Advertisement


Home > Politics - Gossip
హారతుల చంద్రబాబు.. దక్షిణలు పడతాయా?

ఈ మధ్యకాలంలో చంద్రబాబు తరచూ హారతి పల్లెంతో కనిపిస్తూ ఉన్నారు. కృష్ణా హారతి అని, గోదావరి హారతి అని రెండు మూడేళ్ల నుంచి హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత పట్టిసీమ హారతి అన్నారు. ఆ తర్వాత ఎక్కడిక్కడ చెరువులకు, కాలువలకు హారతి ఇవ్వాలని.. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రోగ్రామే పెట్టారు.

ఇవి కాకుండా.. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు ముచ్చుమర్రి, పులివెందుల.. ఇలా ఎక్కడకు వెళ్లినా అక్కడా హారతి పల్లెం ఒకటి చూపిస్తున్నారు. ఇక అనంతపురం జిల్లాలకు వెళ్లినప్పుడల్లా హారతులే! ఇప్పటికే మూడు నాలుగు దఫాలుగా బాబు ఆ జిల్లాకు వెళ్లి హారతులు ఇచ్చి వచ్చారు. ఇక ఈ పరంపరలో ఇటీవల ఆ జిల్లాలోని కొత్తచెరువు, ధర్మవరాలకు వెళ్లి వేరువేరుగా హారతి కార్యక్రమాలు నిర్వహించారు.

కొత్త చెరువుకు ఆనుకుని ఉండే బుక్కపట్నం చెరువుకు, ధర్మవరం చెరువుకు చంద్రబాబు నాయడు హారుతులు ఇచ్చారు. స్వయంగా హారతి పల్లెం పట్టుకుని బాబు మీడియాకు పోజులు ఇచ్చారు. ఇలా చంద్రబాబు నాయడు ఈ మధ్యకాలంలో హారతి కర్పూరాలతోనే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు.

ఈ హారతులు ఇవ్వడం వరకూ బాగానే ఉంది కానీ.. ఈ హారతులకు దక్షిణగా ఓట్లు పడతాయా? అనేదే ఇప్పుడు సందేహం. చంద్రబాబు నాయుడు ఈ హారతులు పట్టడంలో ఒకటే సందేశం ఉంది. తనే ఈ చెరువులకు కాలువలకు నీళ్లు అందించా అని చెప్పుకోవడం బాబు ఉద్దేశం. మీడియా కూడా ఇదే విధంగా ప్రొజెక్ట్‌ చేస్తోంది. కానీ.. చంద్రబాబు ఇప్పుడు ఇలా హారతులు ఇచ్చి ప్రచారం పొందుతున్నాడంటే అదంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి పుణ్యమే అని వేరే చెప్పనక్కర్లేదు.

హంద్రీనీవా ప్రాజెక్టు విషయంలో ఎన్టీఆర్‌ హయాంలో పునాదులు పడ్డాయి. శ్రీశైలం నీళ్లను రాయలసీమ అవసరాలకు తీసుకొచ్చే విధంగా డిజైన్‌ చేసిన ఈ ప్రాజెక్టు అప్పట్లో వేసిన పునాదిరాళ్లు దశాబ్దం కాలం పాటు బండరాళ్లుగానే మిగిలిపోయాయి. ఎన్టీఆర్‌ను దించేసి సీఎం అయిన చంద్రబాబు నాయుడు హంద్రీనీవా ప్రాజెక్టుకు అర్ధరూపాయి నిధులు కేటాయించలేదు. అసలు ఆ ప్రాజెక్ట్‌ ఒకటి ఉందని స్థానికులు కూడా మరిచిపోయారు.

అయితే 2004లో వైఎస్‌ వచ్చాకా మళ్లీ పరిస్థితులు మారాయి. హంద్రీనీవాకు జీవం వచ్చింది. 2006 సమయానికి మొత్తం ప్లాన్‌ రెడీ అయ్యింది. 2007కు భూ సేకరణ దాదాపు పూర్తి అయ్యింది. పరిహారాలు చెల్లించడం కూడా జరిగింది. 2008 చివరకళ్లా.. దాదాపు కాలువలు పూర్తి చేశారు. 2009 నాటికి హంద్రీనీవాకు ఇక నీళ్లు లాంఛనమే అనేంత వరకూ వచ్చింది వ్యవహారం. అయితే.. అదే సమయంలో వైఎస్‌ మరణించారు.

అక్కడ నుంచి రాష్ట్ర రాజకీయం రచ్చ రచ్చగా మారడంతో.. హంద్రీ పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఆ తర్వాత కిరణ్‌ సీఎం అయ్యాకా.. మళ్లీ వాటికి కాస్త ఊపు, కాసిన్ని నిధులు వచ్చాయి. వైఎస్‌ హయాంలో కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీళ్లు అందించే ఈ ప్రాజెక్టుల పనులకంతా 80శాతం నిధుల కేటాయింపుతో పాటు.. పనులు కూడా దాదాపు అదేస్థాయిల్లో పూర్తి అయ్యాయి. ఇక కిరణ్‌ కుమార్‌ రెడ్డికి సొంతజిల్లా, రాయలసీమ మీద ఉండిన కాస్తంత ప్రేమతో.. ఈ ప్రాజెక్టుకూ ఆయన కొంత చేశారు. కిరణ్‌ వాటా పదిశాతం అనుకున్నా.. ఇక మిగిలిన పదిశాతం పనులకూ చంద్రబాబుకు మూడు సంవత్సరాలు పట్టింది.

గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్లలో తొలిసారి నీళ్లు అనంతపురం జిల్లా చివరి వరకూ వచ్చాయి. అయితే.. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తికాలేదు. నీళ్లు చిత్తూరు వరకూ వెళ్లాలి. చిత్తూరు జిల్లాలో కూడా వైఎస్‌ హయాంలోనే పనులు మొదలయ్యాయి. అయితే.. ఇప్పుడు జస్ట్‌ ఇంకో పది, పదిహేను కిలోమీటర్ల మేర కాలువ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. అవి పూర్తి కావడంలేదు. కానీ.. అనంతపురం వరకూ నీళ్లు వచ్చాయి కదా.. దీన్నంతా క్యాష్‌ చేసుకోవడానికి.. చంద్రబాబు నాయుడు హారతుల మీద హారతులు ఇస్తున్నారు.

తన వల్లనే నీళ్లు అని చెప్పుకొంటూ ఉన్నారు. అయితే.. ఈ ప్రాజెక్టు కాలువల పనులను ఎప్పటికప్పుడు స్థానికులు గమనిస్తూనే ఉన్నారు. ఎప్పుడేం జరిగిందో వాళ్లంతా చూస్తూనే ఉన్నారు. మధ్యలో చంద్రబాబు వచ్చి హారతులు ఇస్తున్న వైనాన్నీ వాళ్లు గమనిస్తున్నారు. తెలుగుదేశం వాళ్లు మాత్రం ఈ హారతులు చూపించి.. అంతా తామే చేశామని చెప్పుకొంటున్నారు. మరి కరువు సీమలో ఈ మాత్రం నీటి ప్రవాహం క్రెడిట్‌ ఎవరిదో.. ప్రజలకే స్పష్టంగా తెలుసు. అయితే తెలుగుదేశం వాళ్లు మాత్రం దీన్ని ఓటు బ్యాంకు రాజకీయంగానే చూస్తున్నట్టున్నారు. అలాగైతే.. ప్రజలు క్రెడిట్‌ ఎవరికి ఇస్తారో.. వచ్చే ఎన్నికలే సమాధానం కాగలవు!