Advertisement


Home > Politics - Gossip
దేవుడు ఎప్పుడు కోరుకుంటాడో...!

కొందరికి కొన్ని ఊతపదాలుంటాయి. ఆ ఊతపదాలు పలకకుండా వారు మాట్లాడలేరు లేదా ఆ పదాలను ఉచ్చరించకుండా తాము చెప్పాలనుకున్నది చెప్పలేరు. ఎక్కువమంది ఉపయోగించే పదం 'దేవుడు'. దేవుడి దయ, దేవుడు చల్లగా చూడాలి, దేవుడిని నమ్ముకున్నా, తప్పు చేసినవారిని దేవుడు శిక్షిస్తాడు, అన్నీ దేవుడు చూసుకుంటాడు...ఇలాంటి పదాలు అనేకం వాడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజలకు ఆరాధ్య నటుడు, దేవుడితో సమానమైనవాడు, దేవుడిగా కొలుచుకునేవాడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఆయన మీద ప్రజలకున్న అభిమానం, ప్రేమ గురించి చెప్పాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది. ప్రజలు దేవుడిగా కొలుచుకునే రజనీకాంత్‌కు దేవుడి మీద అపారమైన నమ్మకం. ఎనలేని భక్తి. తరచుగా హిమాలయాలకు వెళ్లి అక్కడ ధ్యానంలో గడుపుతారని చెబుతుంటారు. ఆయనకో ప్రత్యేకమైన గురువు కూడా ఉన్నారు. రజనీకాంత్‌ తరచుగా 'దేవుడు' పదం ఉపయోగిస్తుంటారు. తమ దేవుడు (రజనీ) రాజకీయాల్లోకి రావాలని జనం (అభిమానులు) ఏళ్ల తరబడి కోరుకుంటున్నారు.

కాని రజనీకాంత్‌ అదిగో... ఇదిగో అని ఊరిస్తున్నారుగాని పాలిటిక్స్‌లోకి ఎంటరవడంలేదు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా రజనీ రాజకీయాల్లోకి వస్తాడనే వార్తలు, ఊహాగానాలు హల్‌చల్‌ చేస్తుంటాయి. అభిమానులు పోస్టర్లు కూడా వేసిన సందర్భాలున్నాయి. కొన్నాళ్ల హడావుడి తరువాత అంతా చప్పబడిపోతుంది. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ నాటకానికి కారణం ఏమిటి? రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలని దేవుడు ఇంకా కోరుకోలేదు. ఎప్పుడు కోరుకుంటాడో తెలియదు. గతంలో అనేకసార్లు ఈ విషయం చెప్పిన రజనీ తాజాగా మరోసారి చెప్పారు. 'దేవుడు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తాను' అని అభిమానుల సభలో చెప్పారు. రజనీ రాజకీయాల్లోకి రావాలా?వద్దా? అనే నిర్ణయం ఆయన చేతుల్లో లేదన్నమాట. దేవుడి నిర్ణయం కోసం ఎదురు చూడాల్సిందే. సరే...దేవుడు 'రజనీకాంత్‌ నువ్వు రాజకీయాల్లోకి వెళ్లు' అనగానే ఆయన పాలిటిక్స్‌లోకి ప్రవేశించడం ఖాయం. ప్రవేశించాక ఏం చేస్తారట...? రాజకీయాల ద్వారా  లేదా రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఇబ్బడిముబ్బడిగా డబ్బు సంపాదించేవారిపై పోరాటం చేస్తారట...!

రాజకీయాల ద్వారా సంపాదించుకునే అవసరం ఈ సూపర్‌స్టార్‌కు లేదు. అందుకోసం సమయం వెచ్చించనక్కర్లేదు. కాబట్టి డబ్బు సంపాదించేవారిపై పడతారు. అదెలా చేస్తారో రాజకీయాల్లోకి వస్తేగాని తెలియదు. డబ్బు కోసం, అధికారం కోసం వెంపర్లాడేవారిని దూరం పెడతారట...! అంటే ఏకాకిగా ఉంటాడా? గౌతమ బుద్ధుడు కోరికలు చంపుకోవాలన్నాడు కాబట్టే బౌద్ధమతాన్ని ఇండియా నుంచి తరిమేశారని ఓ రచయిత అన్నాడు. అలాగే అధికారం కోసం, డబ్బు కోసం పాకులాడకూడదంటే రాజకీయాల్లోకి రావడమెందుకు? అని ఆయన్ని దేవుడిగా భావించేవారే ప్రశ్నిస్తారు. సరే...రజనీ మాట మీద గౌరవంతో డబ్బుపై తాపత్రయం చంపుకుంటారని అనుకుందాం. అధికారం కోసం కూడా ఆశపడవద్దంటే ఎలా? రాజకీయాల్లోకి వచ్చేదే పదవుల కోసం. వాటికి దూరంగా ఉండమంటే ఏం చేయాలి? రజనీని నమ్ముకుంటే బతుకు బస్టాండే అనుకుంటారు అభిమానులు.

డబ్బున్నవారిపై, రాజకీయ నాయకులపై పోరాడటం సినిమాల్లో బాగానే ఉంటుంది. అలా పోరాడే పాత్రలు చేయకపోతే రజనీ సినిమాలు ఎవ్వరూ చూడరు. కాని రాజకీయాల్లోకి వచ్చాక ఇలా చేయడం సాధ్యమా? దేవుడు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తానని చెబుతున్న రజనీకాంత్‌ ఏ మార్గంలో వస్తారు? ఏదో ఒక పార్టీలో చేరతారా? సొంతంగా పార్టీ పెడతారా? ఈ విషయం కూడా దేవుడు నిర్ణయించాల్సిందే. రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి తేవాలని, తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని ఇప్పటివరకు ప్రయత్నాలు చేయని పార్టీ లేదు. సూపర్‌స్టార్‌ను బీజేపీలోకి లాగాలని ప్రధాని మోదీ కూడా గత మూడేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తన స్థాయిని కూడా పక్కకు పెట్టి తమిళ సంప్రదాయ దుస్తులు ధరించి రజనీని కలుసుకున్నారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు రజనీని కాంగ్రెసులోకి తీసుకురావాలని విశ్వప్రయత్నాలు చేశారు. దేవుడు కోరుకోలేదు కాబట్టి ఆయన రాజకీయాల్లోకి రాలేదు. ప్రస్తుతం రజనీకి 66 ఏళ్లు. ఒకవేళ దేవుడు ఆజ్ఞ ఇచ్చినా ఆయనకు ఓపిక ఉండాలి కదా.