Advertisement


Home > Politics - Gossip
హరిబాబుకు చెక్‌?

బీజేపీకి నూతన సారధి 

యూపీ విజయంతో ఏపీలోనూ మార్పులు

కమల వికాసానికి కసరత్తులు.. మళ్లీ ఆకర్ష్‌ మంత్రం

సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చిందన్న సామెత ఏపీ బీజేపీకి సరిగ్గా సరిపోతుంది. ఎక్కడో ఉత్తరభారతాన కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించడమేమిటి, ఏపీలోనూ అదే జరగాలని కోరుకోవడమేమిటి, అన్నదే తడవుగా సమూల మార్పులకు శ్రీకారం చుట్టాలనుకోవడమేమిటి, హాయిగా, సాఫీగా ఏపీ అధ్యక్ష పదవిలో కూర్చున్న కంభంపాటి హరిబాబు కుర్చీ కిందకు నీళ్లు రావడమేమిటి, ఇదంతా చూస్తూంటే ఏపీలో బీజేపీ వికాసం సంగతేమో కానీ మార్పు చేర్పులలో భాగంగా హరిబాబుకు ఉద్వాసన పలకడం మాత్రం ఖాయంగా కనిపిస్తోందని అంతా అం టున్నారు. ఇప్పటికి అయిదేళ్లుగా నిరాటంకంగా బీజేపీ అధ్యక్ష హోదాలో పెత్తనం చేస్తున్న ఓ సామాజికవర్గానికి కూడా ఈ పర్యాయం చుక్కెదురు తప్పదన్న మాట కూడా వినపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో రికార్డు స్ధాయి విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ చూపు ఆంధ్రప్రదేశ్‌పై పడింది, ఇక్కడ కూడా కమల వికాసానికి కావాల్సిన సరంజామాను సమకూర్చుకోవాలని ఆ పార్టీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. 

పార్టీని సంస్ధాగతంగా సమూలంగా మార్చాలన్నది జాతీయ అధినాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం చూపు హరిబాబు కుర్చీపైనే పడిందని కాషాయ శిబిరం పేర్కొంటోంది. ఏపీ బీజేపీకి పేరుకు అధ్యక్షునిగా ఉన్న హరిబాబు పార్టీని గత మూడేళ్ల కాలంలో ఏ మాత్రం సంస్థా గతంగా బలోపేతం చేయలేకపోయారన్నది సొంత పార్టీ లోని వారే అంటున్నారు. తెలుగుదేశానికి సిసలైన మిత్రపక్షంగా వ్యవహరించడంతోనే పొద్దు పుచ్చడం తప్ప పార్టీని నిర్మాణాత్మకమైన రాజకీయ పక్షంగా తీర్చిదిద్దడంలో ఆయన వైఫల్యం చెందారని అంటున్నారు. విభజన తరువాత ఏపీలో కమల వికాసానికి బాగా కలసివస్తుందనుకున్న అంచనాలు తప్పడమే కాకుండా, టీడీపీకి పక్క వాయిద్యంగా మిగిలిపోయిందన్న విమర్శలూ ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీలో బలమైన సామాజికవర్గానికి పట్టంకట్టడమే కాకుండా నోరున్న నేతకు అగ్ర నాయకత్వం అందిస్తే తప్ప వచ్చే ఎన్నికలలో పార్టీ పరిస్థితి మెరుగుపడదన్న అంచనాకు అధినాయకత్వం వచ్చినట్లుగా తెలు స్తోంది. దానా దీనా తేలేదేమిటంటే ఏపీ బీజేపీ అధ్యక్షునిగా హరిబాబును తప్పించడం తధ్యమని. ఆ ముచ్చట మరికొద్ది రోజులలో జరిగి తీరుతుందని ఆయన వ్యతిరేకులు బల్లగుద్ది మరీ చెబుతూండడం గమనార్హం.

ప్రమాదంలో పార్టీ అస్తిత్వం...!

విభజన తరువాత రెండు రాష్ట్రాలలో పాగా వేయవచ్చు నన్న ఉద్దేశ్యంతోనే నాడు బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా విడగొట్టేందుకు యూపీఏ సర్కార్‌కు సహకరించింది. ఈ రాజకీయ స్వార్ధంతోనే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కాంగ్రెస్‌తో కలసి మరీ విభజన బిల్లును పాస్‌ చేయించింది. తీరా విభజన జరిగాక రెండు తెలుగు రాష్ట్రాలలో టీడీపీ, టీఆర్‌ఎస్‌ రాజ్యాలు ఏర్పడ్డాయి. బీజేపీ ఏపీలో ఉనికిని నిలుపుకుంది తప్ప ఎక్కడా తన బలాన్ని చాటుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ క్రమంలో ముచ్చటగా మూడేళ్ల పుణ్యకాలం గడచిపోయింది. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. పాతాళం లోతున పడిపోయిన కాంగ్రెస్‌ సైతం అస్థిత్వ పోరాటం చేస్తోంది, సోదిలోకి రాని వామపక్షాలూ తమ గొంతుని బాగానే వినిపిస్తున్నాయి.

 ప్రధాన విపక్షం వైసీపీతో పాటు, కొత్తగా జనసేన వంటి పార్టీలు కూడా జనంలోకి వస్తున్నాయి, కానీ కేంద్రంలో అధికారం చలాయిస్తూ ఏపీ సర్కార్‌తో కలసి అధికారం పంచుకుంటున్న బీజేపీలో మాత్రం ఎక్కడా చలనం కనిపించడంలేదు. ఆ పార్టీకి చెందిన ఇద్దరు రాష్ట్ర మంత్రులతో పాటు, ఇద్దరు ఎంపీలు కూడా పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలనూ చేపట్టడంలేదు, ఏపీ బీజేపీ అధ్యక్షునిగా ఉన్న విశాఖ ఎంపి హరిబాబు పార్టీ కార్యక్రమాలపై ఏనాడు పెద్దగా దృష్టి పెట్టలేదన్నది నిష్టుర సత్యం. మోడీ హవాలో నాడు విశా ఖలో గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే తప్ప సాధించిందీ లేదు, కొత్తగా పార్టీ బలోపేతమైనదీ లేదు. నానాటికీ తీసికట్టుగా పార్టీ మారుతున్నా అధ్యక్షుని హోదాలో ఏనాడు హరిబాబు సరిదిద్దిన ప్రయత్నం చేయకపోవడమే అసలైన చిత్రం. మిత్రపక్షమని బీజేపీ ఎంతగా టీడీపీ కొమ్ము కాస్తున్నా అధికార పార్టీ నాయకులు మాత్రం నిత్యం బీజేపీని విమర్శిస్తూంటారు, కేంద్రసాయంపై దుమ్మెత్తి పోస్తారు, దానికి సైతం సరైన సమాధానం ఇచ్చుకోలేని దైన్య స్థితిలో ఏపీ బీజేపీ నాయకత్వం ఉంది. ప్రత్యేక హోదా విషయంలో తెలివిగా బీజేపీని తెలుగుదేశం పార్టీ ఇరికించిందన్నది రాజకీయం ఆ మాత్రం తెలిసిన వారందరికీ అర్ధమయ్యే విషయం, పెద్ద నోట్లరద్దు విషయంలోనూ బీజేపీనే దోషిగా నిలబెట్టే ప్రయత్నం విజయవంతంగా పసుపు పార్టీ చేసింది, విశాఖకు సంబంధించి రైల్వేజోన్‌ రాకపోవడానికి కూడా కేంద్రమే కారణమని తెలుగుదేశం మంత్రులు, ఎంపీలు నిత్యం ఆరోపణలు చేస్తూంటారు.

 విభజన హామీలను నెరవేర్చడంలేదని, కేంద్రం ఏపీని పట్టించుకోవడంలేదని, కేవలం చంద్రబాబు సమర్ధవంతమైన నాయకత్వం ఫలితంగానే ఏపీలో అభివృద్ధి సాగుతోందని టీడీపీ నేతలు నిత్యం వల్లె వేస్తున్నా తమకు పట్టనట్లుగా ఏపీ బీజేపీ ఉంటుంది, హోదాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చామని, అలాగే, విశాఖకు రైల్వేజోన్‌ ఇచ్చే విషయంలో కృష్ణా, గుంటూరు టీడీపీ నేతలే మోకాలడ్డుతున్నారన్న వాస్తవాలను జనానికి చెప్పడంలోనూ విఫలమయ్యారు. ఇక, వివిధ రకాలైన గ్రాంట్ల రూపంలో ఏపీకి పెద్దఎత్తున కేంద్రం చేస్తున్న సాయాన్ని కూడా విడమరచి చెప్పె కమలనాధులు కరవయ్యారు. ఇది చాలదన్నట్లుగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తరచూ విశాఖ పర్యటనలో చంద్రబాబు సమర్ధ నాయకత్వాన్ని పొగడడం ద్వారా ఏపీ బీజేపీకి చేయాల్సి నంత నష్టాన్ని చేసిపోతున్నారు. బీజేపీ విస్తరించే అవకాశాలున్నా చేజేతులా వదులుకోవడమే కాదు, పార్టీలోకి వస్తామన్న వారిని కోరి మరీ టీడీపీలోకి పంపించడం ద్వారా తమ గొయ్యిని తామే తవ్వుకుంటున్న శల్య సారధ్యం ఇపుడు ఏపీ బీజేపీలో ఉందన్నది కఠినసత్యం. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు బీజేపీ అస్థిత్వం ప్రమాదంలో పడిందన్నది ఆ పార్టీలోని హితైషులతో పాటు, రాజ కీయ పండితులు కూడా అర్ధం చేసుకుంటున్న విషయం. కానీ, టీడీపీతో కలసి కాపురం చేయడమే తమకు చాలను కుంటున్న ఏపీ బీజేపీ నాయకత్వానికి మాత్రం అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

గ్రూపుల గోలతో అసలుకే ఎసరు!

అసలే అంతంతమాత్రం.. అందులోనూ అనైక్యత వెరసి పార్టీని మరింతగా దిగజారుస్తున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షునిగా సమర్ధ నాయకత్వాన్ని అందించడంలో విఫలమైన హరిబాబు గ్రూపు రాజకీయాలను పెంచిపోషించడంలో మాత్రం విజయవంతమవుతున్నారన్న ఆరోపణలు వినిపి స్తున్నాయి. టీడీపీపై విపరీతమైన వత్తిడిచేసి మరీ సాధిం చుకున్న ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో చావో రేవో అన్నట్లుగా పోరాడాల్సిన పార్టీ నేతలు సహాయ నిరాకరణ చేయడమే అసలైన విడ్డూరం. తన ఇలాకాలో జరుగుతున్న ఎమ్మెల్సీ పోరులో సాక్షాత్తు ఏపీ బీజేపీ అధ్యక్షుడే మొక్కుబడిగా పనిచేయడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడు తోంది. ఉమ్మడి ఏపీ బీజేపీకి తొలి అధ్యక్షునిగా పనిచేసిన సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ పీవి చలపతిరావు కుమారుడు పీవీఎస్‌ మాధవ్‌కు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు లభించింది. ఆయన విజయానికి మనస్పూర్తిగా పనిచేయాల్సిన కమలనాధులు వర్గ పోరాటాలు చేసి ఉన్న అవకాశాలను సైతం దూరు చేసుకున్నారు. అసలే టీడీపీకి బీజేపీ ఎదగడం అన్నది ఇష్టం లేదన్నది బహిరంగ రహస్యం. అందువల్లనే కాస్తో, కూస్తో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బలమున్న బీజేపీని చివరి వరకూ వేచి ఉండేలా చేసి మరీ నోటిఫికేషన్‌ అనంతరం మీకే సీటు అంటూ టీడీపీ తెలివిగా గోదాలోకి తోసోసింది. ఉన్న సమయం తక్కువ కావడం, టీడీపీ రాజకీయ చాణక్యం నేపధ్యంలో కమలనా ధులు కలసికట్టుగా ముందుకు అడుగులు వేయాల్సిన చోట కలహాలకే పెద్ద పీట వేశారు. 

తమకు టిక్కెట్‌ దక్కలేదని అసంతృప్తితో అరడజనుకు పైగా నాయకులు ప్రచారానికి దూరంగా ఉంటే, విశాఖకే చెందిన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు మొక్కుబడి తంతుతో కాలక్షేపం చేశారు. పీవి చలపతిరావుతో ఆది నుంచి విభేదాలు ఉన్న కారణంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు అంటీ ముట్టనట్గుగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఇక, విశాఖ ఉత్త ర నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తన ఎన్నికల సమయంలో పీవీ చలపతిరావు వర్గం సహకరించలేదన్న కారణంతో సహాయ నిరాకరణ చేశారని టాక్‌. సాక్షాత్తు ఏపీ బీజేపీ అధ్యక్షునిపైనే నమ్మకం లేని పీవీ చలపతిరావు వర్గీయులు ఏపీలో వెంకయ్య, హరిబాబు వ్యతిరేక వర్గంగా పేరున్న ఎమ్మెల్సీ సోమువీర్రాజు, బీజేపీ నాయకుడు రఘురాం వంటి వారిని నగరానికి రప్పించి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రచా రానికి వాడుకున్నారు. దాంతో, ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఉన్నచోటే పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. చివరి రోజులలో టీడీపీ అధినాయకత్వం జాగ్రత్తపడి తమ పార్టీశ్రేణులను రంగంలోకి దించడంతో బీజేపీ అభ్యర్థి ధీటైన పోటీ ఇచ్చారన్నది కమల శిబిరంలో వినిపిస్తున్న మాట. రేపు బీజేపీ గెలిస్తే ఆ గొప్పదనం టీడీపీదని, ఓడితే మాత్రం నిస్సందేహంగా బీజేపీదేనని ఆ పార్టీలోని నాయకులే చెబుతున్నారంటే వర్గపోరు ఎంతటి తీవ్రంగా పార్టీలో ఉందో అర్ధమవుతోంది.

పార్టీ విస్తరణకు చర్యలేవీ...!?

మూడేళ్ల క్రితం కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన రోజులలో బీజేపీ హవా అంతా ఇంతా కాదు, ఆ పార్టీలో చేరిపోదామని దాదాపుగా పెద్ద నాయకుల నుంచి చోటా మోటా నేతాశ్రీల వరకూ అంతా ఉవ్విళ్లూరారు. అటు వంటి తరుణంలో వారిని రాకుండా అడ్డుకోవడమే కాదు, తెలుగుదేశం పార్టీలో చేరిపోవాలంటూ రాయబేరాలు నడిపిన మహానుభావులూ కమల శిబిరంలో ఉన్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. మళ్లీ ఇపుడు యూపీలో రికార్డు స్థాయి విజయం రూపంలో బీజేపీకి మరో అవకాశం లభించింది. అయితే, గతంతో పోలిస్తే ఇపుడు బీజేపీలో చేరేందుకు ఒకటికి పదిమార్లు ఆలోచన చేసుకునే వారే ఉన్నారన్నది వాస్తవం. ఇందుకు ప్రత్యేక హోదాపై మాట తప్పడం ప్రధాన కారణమైతే, విశాఖకు రైల్వేజోన్‌ ఇవ్వ కపోవడం, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ వంటివి మంజూరు చేయకపోవడం కారణాలుగా ఉన్నాయి. 

అయినా సరే, ఇప్పటికైనా పార్టీని విస్తరించాలనుకుంటే బీజేపీకి చాలా అవకాశాలు ఉన్నాయి. విశాఖకు రైల్వేజోన్‌ను మంజూరు చేయడం, వెనుకబడిన జిల్లాలకు విస్తృతంగా నిధులను విడుదల చేయడం ద్వారా ఈ ప్రాంతంలో పాగా వేసేందుకు ఆ పార్టీకి మార్గాలు ఉన్నాయి. ఇప్పటికీ ఏ పార్టీలోనూ చేరకుండా తటస్ధంగా ఉన్న సీనియర్లు ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉన్నారు, అలాగే, కాంగ్రెస్‌లో ఉండలేక, టీడీపీ, వైసీపీలలో పొసగని నాయకగణమూ గణనీయంగానే ఉంది. అటువంటి వారిని దగ్గర చేసుకుని మూడు జిల్లాలలో పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేయాలంటే కేంద్రం ఈ మూడు జిల్లాలపైన అత్యంత శ్రద్ధను చూపించడంతో పాటు, పార్టీ పరంగానూ కీలకమైన మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే, సామాజికవర్గ సమీకరణలను కూడా బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. 

సోము.. కన్నాలకు ఛాన్స్‌ ఇస్తే మారనున్న రాజకీయం!

ఏపీ బీజేపీ ప్రక్షాళనలో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో పాటు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సోమువీర్రాజు పేరు కూడా ఇపుడు పార్టీలో వినిపిస్తోంది. ఈ ఇద్దరికీ బలమైన సామాజికవర్గం నేపధ్యం ఉండడమే కాదు, పార్టీని దూకుడుగా నడిపించే సామర్ధ్యం కూడా ఉందని అధి నాయకత్వం గట్టిగా నమ్ముతోంది. కన్నా లక్ష్మీనారాయణకు సారధ్యం అప్పగిస్తే ఉత్తరాంధ్ర జిల్లాలలో బీజేపీకి గణనీయమైన బలం లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పలువురు మాజీ మంత్రులతో పాటు, అధికార టీడీపీ, విపక్ష వైసీపీలలో ఉన్న నాయకులు కూడా బీజేపీలో చేరేందుకు ఆస్కారం ఉంటుంది. కన్నాకు ఉన్న పాత పరిచయాలు, ఆయన ద్వారా అగ్రనాయకత్వం ఇచ్చే హామీలతో పలువురు కమలం వైపుగా చూసే వీలుంటుంది. 

ఇప్పటికీ ఏ పార్టీలో చేరని మాజీమంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపీ సబ్బంహరి వంటి వారు రాజకీయ వేదిక కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే, కాంగ్రెస్‌లో పెద్ద తలకాయలుగా పేరున్న మాజీ మంత్రులు పి.బాలరాజు, కోండ్రుమురళీ, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి వంటి వారు కూడా బీజేపీ ఏపీ నాయకత్వం తీరు బట్టి, కేంద్రం ఇచ్చే హామీలను బట్టి పార్టీలు మార్చే అవకాశాలు ఉన్నాయి. పార్టీ నాయకత్వాన్ని మార్చిన అనంతరమే ఆకర్ష్‌ మంత్రాన్ని జపించాలని కూడా కమలనాధులు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా అత్యంత వెనుకబడిన జిల్లాలైన ఉత్తరాంధ్రాల ముఖద్వారమైన విశాఖ నగరం నుంచి ఎంపీగా ప్రాతి నిధ్యం వహిస్తూ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న హరిబాబు నాయకత్వంపై దిగువ స్ధాయిలోనూ, ఎగువ స్ధాయిలోనూ అసంతృప్తి సెగలు రాజుకున్న నేపధ్యంలో తొందరలోనే కీలకమైన మార్పులు ఉంటాయని, ఏపీ బీజేపీలో ఓ కీలక సామాజికవర్గాన్ని పార్టీ బాధ్యతల నుంచి దూరంగా ఉంచుతారని ప్రచారం మాత్రం జోరందుకుంది. 

-పివిఎస్‌ఎస్‌ ప్రసాద్