cloudfront

Advertisement


Home > Politics - Gossip

గులాబీ సురేష్ : అచ్చంగా డీఎస్ స్థానంలోకి!

గులాబీ సురేష్ : అచ్చంగా డీఎస్ స్థానంలోకి!

కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి, తెరాసలోకి ప్రవేశించి అనంతరం రాజ్యసభ ఎంపీగా ఒక హోదాను దక్కించుకున్న కీలక నాయకుడు ధర్మపురి శ్రీనివాస్. గులాబీ పార్టీలో ఇప్పుడు ఆయనకు కష్టకాలం నడుస్తోంది. గులాబీ బాస్ కేసీఆర్, ఎంపీ డీఎస్ ను పూర్తిగా పక్కన పెట్టారు. ఆయన కొడుకును వివిధ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. దానికి తగినట్లుగానే డీఎస్ తెలంగాణ ప్రభుత్వం మీద, మరోరకంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మీద గుర్రుగా ఉన్నారు. అందుకే ఆయన టీఆర్ఎస్ ను వదిలిపెట్టి తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్ళాలని అనుకుంటున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

అయితే తమాషా ఏమిటంటే.. డీఎస్ కాంగ్రెస్ లోకి వెళ్లడం ద్వారా ఏర్పడే ఖాళీని అచ్చంగా అదే తరహాలో భర్తీ చేయడానికి మరో సీనియర్ నాయకుడు కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వలస వెళుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి జమానాలో శాసనసభ స్పీకర్ గా పనిచేసిన సురేష్ రెడ్డి ఇప్పుడు తెరాసలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

డీఎస్ తో విభేదాలు ఉన్న సురేష్ రెడ్డి , ఆయనను తిరిగి కాంగ్రెస్ లోకి చేర్చుకోవాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని సమాచారం. అందుచేతనే డీఎస్ ఇటు వచ్చేలోగా, తాను అటు వెళ్లిపోవడానికి ఆయన 12వ తేదీని ముహూర్తంగా కూడా నిర్ణయించుకున్నారు. ట్విస్టు ఏంటంటే... తెరాసలో చేరడానికి సిద్ధపడిన సురేష్ రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తాం అని కేసీఆర్ ఆశ పెట్టినట్లు తెలుస్తోంది. అంటే డీఎస్ పోకతో ఏర్పడే ఖాళీని అచ్చంగా అలాంటి వలస నేతతోనే భర్తీ చేయబోతున్నారన్నమాట.

సురేష్ రెడ్డి గతంలో నిజామాబాద్ జిల్లా  బాల్కొండ నుంచి పోటీచేసి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. తరువాత ఆర్మూర్ నియోజకవర్గానికి మారి ఓడిపోయారు. ఇప్పుడు ఆ రెండు నియోజక వర్గాలకు కూడా తెరాస అభ్యర్ధులను ఆల్రెడీ ప్రకటించేసింది. ఎమ్మెల్యేగా ఛాన్సు లేకపోయినా పార్టీలోకి వస్తున్నందుకు ఆయనకు రాజ్యసభ సీటును తెరాస కానుకగా ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.

తెరాస నుంచి కాంగ్రెస్ లోకి డీఎస్ తో పాటు కొండా సురేఖ కూడా వెళ్తున్న సంగతి తెలిసిందే. ఆ కోణంలోంచి చూసినప్పుడు.. కాంగ్రెస్ నుంచి కూడా ఇతరత్రా తాయిలాల ఆశ చూపించి తెరాసలో చేర్చుకోవాలని వారు ట్రై చేస్తున్నారు. టికెట్లు ఇచ్చే అవకాశం లేకపోయినా.. (ఆల్రెడీ జాబితా ప్రకటించేశారు గనుక) కేవలం అభివృద్ధి చూసి తమ పార్టీలోకి వస్తున్నారని టముకు వేసుకోడానికి వారికి అవకాశం చిక్కుతుందన్నమాట.