Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఈట‌ల డ్యామేజ్ క‌వ‌రేజ్.. దూరం త‌గ్గేనా!

ఈట‌ల డ్యామేజ్ క‌వ‌రేజ్.. దూరం త‌గ్గేనా!

భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌ఫున నెగ్గార‌నేమాటే కానీ.. ఆయ‌న సొంత అజెండాతో సాగుతున్నాడ‌ని, బీజేపీ బ‌లం క‌న్నా త‌న బ‌లంతోనే త‌ను ఎమ్మెల్యేగా నెగ్గిన‌ట్టుగా ఆయ‌న ఫీల్ అవుతున్నార‌ని, అయితే సొంతంగా లేదంటే సొంత కులాన్ని ముందేసుకుని ఈట‌ల రాజేంద‌ర్ సాగుతున్నార‌ని, ఈ వ్య‌వ‌హారం భార‌తీయ జ‌న‌తా పార్టీ లో కూడా అస‌హ‌నాన్ని పుట్టిస్తోంద‌నే ప్ర‌చారం ఊపందుకుంటున్న ద‌శ‌లో స్పందించారు ఈట‌ల‌. 

పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ పై పోటీకి సై అనే ప్ర‌క‌ట‌న ద్వారా.. త‌ను పార్టీ ఆదేశాల‌కు బ‌ద్ధుడును అని ఈట‌ల చాటుకునే ప్ర‌య‌త్నం చేశారు. కేసీఆర్ పై పోటీకి సై అన‌డం ద్వారా.. బీజేపీలో ఉద్వేగాలు రేకెత్తించే ప్ర‌య‌త్నం చేశారు ఈట‌ల‌. అలాగే బీజేపీ ముఖ్య నేత‌లు ఎవ‌రితోనూ త‌న‌కు విబేధాలు లేవ‌ని ఈట‌ల క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో అయినా, టీబీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తో అయినా త‌న‌కు మంచి సంబంధాలే ఉన్నాయ‌ని ఈట‌ల చెప్పుకొచ్చారు. త‌న‌పై సాగుతున్న ప్ర‌చారానికి తెర‌దించే ప్ర‌య‌త్నం చేశారు.

అలాగే త‌ను పార్టీలు మారేవాడిని కానంటూ కూడా ఈట‌ల క్లారిటీ ఇచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం. త‌ను టీఆర్ఎస్ నుంచి కూడా బ‌య‌ట‌కు రాలేద‌ని.. వాళ్లే త‌న‌ను బ‌య‌ట‌కు పంపారంటూ ఈట‌ల చెప్పుకున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు కూడా త‌న‌ను ప్ర‌గ‌తి భ‌వ‌న్ లోకి రానివ్వ‌లేద‌న్నారు. త‌ను పార్టీలు మారేవాడిని కానంటూ చెప్పుకోవ‌డం ద్వారా త‌ను బీజేపీని వీడ‌టం లేద‌ని ఈట‌ల వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు.

ఉప ఎన్నిక‌ల్లో మాత్ర‌మే ఈట‌ల బీజేపీ త‌ర‌ఫున పోటీ చేశార‌ని, ఆయ‌న భ‌విష్య‌త్తులో కాంగ్రెస్ వైపు సాగే అవ‌కాశం ఉంద‌ని ఉప ఎన్నిక‌ల‌ప్పుడే ప్ర‌చారం జ‌రిగింది. ఈట‌ల వ్య‌క్తిగ‌త రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ‌తో ఆ ప్ర‌చారం ఇప్ప‌టికీ అలాగే అంత‌ర్లీనంగా కొన‌సాగుతూ ఉంది. అదొక అభిప్రాయంగా మారుతూ ఉంది కూడా. మ‌రి ఈ రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఈట‌ల స్పంద‌న ద్వారా..బీజేపీకి, ఆయ‌న‌కూ పెరిగిన దూరం త‌గ్గిపోతుందో లేదో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?