Advertisement

Advertisement


Home > Politics - Gossip

కటకటాల్లో కన్నడ కాంగ్రెస్ తురుపుముక్క!

కటకటాల్లో కన్నడ కాంగ్రెస్ తురుపుముక్క!

కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఆయన ఆపద్బాంధవుడు, ఆ ఒక్కడూ లేకపోతే.. కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు అందరినీ... కట్టుగా కాపాడుకోవడం సాధ్యమయ్యేదే కాదు. పార్టీకి ఎప్పుడు సంక్షోభం వచ్చినా ఆయన అండగా నిలిచారు. కేవలం కన్నడ కాంగ్రెస్‌కు మాత్రమేకాదు... చివరికి గుజరాత్ కాంగ్రెస్‌కు సంక్షోభం వచ్చినా కూడా ఆ  కన్నడ తురుపుముక్క నాయకుడే క్యాంపు రాజకీయాలతో ఆదుకున్నారు. అలాంటి నాయకుడు ఇప్పుడు కటకటాల పాలయ్యారు. మనీలాండరింగ్ కేసుల్లో మాజీమంత్రి డికె శివకుమార్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అరెస్టు చేసింది.

ఏడాదిన్నర కిందట ఈడీ సోదాల్లో ఆయన నివాసంలో 8.59 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పటినుంచి ఆయన మీద పలు కేసులు విచారణ నడుస్తోంది. మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనేది ప్రధాన అభియోగం. ఈ విడతలో జులై 31న ఆయన ఢిల్లీలో ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అప్పటినుంచి రోజుల దరబడి ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తూనే ఉన్నారు.

ఈ మధ్యలో.. విచారణకు ఈడీ దాఖలు చేసిన సమన్లను రద్దు చేయాలంటూ.. డికె శివకుమార్ బెంగుళూరు హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిని హైకోర్టు తోసిపుచ్చింది. మంగళవారం నాడు ఢిల్లీలో ఆయనను మరోసారి విచారించిన ఈడీ అధికారు ఆ వెంటనే అరెస్టు చేశారు.

డికె శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి ఆపద్బాంధవుడుగా పేరుంది. పార్టీలోని సంపన్న నాయకుల్లో ఒకరైన శివకుమార్ ప్రతి సంక్షోభంలోనూ ఆదుకున్నారు. కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. మొదటే అధికారంలోకి వచ్చిన భాజపా సర్కారు.. కాంగ్రెసు ఎమ్మెల్యేలకు ఎరవేసి.. బలనిరూపణ చేసుకోవడానికి వీల్లేకుండా అడ్డుగా నిలిచింది శివకుమారే కావడం గమనార్హం.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలదరితో హైదరాబాదులో క్యాంపు నడిపి.. వారెవ్వరూ గీత దాటిపోకుండా జాగ్రత్తలు తీసుకుని... యడ్యూరప్ప సర్కారు కూలిపోయేలా ఆయనే చక్రంతిప్పారు. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేసి ముంబాయిలో క్యాంపులు నిర్వహించినప్పుడు కూడా డికె శివకుమార్ రంగంలోకి దిగారు. ముంబాయిలోని ఫైవ్ స్టార్ హోటల్ వద్దకు ఎమ్మెల్యేలను కలవడానికి ఆయన వెళ్లినప్పుడు లోపలకు అనుమతించలేదు.

ఆయన స్టార్ హోటల్ బయటే ధర్నా చేశారు. ఆయన ఎమ్మెల్యేలను కలిసిఉంటే ఎలా చక్రం తిప్పి ఉండేవారో తెలియదు. తర్వాత కుమార సర్కారు కుప్పకూలింది. అలాంటి కీలకనాయకుడు డికె శివకుమార్ ప్రస్తుతం మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయ్యారు.

జగన్ ఎప్పూడూ జాగ్రత్తగా ఉండాలి సుమా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?