Advertisement


Home > Politics - Gossip
ఏచూరి మనసులో 'జనసేన'..!

ఒక పార్టీతో మరో పార్టీ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేయడమో, కొన్ని పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేయడమో ఈ కాలంలో తప్పనిసరి వ్యవహారమైపో యింది. ఇందుకు జాతీయ, ప్రాంతీయ పార్టీలనే తేడా లేదు. విచిత్రమేమిటంటే ఒకానొక కాలంలో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల ప్రాపకం కోసం అర్రులు చాచేవి. జాతీయ పార్టీలతో కలిసి నడిస్తే మనుగడ సాగించవచ్చని ప్రాంతీయ పార్టీలు భావించేవి. కాని కాలక్రమంలో ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకొని జాతీయ పార్టీలు బలహీనపడ్డాయి. దీంతో కొమ్ములు తిరిగిన జాతీయ పార్టీలు సైతం ప్రాంతీయ పార్టీల దయాదాక్షిణ్యాలపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీలే సంప్రదింపులు జరిపి సీట్ల కోసం బేరాలు చేస్తున్నాయి. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల దయతో కొన్ని సీట్లు సంపాదించుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఒకానొక కాలంలో గొప్పగా వెలిగిపోయిన జాతీయ పార్టీలు కొన్ని ఇప్పుడు వెలవెలబోతున్నాయి. కాంగ్రెసు, బీజేపీ ఒకప్పుడు వెలిగిపోయి, మరొకప్పుడు వెలవెలబోతున్నా (అప్‌ అండ్‌ డౌన్స్‌ చూస్తున్నా) కమ్యూనిస్టు పార్టీలు మాత్రం కొన్ని దశాబ్దాలుగా తిరోగమనంలోనే ఉన్నాయి.

జాతీయ కమ్యూనిస్టు పార్టీల్లో ప్రధానమైన సీపీఐ, సీపీ ఎం పార్టీలకు ఒకప్పుడు ఉన్న ఘన చరిత్ర ఇప్పుడుందా? ఎందుకని ప్రశ్నించుకుంటే సవాలక్ష కారణాలు కనబడ తాయి. ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన కమ్యూ నిస్టు పార్టీలకు ప్రత్యర్థులు పెట్టిన నిక్‌నేమ్‌ 'తోక పార్టీలు' అని. వాస్తవం చెప్పాలంటే ప్రతి పార్టీ మరో పార్టీకి తోక పార్టీగానే ఉంది. ప్రాంతీయ పార్టీలతో పొత్తు లేకుండా జాతీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కష్టం కాబట్టి ఇప్పటినుంచే పొత్తులు, కూటముల గురించిన ఆలోచనలు తీవ్రంగా సాగుతున్నాయి. ఈ ఆలోచనలు సాగిస్తున్న పార్టీల్లో కమ్యూనిస్టు పార్టీలూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఏనాడో డీలాపడ్డాయి. వాటి మనుగడ చాలా కష్టంగా ఉంది. ఒంటిరిగా పోటీ చేసే శక్తి సామర్థ్యాలు ఉండొచ్చేమోగాని ప్రజాదరణ లేదు. కాబట్టి ప్రజాదరణ ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకోవడం తప్పనిసరి. తెలుగు రాష్ట్రాల్లో పొత్తుల గురించి సీపీఐ ఏం ఆలోచిస్తోందో తెలియదు. కాని సీపీ ఎం పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ 'జనసేన' గురించి ఆలోచి స్తున్నట్లు సంకేతాలందుతున్నాయి. సాధారణంగా కమ్యూ నిస్టు నాయకులు బూర్జువా పార్టీల నాయకుల మాదిరిగా ఓవర్‌గా, అనాలోచితంగా మాట్లాడరు. ఇతర పార్టీల్లో ఎవరు ఏదిపడితే అది మాట్లాడుతుంటారు. కాని కమ్యూ నిస్టు పార్టీల్లో రాష్ట్రాల్లో కార్యదర్శి, జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శి తప్ప వేరెవరూ మాట్లాడరు. వారు ఏదైనా మాట్లాడితే అది సీరియస్‌ విషయమని అను కోవాలి.

పొత్తులపై కమ్యూనిస్టు పార్టీల నేతలు ముందుగా మాట్లాడరు. సమయం వచ్చినప్పుడే మాట్లాడతామం టారు. కాని ఇందుకు విరుద్ధంగా సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి జనసేన పార్టీతో పొత్తుకు సంబంధించి మీడియా సమక్షంలోనే సంకేతమిచ్చారు. '2019 ఎన్నికల్లో ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకోవాలని పార్టీ రాష్ట్ర కమిటీ ఆలోచిస్తోంది' అని చెప్పారు. ఏచూరి మనసులోనూ అదే అభిప్రాయం ఉండొచ్చు. పవన్‌ కళ్యాణ్‌ కూడా ఓ సభలో సీపీఎంతో పొత్తుపై సంకేతాలిచ్చారు. ఆంధ్రాలో జనసేనతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ లోనూ అదే పని చేస్తుండొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ ఒకే నిర్ణయం అమలు జరుగుతుందా? రాజకీయ పరిస్థితులు, పరిణామాలనుబట్టి నిర్ణయాల్లో తేడా ఉం టుందా? అనేది చెప్పలేం. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి అధికార పార్టీలను (టీడీపీ, బీజేపీ) ఎదుర్కొనే అవకాశం లేదు. కాని ఒక కూటమికి అవకాశం ఉన్నట్లు గతంలో ఓ ఆంగ్ల పత్రిక అంచనా వేసింది. ఏమిటా కూటమి? పవన్‌ కళ్యాణ్‌ జన సేన-వామపక్షాలు. లెఫ్ట్‌ పార్టీలు పవన్‌ వైపు చూస్తున్నా యని రాసింది. రెండేళ్ల ముందుగానే ఇలాంటి ఊహాగా నాలు చేయడం కరెక్టా? అనే ప్రశ్నకు ఏచూరి సంకేతం జవాబుగా కనబడుతోంది. కమ్యూనిస్టు పార్టీలు పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో బద్ధశత్రువైన కాంగ్రెసుతో ఎన్నికల పొత్తు పెట్టుకొని కొత్త చరిత్ర రాసుకున్నాయి. కొందరు ఇది మరో 'చారిత్రక తప్పిదం' అని కూడా విమర్శించారు.

తెలుగు రాష్ట్రాల్లో పొత్తులు 'ఎర్ర' పార్టీలకు కొత్త కాదు కాబట్టి, అవి ఏదో ఒక పార్టీ వైపు చూస్తున్నాయనుకోవడం తప్పుకాదు. పవన్‌ కళ్యాణ్‌కు వామపక్షాలంటే అభిమానం, సానుభూతి ఉన్నాయి. ముఖ్యంగా సీపీఎం పైన ఎక్కువ అభిమానం ఉంది. కాకినాడ సభలో ఈ విషయం చెప్పాడాయన. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరు కుంది సీపీఎం మాత్రమేనని అన్నాడు పవన్‌. వచ్చే ఎన్ని కల్లో ఆ పార్టీతో కలిసి నడిచే అవకాశముందని సూచన ప్రాయంగా చెప్పాడు కూడా. తాను మార్క్సిజం, కమ్యూ నిజం అధ్యయనం చేశానని, వామపక్షనాయకుల చరిత్రలు చదివానని ప్రతి సభలోనూ చెబుతున్నాడు. వామపక్షాలు పవన్‌ వైపు మొగ్గడానికి కారణాలున్నాయి. ఎర్ర పార్టీలకు ఇతర విషయాలు ఎలా ఉన్నా బీజేపీపి గట్టిగా వ్యతిరేకించేవారిని దగ్గరకు తీసుకుంటారు. సైద్ధాంతి కంగా, భావజాలపరంగా కొన్ని విభేదాలున్నా పట్టించు కోరు. వారికి ప్రధానంగా కావల్సింది బీజేపీ వ్యతిరేకత.

కాకినాడ సభలో దానిపై స్పష్టత వచ్చింది.పవన్‌ డిమాండ్‌, లెఫ్ట్‌ డిమాండ్‌ ఒక్కటే...ప్రత్యేక హోదా. పవన్‌పై అవినీతి ఆరోపణలు, కేసులు లేవు. పైగా ఇమేజ్‌ ఉంది. పవన్‌ వైపు మొగ్గడానికి ఈ కారణాలు సరిపోతాయి. జనసేనకు కేడర్‌ ఎలా ఉన్నప్పటికీ వామపక్షాలకు వ్యవస్థ, కేడర్‌ ఉన్నాయి. 2009లో చిరంజీవి వామపక్షాలతో కల వాలనుకున్నాడు. వారూ మొగ్గు చూపారు. కాని అవగాహన రాహిత్యం, ముందు చూపు లేకపోవడంతో ఆ అవకాశం పోయింది. సీపీఎం అగ్రనాయకులు ఢిల్లీ నుంచి వచ్చి చిరంజీవితో మాట్లాడాలనుకుంటే తాను వెళ్లకుండా రాజకీయనాయకుడు కాని సహచరుడిని పంపాడు. చిరంజీవితో కలవడం వృథా అని భావించి టీడీపీ, టీఆర్‌ ఎస్‌తో చేతులు కలిపారు. పొత్తు ప్రతిపాదనే వస్తే పవన్‌ ఎలా వ్యవహరిస్తాడో చూడాలి. పవన్‌, సీపీఎం కలిస్తే కొత్త చరిత్రకు నాంది పలికినట్లవుతుంది.

-నాగ్‌ మేడేపల్లి