అటు కాపులు, ఇటు బిసి లకు సమానంగా దూరమై వుంది. ఇప్పుడు వాళ్లను దగ్గర తెచ్చుకోవడానికి కిందా మీదా అవుతోంది. ఇలాంటి టైమ్ లో దళిత కార్డును చాలా జాగ్రత్తగా వాడాల్సి వుంది. ఏమాత్రం తొందరపడినా, వికటించే ప్రమాదం కూడా వుంది.

కానీ సమస్య ఏమిటంటే, తెలుగుదేశం పార్టీ కన్నా దానిని నమ్ముకుని, దాని మీద ఆధారపడి బతికే మీడియాకు తొందర ఎక్కువ. ఏ ఆయుధం దొరికితే దాన్ని చటుక్కున విసిరేయడమే కానీ, అది వైకాపాకే తగులుతుందా? లేదా బూమరాంగై తెలుగుదేశం పార్టీకి తగిలే ప్రమాదం వుందా అని చూసుకోందు. ఈ దళిత కార్డ్ ను కూడా ఆ మీడియా అలాగే వాడేస్తోంది. ఏం జరుగుతుందో కొద్ది రోజలు ఆగితే తెలుస్తుంది. లేదా ఈ లోగా మరో ఐటమ్ దొరికితే దీన్ని వదిలి అందులోకి జంప్ చేస్తుంది ఆ మీడియా అయినా తెలుగుదేశం పార్టీ అయినా. ఇది మరో రెండు మూడేళ్ల వరకు అలాగే నడిచే సినిమా. చూస్తూ వుండడం తప్ప చేసేదేమీ లేదు.

బాబుగారి బిస్కెట్ రాజకీయం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?