cloudfront

Advertisement


Home > Politics - Gossip

అవునా.. చినబాబుకు అంత ధైర్యం ఉందా?

అవునా.. చినబాబుకు అంత ధైర్యం ఉందా?

సాధారణంగా, స్టార్ హీరో కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు? అనే టాపిక్ కు మంచి స్పైసీ రీడర్ షిప్ ఉంటుంది. ఆ విషయం మీద మీడియా రకరకాల గాసిప్ లు వదులుతూ తమ రీడర్ షిప్ ను, వ్యూయర్ షిప్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చినబాబు లోకేష్ ఎక్కడినుంచి ఎమ్మెల్యేగా పోటీచేయబోతున్నారనే విషయాన్ని కూడా తెదేపా అనుకూల మీడియా అంతే స్పైసీగా భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

రకరకాల లీకులు వదులుతూ పండగ చేసుకుంటున్నారు. మంగళగిరి విషయానికి వస్తే.. ప్రస్తుతం వైసీపీ చేతిలో ఉన్న మంగళగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే ధైర్యం లోకేష్ కు నిజంగానే ఉన్నదా.. అనే రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. మంగళగిరిలో ప్రస్తుతం ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాను గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వంలోని లోపాల మీద మడమ తిప్పని పోరాటాలు సాగించడం ద్వారా ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి మరింత బలమైన కోటగా తీర్చిదిద్దారు.

సదావర్తి భూముల విషయంలో కేవలం ఆళ్ల రామకృష్ణారెడ్డి పోరాటం కారణంగానే.. రాష్ర్ట ఖజానాను దోచుకోవాలనే కుట్రలకు తెరపడిందనే సంగతి ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు ప్రభుత్వపు అరాచక నిర్ణయాలు అన్నిటి మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయపోరాటాలతో బుద్ధిచెప్పారు. దానికి తగ్గట్లుగానే.. నియోజకవర్గంలో ఇమేజిని కూడా పెంచుకున్నారు. అలాంటి బలమైన ప్రత్యర్థి మీద పోటీకి బరిలోకి దిగి.. లోకేష్ ఛాయిస్ తీసుకుంటాడా అనే అనుమానం పలువురిలో వ్యక్తం అవుతోంది.

లోకేష్ కు ఇప్పటిదాకా ఎన్నికల్లో పోటీచేసిన అనుభవం లేదు. సాధారణంగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగే ఓపిక లేకుండాపోయిన వయోవృద్ధులు, మేధావులకు అని అందరూ అనుకునే పెద్దల సభ నుంచి ఆయన చట్టసభలోకి వచ్చి, మంత్రి అయ్యారు. లోకేష్ కు ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యంలేదని అనుకోవడానికి మరో కీలక కారణం ఉంది. ఎమ్మెల్సీలుగా ఉన్న నాయకులు... ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగదలచుకుంటున్నప్పుడు.. వారు సత్తా నిరూపించుకుని తీరాల్సిందే అనే సంకేతం వెళ్లేలా చంద్రబాబునాయుడు.. వారితో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయించారు.

ఆ క్రమంలవో నెల్లూరుజిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కడపజిల్లా నుంచి రామసుబ్బారెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులను త్యజించి.. ఎమ్మెల్యే బరిలో దిగుతున్నారు. కానీ... లోకేష్ మాత్రం రాజీనామా చేయలేదు. ఈ ఒక్క అంశం గమనిస్తేనే... లోకేష్ కు ఎన్నికల విషయంలో ఎంత ధైర్యం ఉన్నదో అర్థమవుతుంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చే ధైర్యమే లేని లోకేష్... ప్రత్యర్థికి కంచుకోట వంటి స్థానం నుంచి బరిలోకి దిగే సాహసం చేస్తాడా? అని పలువురు.. ‘మంగళగిరి లీకు’ల గురించి నవ్వుకుంటున్నారు.

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

బాబుది ఎదురుదాడే.. నిజాన్ని ఎదుర్కొనలేరు!