Advertisement


Home > Politics - Gossip
ఈ తెలంగాణ 'లొల్లి' ఏంటి కన్నా.?

మాజీమంత్రి, ప్రస్తుత ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల్ని పక్కనపెట్టి 'తన తపని తాను' చేసుకుపోతున్నారు. అనూహ్యంగా దక్కిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పూర్తి న్యాయం చేయాలనుకుంటున్నారో ఏమో, ఈ క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టడంలేదు. ఆంధ్రప్రదేశ్‌ సంగతి పక్కనపెట్టి, తెలంగాణ భజన చేయడంలో కన్నా ఈ మధ్య చూపుతున్న అత్యుత్సాహం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

కడప ఉక్కు పరిశ్రమ వ్యవహారంపై కన్నా లక్ష్మినారాయణ పదే పదే మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార తెలుగుదేశం పార్టీని తూలనాడుతున్నారు. అదే సమయంలో, తెలంగాణలోని అధికార తెలంగాణ రాష్ట్ర సమితిపై ప్రశంసలు గుప్పించేస్తున్నారు. 'తెలంగాణ ప్రభుత్వానికి ఉక్కు పరిశ్రమపై చిత్తశుద్ధి వుంది.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో మాత్రం ఆ చిత్తశుద్ధి కన్పించడంలేదు..' అని కన్నా లక్ష్మినారాయణ చెబుతోంటే, తెలంగాణలోని బీజేపీ వాదన ఉక్కు పరిశ్రమ విషయంలో ఇంకోలా వుంది.

పోనీ, కన్నా లక్ష్మినారాయణ చెప్పిందే నిజమనుకుంటే.. తెలంగాణలోని బయ్యారం ఉక్కు పరిశ్రమ విషయమై కేంద్రం ఎందుకు ముందడుగు వేయలేకపోయిందన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాల్సి వుంటుంది. కడప ఉక్కు కావొచ్చు, విశాఖ రైల్వేజోన్‌ కావొచ్చు.. ఈ రెండిటి విషయంలో కేంద్రం నిర్ణయమే సుప్రీం. ఆ కేంద్రం, ఈ రెండిటికీ క్లియరెన్స్‌ ఇవ్వాల్సి వుంది. మరీ ముఖ్యంగా విశాఖ రైల్వేజోన్‌ విషయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అలసత్వమేమీ లేదు కదా.!

రైల్వేజోన్‌ గురించి ప్రతిసారీ కన్నా లక్ష్మినారాయణను మీడియా నిలదీస్తూనే వస్తోంది. 'విభజన చట్టం అమలు చేయడానికి పదేళ్ళ కాలపరిమితి వుంది..' అంటూ కొత్త కథ చెబుతూ, మీడియాని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. కడప ఉక్కు విషయంలో కావొచ్చు, రైల్వేజోన్‌ విషయంలో కావొచ్చు.. మరో విషయంలో కావొచ్చు.. పూర్తిస్థాయిలో 'కీ' ప్రధాని నరేంద్రమోడీ దగ్గరే వుంది. నరేంద్రమోడీ 'ఊ' అనకపోతే, ఏ వ్యవహారమూ ముందుకు కదిలే అవకాశమే లేదు.

నిన్నటికి నిన్న పోలవరం ప్రాజెక్ట్‌ సందర్శనకు వచ్చిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, 'నా సమస్యలు నాకున్నాయి..' అని మీడియా ముందు నోరు జారారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కన్నా లక్ష్మినారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. ఓ దశలో ఆయనకు పీసీసీ అధ్యక్షుడిగా ఆఫర్‌ కూడా వచ్చింది. రాష్ట్రానికి సంబంధించి ముఖ్యనేతల్లో ఒకరైన కన్నా లక్ష్మినారాయణ.. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో వున్న పార్టీకి, రాష్ట్ర అధ్యక్షుడాయె.

చేతనైతే.. రాష్ట్రానికి మేలు కలిగేలా వ్యవహరించాలి. మొన్నీమధ్యనే ప్రధానికి ఓ విజ్ఞప్తి లేఖను అందించారు కన్నా లక్ష్మినారాయణ. ఆ విజ్ఞప్తిపై ప్రధాని సానుకూల స్పందన ఏమన్నా వుందా.? లేదా.? ఈ విషయమై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సింది పోయి.. తెలంగాణని ప్రస్తావిస్తూ.. ఏపీ మీద బురద జల్లడం ఎంతవరకు సబబు.?