cloudfront

Advertisement


Home > Politics - Gossip

తెదేపాపై లైట్ గా వెళ్ళండి

తెదేపాపై లైట్ గా వెళ్ళండి

భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏమిటో అర్థం కావడం లేదు. ఈ వ్యవహారం ఒక పార్టీ యొక్క వ్యూహమో లేదా రెండు పార్టీలూ కలిసి ఆడుతున్న డ్రామానో ప్రజలకు అర్థం కావడం లేదు. ఒకవైపు చంద్రబాబు నాయుడు మాత్రం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఎడాపెడా తెగనాడుతూ ఉంటారు.

మరోవైపు భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశంలో తెలుగుదేశం మీద చూసీచూడనట్టుగా లైట్ గా వెళ్లాలని నిర్ణయించినట్లుగా సమాచారం. విశ్వసనీయంగా పార్టీ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారాన్ని బట్టి తెలుగుదేశానికి అంతో ఇంతో అనుకూలంగానే భాజపా కోర్ కమిటీ సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది.

ఈ లెక్కన ఇదివరకటి రోజులు మాదిరిగానే భాజపా కీలక నాయకులందరూ చంద్రబాబు మీద పెద్దగా విమర్శలు చేయకుండా రహస్య మిత్ర ధర్మం పాటిస్తున్నారని అనుకోవాలి. అలాగని ఈ రెండు పార్టీలు కుమ్మక్కు అయిపోయినట్లుగా తతిమ్మా ప్రజలందరూ గుర్తించకుండా వుండేందుకు గతంలో చంద్రబాబును తిట్టడంలో ప్రత్యేకించిన నాయకులు మాత్రం అదే పనిని కొనసాగిస్తే సరిపోతుందని పార్టీ భావిస్తోంది.

పేరుకు కేంద్ర క్యాబినెట్ నుంచి రాజీనామాలు చేసినప్పటికీ ఎన్డీయేలో ఇంకా మిత్రపక్షంగా కొనసాగుతూ చంద్రబాబునాయుడు ప్రజలకు అర్థంకాని డ్రామాను నడిపిస్తున్నారు. అందుకు ప్రత్యుపకారం అన్నట్లుగా చంద్రబాబు మరియు తెలుగుదేశం మీద ఎడాపెడా విమర్శలకు దిగకుండా కొంత సంయమనం పాటించాలని రహస్య ఆదేశాలు అందినట్లు సమాచారం.

అదే సమయంలో రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ విభజన చట్టాన్ని సరిగ్గా రూపొందించకపోవడం వల్లనే హోదా సహా సమస్త అనర్ధాలు వాటిల్లుతూన్నాయని ఆ పార్టీ మీద మాటల దాడులు చేయాల్సిందిగా భాజపా శ్రేణులకు, అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది. చూడబోతే ఈ రెండు పార్టీలు ముందు ముందు మరింత బాగా జతకట్టి ప్రజలను మరింత ఘనంగా వంచిస్తూ రోజులు గడిపేస్తాయని ప్రచారం జరుగుతోంది.