Advertisement


Home > Politics - Gossip
ముద్రగడ విషయంలో సర్కారు అతిచేస్తోందా?

అతి సర్వత్ర వర్జయేత్ అంటారు పెద్దలు! కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కొన్ని విషయాల్లో ‘అతి’ పోకడల్ని ఆశ్రయిస్తోందని పలువురిలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కాపునాయకుడు ముద్రగడ పద్మనాభం విషయాన్నే తీసుకుంటే.. ఆయన అటూ ఇటూ కదలడానికి కూడా ఆంక్షలు పెడుతూ.. పోలీసులు లేని హైప్ క్రియేట్ చేస్తున్నారని... మితిమీరిన ఆంక్షల కారణంగా.. ముద్రగడ అంటే పాజిటివ్ అభిప్రాయం ఉన్న కాపు వర్గం ప్రజల్లో ఆగ్రహానికి ప్రభుత్వం గురవుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ముద్రగడ పాదయాత్ర చేస్తానంటే.. అప్పట్లో  పోలీసుల మోహరింపు కవాతులు అనేకం నిర్వహించి, రోడ్లన్నిటినీ తనిఖీ కేంద్రాలుగా మార్చేసి.. బీభత్సం సృష్టించిన చంద్రబాబు సర్కారు... దానికి శాంతి భద్రతలతో ముడి ఉన్నట్లుగా ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకుంది. తాజాగా ఆయన ‘ఆత్మీయ పలకరింపు’ పేరుతో కోనసీమలోని కాపు సోదరుల ఇళ్లకు వెళ్లి పలకరించేందుకు బయల్దేరినా కూడా హౌస్ అరెస్టు చేసేసి ఆంక్షలు విధిస్తూ.. ప్రభుత్వం కొంచెం ఎక్స్ ట్రాలు చేస్తున్నదని ప్రజలు భావిస్తున్నారు. 

నిజానికి ముద్రగడ ఉద్యమాలు తొలుత ప్రమాదకర సంకేతాలతో కనిపించినా, తర్వాతి కాలంలో వాటిలో డిమాండుల తీవ్రత తప్ప, ప్రమాదకర పోకడల తీవ్రత తగ్గింది. కానీ రైలు దహనం ఎపిసోడ్ నే పదేపదే భూతద్దంలో చూపిస్తూ.. కాపుల ఉద్యమం అంటేనే ఖచ్చితంగా అది హింసాత్మకంగా మారి తీరుతుందన్నట్లుగా బాబు ప్రభుత్వం ట్రీట్ చేసింది. ఆయన పాదయాత్రను పలుమార్లు అడ్డుకుంది. చివరికి విసిగిపోయిన ముద్రగడ పద్మనాభం... చంద్రబాబు చెబుతున్న ప్రకారం డిసెంబరు 6వ తేదీ వరకు తన ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.

అప్పటిలోగా కాపు రిజర్వేషన్లకు సంబంధించిన నిర్ణయం రాకపోతే మాత్రం మళ్లీ పోరాటంలోకి దిగదలచుకున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు కూడా. అప్పటినుంచి ప్రభుత్వం జోలికి రాకుండా, ప్రకటనలు, ఉద్యమాలతో చికాకు పెట్టకుండానే ఉన్నారు. ముద్రగడ వ్యక్తిగతంగా ఎన్ని పర్యటనలు అయినా పెట్టుకోవచ్చునంటూ ఇటీవలి హోంమంత్రి చినరాజప్ప ప్రకటించారు కూడా.

తాజాగా తాను పాదయాత్ర సంకల్పించినప్పుడు కిర్లంపూడి రావడానికి ప్రయత్నించి, పోలీసు ఆంక్షల కారణంగా కనీసం తనను కలవలేకపోయిన కాపు సోదరుల ఇళ్లకు తానే వెళ్లి వారిని పలకరించడానికి ఆయన ఒక కార్యక్రమం నిర్దేశించుకున్నారు. దాని ప్రకారం ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపుల ఇళ్లకు ఆయన వెళ్లి పలకరించి వస్తారనేది షెడ్యూలు. ఇది కేవలం రెండు రోజుల కార్యక్రమమే. ఇదేమీ ప్రదర్శన, బహిరంగ సభల సిరీస్ కూడా కాదు.

కానీ.. పోలీసులు దీనిని కూడా అడ్డుకుని ఆయనను హౌస్ అరెస్టు చేశారు. దాంతో  ఈ అంశానికి రావాల్సిన దానికన్నా ఎక్కువ ప్రచారం దక్కుతోంది. తగు జాగ్రత్తలతో అనుమతిస్తే సింపుల్ గా పోయేదానికి , నిషేధాజ్ఞల ద్వారా సీరియస్ ఎపిసోడ్ గా మారుస్తున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు సర్కారు ముద్రగడ విషయంలో గోటితో పోయే వాటిని గొడ్డలి దాకా తెస్తున్నదని ప్రజల్లో సెటైర్లు  వినిపిస్తున్నాయి.