Advertisement


Home > Politics - Gossip
ద్వారము తెరచియేయుంటుందా?

చాలా ఏళ్ల కిందట వచ్చిన ఓ సినిమాలో 'ద్వారము తెరచియేయున్నది' అనే డైలాగ్‌ అప్పట్లో బాగా పాపులర్‌ అయింది. ఇప్పటికీ కొందరు ఉపయోగిస్తూనే ఉంటారు. సినిమాలో ఈ డైలాగ్‌ను ఏ అర్థం చెప్పారోగాని సాధారణ భాషలో చెప్పుకోవాలంటే అవకాశం లేదా ఛాన్స్‌ ఉందని చెప్పడం. మాజీ టీడీపీ, ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తనకు ద్వారము తెరచియే ఉంటుందని చెప్పారు. ఈ ద్వారం ఇప్పుడిక తెరుచుకోవడానికి అవకాశం లేదు.

కాని భవిష్యత్తులో తెరుచుకుంటుందని, అప్పుడు తాను లోపలికి ప్రవేశిస్తానని తాజాగా సెలవిచ్చారు ఈయన. ఇంతకూ తెరుచుకోబోయే ద్వారం ఏమిటది? ఎక్కడ ఉంది? ఆ ద్వారం పేరు 'మంత్రి పదవి'. అది కేసీఆర్‌ కేబినెట్‌లో ఉంది. అసెంబ్లీలో టీడీపీ లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడిగా ఉన్న ఎర్రబెల్లి గత ఏడాది ఫిబ్రవరిలో టీడీపీని వదిలేసి కోటి ఆశలతో అధికార పార్టీలో చేరారు.

టీడీపీకి ఉన్న పదిహేనుమంది ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడంతో టీడీపీ లెజిస్లేచర్‌ పార్టీని అధికారికంగా గులాబీ పార్టీలో విలీనం చేశారు దయాకర్‌రావు. ఈ దెబ్బతో రాష్ట్రంలో టీడీపీకీ నామమాత్రపు ఉనికి మిగిలింది. కాని ఈ పని చేసినందుకు ఈ నాయకుడికి ఏం మిగిలింది? ఏమీ లేదు. దీంతో దిక్కు తోచక, పొద్దుపోక గమ్మున కూర్చున్నారు. టీఆర్‌ఎస్‌లో ఉత్సాహంగా చేరినప్పటికీ మంత్రి పదవి దక్కకపోవడంతో చురుకుదనం తగ్గిపోయింది.

చాలామంది అనుకున్న పని జరక్కపోతే 'నెక్ట్స్‌ టైమ్‌ బెటర్‌ లక్‌' అని ఊరడిస్తారు. ఎర్రబెల్లిని కేసీఆర్‌ ఊరడించారో, తనకు తానే ఊరడించుకున్నాడో తెలియదుగాని తాజాగా పార్టీ సమావేశంలో మాట్లాడుతూ 'నేను వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి నుంచే పోటీ చేసి గెలుస్తా. మంత్రిని అవుతా' అని చెప్పారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ సర్కారే ఏర్పాటవుతుందనే నమ్మకం ఉండటంతోపాటు తనకు మంత్రి పదవి దక్కుతుందనే విశ్వాసమూ ఉందన్నమాట.

ఒకప్పుడు తెలంగాణ టీడీపీలో దూకుడుగా వ్యవహరించి, 'ఫైర్‌బ్రాండ్‌'గా ముద్ర పడిన  ఎర్రబెల్లి దయాకర్‌రావు తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు చాలా రోజులు సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. 'మనిషిని నమ్మితే ఏముందిరా మట్టిని నమ్మినా ఫలితముందిరా' అన్నట్లుగా 'పచ్చ పార్టీని నమ్మితే ఏముందిరా గులాబీ కండువా కప్పుకుంటే గుబాళింపు ఉందిరా' అని పాడుకొని రంగు మార్చుకున్నారు. కారెక్కింది మంత్రి పదవి కోసమని అందరికీ తెలుసు. తెలియనివారికి కూడా ఈ విషయం ఆయనే చెప్పారు.  కేసీఆర్‌ ఆ లెవెల్లో ఆశ పెట్టారు మరి. ఆయన ఆశ పెట్టడానికి, ఈయన ఆశ పడటానికి కారణం ఎర్రబెల్లికి తన జీవితంలో మంత్రి పదవి అందని ద్రాక్ష మాదిరిగా ఉండటమే. టీడీపీలో ఉన్నప్పుడు వివిధ కారణాల వల్ల మంత్రి కాలేకపోయారు.

అప్పట్లో తన జిల్లాకు చెందిన, తనకు ప్రత్యర్థి అయిన కడియం శ్రీహరి మంత్రి అయ్యారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరినా మంత్రి అయ్యే అవకాశం లేదు.  అదే కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు శ్రీహరిని మంత్రిని చేసింది తానేనని ఎర్రబెల్లి చెప్పుకున్నారు. తాను మంత్రి పదవిని తిరస్కరిస్తేనే ఆయనకు దక్కిందన్నారు. తాను తల్చుకుంటే క్షణాల్లో మంత్రిని అయ్యేవాడినని అనేకసార్లు చెప్పారు.

ఎర్రబెల్లి టీడీపీ నుంచి బయటకు రావడానికి ఉన్న కారణాల్లో రేవంత్‌ రెడ్డికి, ఆయనకు మధ్య గొడవలు కూడా భాగమే. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. అయినప్పటికీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఎర్రబెల్లి ఓపికగా 'పచ్చ' పార్టీలోనే కొనసాగారు. ఈయన టీడీపీలో ఉండగానే చిరకాల ప్రత్యర్థి అయిన కడియం శ్రీహరి గులాబీ పార్టీలో చేరడం, మంత్రి కావడం జరిగిపోయింది. మరో ప్రత్యర్థి అయిన కొండా మురళి-సురేఖ దంపతులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు.

ఇక కడియం, ఎర్రబెల్లి బహిరంగ వేదికల మీద అనేకసార్లు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. సూటిపోటి మాటలనుకున్నారు. తన ప్రత్యర్థులు టీఆర్‌ఎస్‌లో ఉన్నా కేవలం మంత్రి పదవి మీద ఆశతో దయాకర్‌ రావు గులాబీ కండువా కప్పుకున్నారు. ఒకవేళ మంత్రి పదవి రాకపోయినా దాంతో సమానమైన పదవి ఏదో ఒకటి వస్తుందనుకున్నారు. అసలు దయాకర్‌ రావు తనకు మంత్రి పదవి ఎలా వస్తుందనుకున్నారో అర్థం కావడంలేదని కొందరు నాయకులన్నారు. ఈయన కూడా కేసీఆర్‌ సామాజిక వర్గానికి చెందినవాడే. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. అలాంటప్పుడు అదే సామాజిక వర్గానికి మరో మంత్రి పదవి ఎలా ఇస్తారు? ఈయన ఆశ తీరకపోవడానికి ఇదీ ఓ కారణం. మరి వచ్చే ప్రభుత్వంలోనూ ఇదే అడ్డంకి ఉంటుంది కదా...!

-నాగ్‌ మేడేపల్లి