Advertisement

Advertisement


Home > Politics - Gossip

కమిట్‌మెంట్ లేని నేతకు కిరీటం కావాలా?

కమిట్‌మెంట్ లేని నేతకు కిరీటం కావాలా?

పార్టీ మీద ప్రేమ, పార్టీ కష్టనసష్టాల్లో ఉన్నప్పుడు కూడా పార్టీని వీడకుండా ఉండేంత అభిమానం, ఎదురయ్యేది ఓటమి అయినా, గెలుపు అయినా పార్టీతోనే తన ప్రస్థానం... అని భావించే వాళ్లకి పార్టీలో కీలకపదవులు దక్కడం అవసరం. అలాంటివారు పార్టీని చిత్తశుద్ధితో నడపగలరు. కానీ, అంత తీవ్రమైన కమిట్‌మెంట్ పార్టీ పట్ల లేకుండా, చాన్సు దొరికితే చాలు ఎటువైపు గెంతుదామా అనిచూసే నాయకులు పగ్గాలు కోరుకుంటే ఎలా..? కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం అలాంటి పరిస్థితే కనిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దేశమంతటా కూడా దిక్కుతోచని స్థితిలో ఉంది. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే.. ఆపార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ దుస్థితి... అచ్చంగా జాతీయ పార్టీ దుస్థితికి సమానంగానే ఉంది. ఈ రెండింటికీ కూడా సారధిలేడు. దిక్కులేని అనాధ బిడ్డల్లాగా ఉన్నాయి. ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నుంచే ఓడిపోయిన తర్వాత.. ప్రధాని పదవి మీద కలలు పెట్టుకున్న రాహుల్ కు ఎంత విరక్తి వచ్చిందో అందరికీ తెలుసు. ఆయన కాడి పక్కన పారేసి, పార్టీ జాతీయ అధ్యక్ష పదవి తనకు వద్దంటూ వెళ్లిపోయారు.

అందరూ బుజ్జగిస్తున్నారే తప్ప... నెలలు గడుస్తున్నా.. తమ పార్టీ అనాథ కాదని ప్రపంచానికి నిరూపించడానికైనా మరో నాయకుడిని అధ్యక్షస్థానానికి ఎన్నుకోనేలేదు. ఏపీ కాంగ్రెస్ సంగతి కూడా అంతే. ఎన్నికల్లో ఓటమి కాదు కదా.. ఎన్నికల పర్వానికి చాలాకాలం ముందే పీసీసీ చీఫ్ రఘువీరా తన పదవికి రాజీనామా చేసేశారు. ఆ విధంగా కొన్నేళ్లుగా మోస్తున్న భారం దించుకున్నారు. జాతీయ పార్టీలో ఆయన రాజీనామాను ఆమోదించే దిక్కు కూడా లేదు. ఎందుకు ఆమోదించడం లేదంటే.. ఆ స్థానం భర్తీ చేయడానికి ఎవరూ ముందుకు రారేమో అనే భయంతో!

ఇప్పుడు మాజీమంత్రి అనంతపురం జిల్లాకే చెందిన మరోనేత శైలజానాధ్ సవాలు విసురుతున్నారు. నేను పీసీసీ పగ్గాలు స్వీకరిస్తా అంటున్నారు. ఎవరో ఒకరు ఈ మాత్రం త్యాగానికి సిద్ధపడడం మంచిదే. కానీ.. శైలజానాధ్ కు పార్టీ మీద ఉన్న కమిట్‌మెంట్ ప్రశ్నార్థకం. ఎన్నికలకు ముందు... తన అవసరం కొద్దీ అటు తెలుగుదేశంలోకి గెంతి, వాళ్లు కూడా నో చెప్పగానే తిరిగి కాంగ్రెస్ లోకి గెంతి.. ఆయన రకరకాల విన్యాసాలు చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ లో ఎంట్రీకి కూడా అప్పట్లో విఫలయత్నాలు చేశారనే పుకారుంది. మరి పార్టీ ఏం చేస్తుంది? అంతకుమించి గతిలేదని ఆయనకే పదవి కట్టబెడుతుందా? లేదా ఎంచుకోడానికి మరొకరున్నారా? స్టేటస్ కో మెయింటైన్ చేస్తుందా? అనేది వేచిచూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?