Advertisement


Home > Politics - Gossip
ఎన్నికలు ఎపుడు..!?

జీవీఎంసీపై తలో మాట

మంత్రులు సై... ఎమ్మెల్యేలు నై...

ఎటూ తేల్చని అధినాయకత్వం

నంద్యాల, కాకినాడ ఎన్నికల తరువాత విశాఖ మహా నగర పాలక సంస్ధ (జీవీఎంసీ) ఎన్నికలేనన్నది నిన్నటి వరకూ వినిపించిన మాట. తాజా సమాచారం ప్రకారం ఎన్నికలు ఎపుడు జరుగుతాయో ఎవరికీ తెలియదు, జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు మాత్రం ఈ ఏడాది చివరి నాటికే ఎన్నికలు ఉంటాయని ఘంటాపథంగా చెప్పేస్తున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పట్లో జరగవని ధీమాగా జోస్యం పలుకుతున్నారు.

దీనిపై ఓ అడుగు ముందుకేసిన మాజీ మంత్రి, సీనియర్‌ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అసెంబ్లీ ఎన్నికల తరు వాతనే జీవీఎంసీ ఎన్నికలు జరుగుతాయని చల్లని కబురు చెప్పేసి తమ్ముళ్ల నెత్తిన తడి గుడ్డ వేసేశారు. జీవీఎంసీకి ఎన్నికలు ఎపుడు వచ్చినా అన్ని వార్డులలో టీడీపీదే విజయమని ఇన్‌చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాత్రం నర్మగర్భంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

మొత్తం మీద చూసుకుంటే జీవీఎంసీ ఎన్నికలు అసలు జరుగుతాయా, జరిగితే ఎపుడు జరుగుతాయన్న పార్టీ నాయకుల సందేహాలకు మాత్రం సరైన సమాధానం దొరకడంలేదు. నిజానికి జీవీఎంసీకి 2007లో ఎన్నికలు జరిగాయి, ఆ గడువు 2012 ఫిబ్రవరితో ముగిసిపోయింది, ఇప్పటికి అయిదున్నర సంవత్సరాలుగా అధికారుల పాలనలోనే మహా విశాఖ నగర పాలక సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి. మధ్యలో కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశం పార్టీకి రాష్టంలో అధికారం బదలాయింపు జరిగింది.

టీడీపీ వచ్చిన తొలి ఏడాదిలోనే ఎన్నికలు ఉంటాయనుకుంటే అనుకోకుండా వచ్చిన హుదూద్‌ తుపాను ఆ లెక్కలను తారు మారు చేసేసింది. రెండవ సంవత్సరమైనా పెడతారనుకుంటే అమరావతి రాజధానిపైనే తెలుగుదేశం పాలకులు దృష్టి పెడుతూ వచ్చారు. మూడేళ్ల కాలం ముగిసిన తరువాత ప్రజా వ్యతిరేకత భయం ఆవహించింది. ఇంక ఎన్నికలు ఉండవన్న నిశ్చయానికి జిల్లా పార్టీ నాయకత్వం వచ్చిన నేపధ్యంలో నంద్యాల, కాకినాడ బలవంతపు పోరు ముందుకొచ్చింది.

ఆ ఫలితాలు పూర్తిగా అధికార పక్షానికే అనుకూలంగా రావడంతో ఇదే వరుసలో జీవీఎంసీతో సహా, శ్రీకాకుళం కార్పొరేషన్‌, మిగిలిన మునిసిపాలి టీలకు ఎన్నికలు పెట్టేస్తారని అంతా భావించారు. ఫలితాలు వచ్చి ఇప్పటికి నెల గడిచింది. మధ్యలో మూడు విడతలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌ విశాఖ నగరంతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటించారు. మీడియా సమావేశంలో సైతం జీవీఎంసీ ఎన్నికలపై వారిద్దరూ ఎటూ తేల్చక పోవడంతో కేడర్‌లో పూర్తి నిరుత్సాహం ఏర్పడింది.

ఇంతలో వచ్చి పడిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్ర మంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వం అవసరం కనిపించింది. దాంతో, మంత్రులు గంటా శ్రీనివాసరావు, సిహెచ్‌ అయ్యన్నపాత్రుడు డిసెంబర్‌లోనే జీవీఎంసీ ఎన్నికలు ఉంటాయంటూ ఊదరగొట్టారు. టిక్కెట్ల పోరులో తామే ముందు నిలవాలన్న ఉత్సాహంతో వార్డులలో ఆశావహులైన తమ్ముళ్లంతా గత ఇరవై రోజు లుగా డబ్బులు వెదజల్లి మరీ ఇంటింటీకీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చారు. ఇదిలా ఉండగా, ఎవరూ అడగకుండానే అధినాయకత్వం మనసులో మాటను సీనియర్‌ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి చావు కబురంత చల్లగా విప్పి చెప్పేశారు.

ఏడాదిన్నర వ్యవధిలో సార్వత్రిక ఎన్నికలు ఉంచుకుని జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు పార్టీ అధినాయ కత్వం ఆలోచించదని ఇటీవల విలేఖరులతో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. పైగా, వార్డుల పునర్వి భజన తతంగం పూర్తి కావాలని, మరో వైపు కోర్టులో అడ్డంకులు కూడా ఉన్నాయని, ఇవన్నీ తేలాలంటే ఎంత సమయం పడుతుందో అంచనా కూడా వేయలేమని అభిప్రాయపడ్డారు. కచ్చితంగా చెప్పాలంటే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం సారధ్యంలోనే జీవీఎంసీ ఎన్నికలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

దీంతో, ఇంతకాలం మంత్రులు చెబుతున్న మాటలు నమ్మి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి మరీ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నడిపిస్తున్న వార్డు అధ్యక్షులు, ఆశా వహులు ఇపుడు కాడి వదిలేశారు. మొదట్లో జీవీఎంసీ ఎన్నికలు ఉంటాయన్న ఉత్సా హంతో పార్టీలో ఎవరికి వారుగా జనంలోకి దూసుకు వెళ్లారు. ఇరవై రోజులలోనే డబ్బు కరిగిపోవడం, ఆనం దం ఆవిరి కావడంతో పాటు, ఎన్నికలు ఎంతెంత దూరం అన్న సందేహాలు కూడా రావడంతో తమ్ముళ్లంతా ఇపుడు వెనకడుగు వేస్తున్నారు. 

ప్రతీ వార్డుకు రెండు ట్యాబ్‌లను ఇచ్చిన పార్టీ నాయకత్వం ఇంటింటికీ తిరిగి అక్కడ ప్రజల సమాచారం సేకరించాలని, వారి ఆధార్‌ కార్డులను ట్యాబ్‌లలో నిక్షిప్తం చేయాలని, సంక్షేమ పధకాల గురించి ప్రచారం చేయడంతో పాటు, అవి అందని వారి వివరాలను సైతం నమోదు చేసి పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం రోజుకు అయిదు వందలు ఇచ్చి మరీ ఇద్దరి కార్యకర్తలను నియమించిన వార్డు అధ్యక్షులు, ప్రచారంకోసం పది నుంచి పదిహేను మంది కార్యకర్తలను వెంట తీసుకెళ్తున్నారు.

వారి ఖర్చులతో కలుపుకుంటే రోజుకు అయిదారు వేల రూపాయల వరకూ ఖర్చవుతున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ఏ మాత్రం ఆర్ధిక సహాయం లేకపోయినా జీవీఎంసీ ఎన్నికల ఆశతో ఖర్చు చేస్తున్న తమ్ముళ్లకు బండారు వారి మాట కడు భారంగా వినిపించింది. దాంతో, ఇంతవరకూ చేసినది చాలు, ఇంక ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేమని మొరాయిస్తున్నారు. జీవీఎంసీ ఎన్నికలు ఎపుడు పెడతారో, ఒకవేళ పెట్టినా తమకే టిక్కెట్‌ ఇస్తారన్న గ్యారంటీ ఏముంది, ఇప్పటికిపుడు చేతి చమురు వదిలించుకుంటే ఆనక నష్టపోయేది తామేనని గ్రహించిన తమ్ముళ్లు చేదు నిజం అయినా బండారు బాగానే చెప్పారని అంటున్నారు.

దాంతో, అరవై రోజుల షెడ్యూలును ఖరారు చేసి మరీ అధినాయకత్వం ఎట్టి పరిస్థితులలోనూ ప్రతీ ఇంటి గడప తట్టాలని హుకుం జారీచేసి పంపించినా ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమం ఇపుడు అర్బన్‌ జిల్లాలో నత్త నడకగా సాగుతోంది.. ఈ కార్యక్రమం సంగతి పక్కన పెడితే ఇంతకీ జీవీఎంసీ ఎన్నికలు ఎపుడు నిర్వహిస్తారన్న ప్రశ్నకు సమాధానం మాత్రం రావడంలేదు.

-పివిఎస్‌ఎస్‌ ప్రసాద్‌