cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఈ దూకుడూ.. కేసీఆర్ సాటెవ్వడు?

ఈ దూకుడూ.. కేసీఆర్ సాటెవ్వడు?

ఇది కేసీఆర్ సూపర్ అనో, తురుము, తోపు అని భజనో కాదు. ఓ నిర్ణయం వల్ల ప్లస్సూ వుంటుంది. మైనస్సూ వుంటుంది. కానీ జనం ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకని, వీలయినంత ప్లస్ నే కావాలని. అలాంటిది ఇలా అసెంబ్లీని డిజాల్వ్ చేసి, అలా దాదాపు 90శాతం కేండిడేట్ ల జాబితా ప్రకటించడం అంటే ఏమనుకోవాలి? దానికి ఎంత ధైర్యం కావాలి? అసలు ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికే ధైర్యం కావాలి. సాధారణంగా ఇలాంటి తెగువ, తెగింపు నిర్ణయాలు రాజకీయాల్లో బెడిసి కొట్టినవే ఎక్కువ. అయినా కేసీఆర్ ధైర్యంగా ముందుకు వెళ్లడానికి డిసైడ్ అయ్యారు.

అందుకు ఆయన కాస్త ముందుగానే కసరత్తు ప్రారంభించారని అర్థం అయిపోతూనే వుంది. అందుకు తగినట్లుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించారు. అభ్యర్థుల జాబితా ఇవ్వాళ ప్రకటించారు అంటే, దీనికి కేసీఆర్ ఎన్నాళ్ల నుంచి హోమ్ వర్క్ చేస్తున్నారో? అది చాలా కీలకం. రెండవది, నామినేషన్ల టైమ్ లో తప్ప జాబితా ప్రకటించడానికి ధైర్యం చాలదు రాజకీయ పార్టీలకు. లాస్ట్ మినిట్ వరకు కేండిడేట్లు ఎవరు అన్నది దాస్తూ వస్తారు. ఎందుకంటే ఒకటి పార్టీలో అంతర్గత వివాదాలు, పోటీలు, అసంతృప్తులు వగైరా వ్యవహారాలు వుంటాయి. రెండు పోటీ పార్టీలు జాగ్రత్త పడిపోతాయి.

ఇవన్నీ అపార రాజకీయ అనుభవం వున్న కేసీఆర్ కు తెలియని సంగతులు కావు. అయినా ఇలా ప్రకటించారు అంటే ఆయన తెగువ మెచ్చుకోదగ్గదే. ఇప్పడు టికెట్ లు ఆశించి రాని వారికి బోలెడు చాన్స్ లు వున్నాయి. భాజపా, కాంగ్రెస్, తెలుగుదేశం. మూడు ఆప్షన్లు వుంటాయి. ఆయా పార్టీలు కూడా ఈ అభ్యర్థుల జాబితాను చూసుకుని, వాటికి సరైన కౌంటర్ అభ్యర్థులను వెదుక్కుంటాయి.

కానీ కేసీఆర్ ఆలోచన వేరు. ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల వెదుకులాటలో వుండగానే, ఆయన ప్రచారానికి వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ కానీ, భాజపా కానీ అభ్యర్థులను ప్రకటించడం అంత సులవుకాదు. ఎందుకంటే వాటికి జాతీయ అధిష్టానాలు వుంటాయి. వడపోతలు వుంటాయి. ఇతరత్రా వ్యవహారాలు వుంటాయి. ఇక తెలుగుదేశం పార్టీకి కూడా అదే పరిస్థితి.

అందువల్ల ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల జాబితాను వదిలేలోగా, కేసీఆర్ పొలిటికల్ ప్రచారం చాలా దూరం వెళ్లిపోతుంది. పైగా నవంబర్ లో ఎన్నికలు అంటున్నారు కేసీఆర్. అంటే జస్ట్ రెండు నుంచి మూడు నెలల కాలం. ఈలోగా ప్రతిపక్షాలు అభ్యర్థులను చూసుకోవాలి. ఆర్థిక అండదండలు సమకూర్చుకోవాలి. ఆపైన కేసీఆర్ పై ప్రచారానికి కాలుదువ్వాలి. దాదాపు ఊపరి ఆడనంత పని.

ఆ తరహా పరిస్థితిని క్రియేట్ చేసి, రాజకీయ చదరంగంలో దూకుడుగా ముందుకు వెళ్లాలన్నదే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. కేసీఆర్ తీసుకున్న మరో తెగింపు నిర్ణయం ఏమిటంటే, దాదాపుగా సిట్టింగ్ లు అందరికీ టికెట్ లు మళ్లీ కేటాయించడం. ఇది కూడా ఆశ్చర్యకరమే. సాధారణంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎలా వున్నా, లోకల్ గా ఎమ్మెల్యేల మీద కొంత వ్యతిరేకత వుంటుంది.

అది వన్ పర్సంట్ నుంచి వందశాతం వరకు వుండే వుంటుంది. అది చూసుకుని కొంత మందిని అయినా పక్కకుపెట్టాలి. చూస్తుంటే కేసీఆర్ జస్ట్ వన్ పర్సంట్ మాత్రమే పక్కన పెట్టే ఆలోచనలో వున్నట్లు కనిపిస్తోంది. ఇక కులాల ఈక్వేషన్లను కూడా కేసీఆర్ బాగానే పట్టించుకున్నట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ తెలంగాణలో తమను వెనుక పెడుతున్నారన్న అసంతృప్తి రెడ్డి సామాజిక వర్గంలో కొంత వుంది. కానీ ఈసారి టికెట్ ల పంపిణీలో రెడ్డి సామాజిక వర్గానికి కాస్త పెద్ద పీటే వేసినట్లు కనిపిస్తోంది.

అలాగే తెలంగాణలో ప్రాధాన్యతా వర్గాలు అయిన కులాలకు కూడా బాగానే టికెట్ లు ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఎక్కడా ఎవ్వరినీ తగ్గించే ఉద్దేశం పెట్టుకోనట్లు కనిపిస్తోంది. మొత్తంమీద ఈ వ్యవహారాలు అన్నీ చూస్తుంటే కేసీఆర్  చిరకాలంగా ఎన్నికల మీద దృష్టి పెట్టి వున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఈ దూకుడు సాధ్యమైంది అనుకోవాలి.