Advertisement

Advertisement


Home > Politics - Gossip

‘పోలవరం’లో మోడీ ఆశీస్సులున్నాయా?

‘పోలవరం’లో మోడీ ఆశీస్సులున్నాయా?

పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ ప్రభుత్వపు దూకుడు ఏమాత్రం తగ్గలేదు. ఎని అవాంతరాలు ఎదురవుతున్నా.. అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నా.. వారు మాత్రం.. తాము నమ్మిన మార్గానికి కట్టుబడే ఉన్నారు. కాంట్రాక్టుల రద్దు విషయంలో మడమ తిప్పడంలేదు. ఎలాంటి అభ్యంతరాలను, అంశం కోర్టులో ఉన్నదనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా.. కాంట్రాక్టుల రద్దు, రీటెండర్ల ప్రక్రియ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం కూడా తీసేసుకున్నారు.

ఇంత సూటిగా వెళ్లిపోతున్న  జగన్ ప్రభుత్వపు పోకడలను గమనించినప్పుడు.. ఈ విషయంలో సర్కారుకు కేంద్రం నుంచి, మోడీ నుంచి ఆశీస్సులు ఉన్నాయేమోననే అనుమానం పలువురికి కలుగుతోంది. ఇందులో మరీ పెద్దగా ‘గెస్’ చేయాల్సింది కూడా ఏమీలేదు. ఎందుకంటే.. జగన్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికీ కేంద్రంలోని ప్రధానిమోడీ, హోంమంత్రి  అమిత్ షాల ఆశీస్సులు ఉన్నాయని, వారికి చెప్పే ప్రతి నిర్ణయమూ తీసుకుంటున్నామని ఆ నడుమ, వైఎస్సార్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రకటించారు కూడా.

అయితే ఆ సమయంలో ఆ మాటలను చాలామంది కొట్టి పారేశారు. రాష్ట్రానికి చెందిన భాజపా నాయకులు ఏ ఒక్క చిన్న పాయింటునూ విడిచిపెట్టకుండా.. జగన్ సర్కారు మీద వరుస విమర్శలు కురిపిస్తూ ఉండడమే ఇందుకు కారణం. ఇక్కడ ఇంతగా దాడి జరుగుతూ ఉన్నప్పుడు పైనుంచి ఆశీస్సులు ఉన్నాయనడంలో ఎంతమాత్రం ఔచిత్యం ఉంటుందో అని అంతా సందేహించారు. అయితే పోలవరం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండి ప్రాజెక్టు అథారిటీనుంచి అభ్యంతరాలు వచ్చినా.. హైకోర్టు హైడల్ ప్రాజెక్టు రద్దును సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా... జగన్ సర్కారు పట్టించుకోకుండా.. దూసుకెళ్లడం అంటే.. చిన్న విషయం కాదు.

పోలవరంలో అవినీతి జరిగిందనే విషయంలో జగన్ సర్కారుకు సందేహాలు లేకపోవచ్చు. కానీ.. ఇన్నిరకాల అభ్యంతరాలు వస్తున్నా.. వారు కేంద్రంతో సున్నం పెట్టుకుంటారని అనుకోలేం. పైగా ఆ ప్రాజెక్టుకు కాగల వ్యయం మొత్తం కేంద్రమే సమకూర్చాల్సి ఉన్న నేపథ్యంలో.. ఇదే అంశంపై వారితో సున్నం పెట్టుకోవడం అనూహ్యం.

అయినా సరే.. అభ్యంతరాలేమీ పట్టించుకోకుండా.. రద్దు నిర్ణయాలకు కేబినెట్ తో ఆమోదముద్ర కూడా వేయించి.. జగన్ ప్రభుత్వం ముందుకు దూసుకెళుతున్నదంటే. అంతో ఇంతో మోడీ ఆశీస్సులు తప్పక ఉంటాయని పలువురు సందేహిస్తున్నారు.

జగన్ ఎప్పూడూ జాగ్రత్తగా ఉండాలి సుమా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?