cloudfront

Advertisement


Home > Politics - Gossip

సుజనా వ్యాపారాలపై ఈడీ దాడులు

సుజనా వ్యాపారాలపై ఈడీ దాడులు

కేంద్ర మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనాచౌదరికి చెందిన వ్యాపారాలపై సోమవారం రాత్రి ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు. సుజనా చౌదరికి చెందిన 120 కంపెనీలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఈ దాడుల్లో అధికారులు స్వాధీనం చేసుకుని తమ వెంట తీసుకువెళ్లినట్లు తెలిసింది.

అసలే తెలుగుదేశం పార్టీ.. మోడీ సర్కారు కక్ష కట్టి.. తమ పార్టీ వారి మీద ఐటీదాడులు చేయిస్తోందంటూ ఆరోపణలు గుప్పించిన కొన్నిరోజుల వ్యవధిలోనే ఏకంగా కేంద్ర మాజీమంత్రి సుజనాచౌదరి ఆస్తుల మీద దాడులు జరగడం విశేషం. ఆయన ఆఫీసులనుంచి మొత్తం 120 కంపెనీల పేరిట ఉన్న డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది.

సుజనాచౌదరి ఈడీ దాడులు తెలుగుదేశంలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. కంపెనీల ముసుగులో ఆర్థిక అక్రమ లావాదేవీలకు పాల్పడే నాయకులకు ఇప్పుడు జడుపు పుడుతోంది. అధికార పార్టీని అండగా చూసుకుంటూ.. ఇలాంటి లావాదేవీలకు పాల్పడే వారు సాధారణంగా ఎక్కువగా ఉంటారు. అందువల్లనే తెలుగుదేశానికి కంగార ఎక్కువగా ఉన్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఆర్థికలావాదేవీల విషయంలో సుజనాచౌదరి మీద ఇదివరలోనూ చాలా ఆరోపణలు ఉన్నాయి. తన కంపెనీలను చూపించి.. విదేశీ బ్యాంకులనుంచి వందలకోట్ల రూపాయల రుణాలు తీసుకుని, వాటిని ఎగవేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ కేసులు కోర్టు వరకు వెళ్లడంతో సుజనా చౌదరి పేరిట అరెస్టు వారంట్లు కూడా వచ్చాయి.

అప్పట్లో ఆయన కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ అరెస్టు వారంట్లను ఎదుర్కొన్నారు. కోర్టుకు కూడా హాజరయ్యారు. అప్పు ఎగవేసిన కంపెనీలకు తనకు సంబంధం తెగిపోయిందని చెప్పుకున్నారే తప్ప, అప్పు తీర్చిన దాఖలాలు మాత్రం వెల్లడికాలేదు.

ఇలాంటి నేపథ్యంలో సుజనా చౌదరి ఆఫీసు మీద ఈడీ అధికారులు చేసిన దాడుల్లో.. 120 కంపెనీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకువెళ్లడం చర్చనీయాంశం అవుతోంది. వీటిలో ఎన్ని నడుస్తున్న అసలు కంపెనీలో, ఎన్ని డొల్ల కంపెనీలో తేలవలసి ఉంది.