Advertisement


Home > Politics - Gossip
డైలాగ్ కింగ్ భలే లౌక్యంగా సెలవిచ్చారే!

డైలాగ్ కింగ్ మోహన్ బాబు.. సినిమా నటుడిగా ఎంతటి ఖ్యాతి ఉన్నవారో అందరికీ తెలుసు. క్రమశిక్షణకు పెట్టింది పేరుగా, ఆగ్రహానికి నిలువెత్తు వ్యక్తిగా ఆయనతో పరిచయం ఉన్నవారు చెబుతుంటారు. అలాంటి మోహన్ బాబు రాజకీయంగా కూడా పలు సందర్భాల్లో తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడిస్తూ ఉంటారు. నందమూరి తారక రామారావుకు ఎంతో సన్నిహితులైన అతి కొద్దిమందిలో ఒకరైన మోహన్ బాబు రాజకీయ అనుభవం కూడా తక్కువదేమీ కాదు.

ఎన్టీఆర్ కాలంలోనే ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఇవాళ జాతీయ రాజకీయాల్లో అగ్రస్థానంలో ఉన్న పలువురు ప్రముఖులకు ఆయన అప్పట్లో సహచరుడు. అలాంటి మోహన్ బాబు.. ఇప్పటి రాజకీయాల గురించి మళ్లీ తనదైన శైలిలో కామెంట్ చేశారు. కాకపోతే ఈసారి ఆయన చాలా లౌక్యంగా.. కామెంట్ చేయడమే విశేషం.

ఇండియాటుడే గ్రూపు నిర్వహించిన సదస్సులో మోహన్ బాబు మాట్లాడారు. ఈ సందర్భంగా.. నందమూరి తారక రామారావు అంటే తనకున్న ప్రేమాభిమానాలను ఆయన చాటుకున్నారు. అలాగే తన సినీజీవిత ప్రస్థానం తొలిరోజుల గురించి కూడా.. చాలా మంది దాచుకోవాలని అనుకునే చేదు వాస్తవాలను కూడా నిర్మొగమాటంగా నలుగురితో పంచుకున్నారు. రజనీకాంత్ తో తన మైత్రిని కూడా నెమరు వేసుకున్నారు. పనిలో పనిగా రాజకీయాలపై కూడా పదునైన వ్యాఖ్యలు చేశారు.

‘‘రాజకీయ నాయకులు ప్రజలకు ఎన్నో మాటలు చెబుతున్నారు. అవన్నీ నెరవేరిస్తే భారత్ ఎంతో ఉన్నతంగా ఉండేది’’ అని అంటూనే.. తను ఎరిగిన వారిలో ఎన్టీఆర్ ఒక్కడే అవినీతి ఎరగని మహానాయకుడంటూ కితాబులిచ్చారు. అదే సమయంలో.. ఇవాళ్టి రాజకీయ నాయకులలో 95 శాతం మంది రాస్కెల్స్ అంటూ దూకుడుగా విమర్శించారు.

అయితే మోహన్ బాబు ఇలా లౌక్యంగా సెలవివ్వడమే పలువురికి చిత్రంగా కనిపిస్తోంది. ఎంతటి వారి గురించి అయినా కుండబద్ధలు కొట్టినట్టుగా తన అభిప్రాయాలు చెప్పే ఈ మోహన్ బాబు.. ఎవరు తనను ప్రశ్నించినా.. తప్పించుకోడానికి వీలుగా 95 శాతం మంది రాస్కెల్స్ అంటూ కామెంట్ చేయడం గురించి చర్చించుకుంటున్నారు.

ఆయనకు పరిచయస్తులైన నాయకులెవరైనా.. ‘ఇలా అన్నారేంటి‘ అని అడిగితే.. ‘నా దృష్టిలో మీరు మిగిలిన 5 శాతంలో ఉన్నారు బ్రదర్’ అంటూ తనదైన శైలిలో తప్పించుకోడానికి వీలుగా మోహన్ బాబు.. ఇలా అన్నారా అని కూడా జనం అనుకుంటున్నారు. అయితే.. ఇలా లౌక్యం ప్రదర్శించడం మోహన్ బాబు సహజశైలి కాదని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.