Advertisement

Advertisement


Home > Politics - Gossip

వ‌చ్చేసారి మాధ‌వ్ కు వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వ‌గ‌ల‌దా?

వ‌చ్చేసారి మాధ‌వ్ కు వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వ‌గ‌ల‌దా?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో హిందూపురం ఎంపీగా నెగ్గిన గోరంట్ల మాధ‌వ్ వీడియో వ్య‌వ‌హారంలో నిజానిజాల సంగ‌తెలా ఉన్నా... వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయ‌న‌కు మ‌రోసారి ఎంపీగా బ‌రిలోకి దింప‌గ‌ల‌దా? అనేది అస‌లైన చ‌ర్చ‌! ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారాన్ని తెలుగుదేశం పార్టీ వీలైనంత‌గా వాడుకుంది. వాడుకుంటూనే ఉంటోంది.

మాధ‌వ్ వీడియోలో వాస్త‌విక‌త సంగ‌తెలా ఉన్నా, ఇది ప్రజాప్ర‌యోజ‌నాల‌కు ఎంత వ‌ర‌కూ భంగం క‌లిగించే అంశం అనేది ప్ర‌జ‌లెవ‌రూ ప‌ట్టించుకోని అంశ‌మే. అయితే ఇలాంటి వ్య‌వ‌హారం వ‌ల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాల‌కు ఉప‌యోగం ఉంటుంద‌ని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.

అంబ‌టి వాయిస్ రికార్డింగు, ఆ పై పృథ్వి వ్య‌వ‌హారం, ఇప్పుడు మాధ‌వ్ వ్య‌వ‌హారం.. వీటిని తెలుగుదేశం పార్టీ త‌మ అస్త్రాలుగా భావిస్తోంది. అంబ‌టి వ్య‌వ‌హారాన్ని జ‌గ‌న్ పూర్తి లైట్ తీసుకున్నారు. పృథ్వి టీటీడీలో ఉండేవాడు కాబ‌ట్టి..లేట్ చేయ‌కుండా రాజీనామా చేయించారు. ఇప్పుడు అదే పృథ్వి జ‌న‌సేన‌కు ఇష్టుడ‌య్యాడు. ఇక మాధ‌వ్ వ్య‌వహారంలో ముందు ముందు ఏం జ‌రుగుతుంద‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం!

హిందూపురం నుంచి బీసీ అభ్య‌ర్థి రాజ‌కీయంగా త‌మ‌కు ఉప‌యుక్తం అవుతాడ‌ని గ‌త ఎన్నిక‌ల ముందు జ‌గ‌న్ భావించాడు. ప్ర‌త్యేకించి బీసీల్లో తెలుగుదేశం పార్టీ వ‌ర‌స‌గా సాలె సామాజిక‌వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్థికి టికెట్ ఇస్తూ వ‌చ్చింద‌క్క‌డ‌. టీడీపీ త‌ర‌ఫు నుంచి నిమ్మ‌ల కిష్ట‌ప్ప వ‌ర‌స‌గా హిందూపురం నుంచి నెగ్గారు. ఆయ‌న చేనేత సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. ధ‌ర్మ‌వ‌రం, హిందూపురం ప‌రిధుల్లో వీరి జ‌నాభా ఎక్కువ‌.

ఇక ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో.. కురుబ‌, బోయ సామాజిక‌వ‌ర్గాల జ‌నాభా గ‌ణ‌నీయంగా ఉంటుంది.  అయితే అనంత‌పురం పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో బోయ‌ల జ‌నాభా మ‌రింత ఎక్కువ‌! దీంతో అనంత‌పురం నుంచి బోయ‌ల‌కు అవ‌కాశం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హిందూపురాన్ని కురుబ‌ల‌కు కేటాయించింది.

చేనేత సామాజిక‌వ‌ర్గం క‌న్నా.. కురుబ‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఎక్కువ సానుకూల‌త ఉంది. దానికి తోడు.. హిందూపురం ఎంపీ సీటును, పెనుకొండ ఎమ్మెల్యే టికెట్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కురుబ‌ల‌కే కేటాయించింది. 2019లో గ‌ట్టిగా వీచిన జ‌గ‌న్ గాలికి తోడు ఈ స‌మీక‌ర‌ణాల‌న్నీ తోడై.. గోరంట్ల మాధ‌వ్ కు ఘ‌న విజ‌యం ల‌భించింది. గోరంట్ల మాధ‌వ్ కు గ‌త ఎన్నిక‌ల్లో ల‌భించిన మెజారిటీ 1,40,000!

సాధార‌ణంగా ఎంపీగా నెగ్గాలంటే భారీగా ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారం. అయితే మాధ‌వ్ కు ఎలాంటి బ‌ల‌మైన ఆర్థిక నేప‌థ్యం లేక‌పోయినా, ఈయ‌నేమీ పారిశ్రామిక వేత్తో, లేక ప‌దుల కోట్ల రూపాయ‌ల పార్టీ ఫండ్ ఇచ్చే శ‌క్తిసామర్థ్యాలు లేక‌పోయినా.. ఎన్నిక‌ల‌కు రెండు మూడు నెల‌ల ముందు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఎంచ‌క్కా ఎంపీగా నెగ్గారు. అలా అయాచితంగా మాధ‌వ్ కు విజ‌యం ల‌భించింది.  ఇక మూడేళ్లుగా ఎంపీగా మాధ‌వ్ ప‌నితీరు, వివాదాలు, వీడియో వ్య‌వ‌హారం.. వీట‌న్నింటి నేప‌థ్యంలో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాధ‌వ్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా బ‌రిలోకి దింప‌గ‌ల‌దా? అనేది ప్ర‌శ్నార్థ‌కం.

మాధ‌వ్ కు పార్టీ నేత‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భించింది. హిందూపురం లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు.. మాధ‌వ్ ప‌ట్ల సానుకూలంగానే స్పందించారు. దీనికి తోడు కురుబ సంఘాలు మాధ‌వ్ కు హార‌తులు ప‌ట్టాయి. ఆయ‌న‌కు పూర్తి మద్ద‌తు ప్ర‌క‌టించాయి.  ఇదంతా బాగానే ఉంది కానీ... హిందూపురం ఎంపీ టికెట్ విష‌యంలో మాధ‌వ్ నే మ‌రోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్య‌త‌లోకి తీసుకుంటుందా? అనేది ప్ర‌స్తుతానికి స్ప‌ష్ట‌త లేని అంశ‌మే.

ఎందుకంటే.. మాధ‌వ్ విష‌యంలో నాన్ లోక‌ల్ అంశ‌మూ మొద‌టి నుంచి ఉంది. ఆయ‌న క‌ర్నూలు జిల్లాకు చెందిన వ్య‌క్తి. ఇదీ తెలుగుదేశం పార్టీ వాళ్లు ప్ర‌స్తావించే అంశ‌మే. ఇక బీసీల విష‌యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ‌తంతో పోలిస్తే ఇప్పుడు మ‌రింత సానుకూల‌త పెరిగింది. జ‌గ‌న్ పెట్టిన సంక్షేమ కార్య‌క్ర‌మాల ద్వారా బాగా ల‌బ్ధి పొందుతున్న వారిలో బీసీలే ముందు వ‌ర‌స‌లో ఉన్నారు.

రాయ‌ల‌సీమ జిల్లాల్లో.. బోయ‌, కురుబ‌, సాలె సామాజిక‌వ‌ర్గాల్లో జ‌గ‌న్ ప‌ట్ల చాలా సానుకూల వాతావ‌ర‌ణం ఉంది. ఇది క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో.. బీసీ సామాజిక‌వ‌ర్గాల్లోనే మ‌రొక అభ్య‌ర్థి దొర‌క‌డం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం క‌ష్ట‌మైన‌ది కూడా కాదు! ప్ర‌స్తుతం పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న శంక‌ర్ నారాయ‌ణ ను హిందూపురం ఎంపీగా పోటీ చేయించే ఆప్ష‌న్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడీగా ఉంది!

హిందూపురం లోక్ స‌భ ప‌రిధిలో.. ఇంకా కురుబ నేత‌లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఎంపీ ప‌ద‌వికి పోటీ ప‌డ‌ద‌గ్గ శ‌క్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో... మాధ‌వ్ మంచోడైన‌ప్ప‌టికీ, వీడియో వ్య‌వ‌హారం లో ఆయ‌నను శంకించేది లేద‌ని అంటున్న‌ప్ప‌టికీ.. అదంతా తెలుగుదేశం పాచికే అయినా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యామ్నాయ నేత‌ను ఎంచుకునే అవ‌కాశాలు అయితే గ‌ట్టిగానే క‌నిపిస్తున్నాయి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?