Advertisement


Home > Politics - Gossip
షాకింగ్: కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ కాదు!

థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుచేస్తానని.. మూడో కూటమితో కేంద్రంలో జెండా పాతేస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి ఇలా ప్రకటించారో లేదో అలా సోషల్ మీడియాలో సర్వేలు షురూ అయిపోయాయి. తెలంగాణలో కేసీఆర్ వారసుడనగానే సహజంగా ఎవరైనా కేటీఆర్ వైపే చూస్తారు. కానీ సోషల్ మీడియా మాత్రం సీన్ రివర్స్ లో ఉంది.

ఒకవేళ కేసీఆర్, దేశ రాజకీయాలతో బిజీ అయిపోతే రాష్ట్ర రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించే సత్తా ఒక్క హరీష్ రావుకు మాత్రమే ఉందంటూ సర్వేలు చెబుతున్నాయి. ఓవైపు తనయుడు కేటీఆర్ ను కేసీఆర్ ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తుండగా.. మరోవైపు ఇలాంటి ఫలితాలు రావడం ఆశ్చర్యకరమే.

నిజానికి రాజకీయాల్లో కేటీఆర్ కంటే హరీష్ రావు సీనియర్. కేసీఆర్ తలపెట్టిన తెలంగాణ ఉద్యమంలో ఆది నుంచి ఉన్నది హరీష్ రావు మాత్రమే. అంతేకాదు.. ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్న వ్యక్తి కూడా. ఎన్నికల సమయంలో కేసీఆర్, హరీష్ రావుదే హవా సాగింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పరిస్థితులు చకచకా మారిపోయాయి.

తనయుడు, మేనల్లుడు ఇద్దరికీ మంత్రి పదవులు ఇచ్చిన కేసీఆర్.. క్రమక్రమంగా కేటీఆర్ కు ప్రాధాన్యం పెంచారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్ని వ్యూహాత్మకంగా కొడుక్కు అప్పగించారు. అక్కడ్నుంచి మున్సిపల్ శాఖ కట్టబెట్టారు. మీడియాలో హరీష్ కంటే కేటీఆర్ కే ఎక్కువ ఫోకస్ వచ్చేలా చేయడంలో కేసీఆర్ నూరు శాతం సక్సెస్ అయ్యారు. అలా తన రాజకీయ వారసుడు కేటీఆర్ అనే ఫీలింగ్ ను పార్టీ శ్రేణుల్లో తీసుకురాగలిగారు.

ఇన్ని చేసినా సరిగ్గా ఎన్నికల ముందు సోషల్ మీడియాలో హరీష్ రావుకు అనుకూలంగా ఫలితాలు రావడం కేసీఆర్, కేటీఆర్ నే కాదు.. మొత్తం టీఆర్ఎస్ శ్రేణుల్నే ఆశ్చర్యానికి గురిచేసే అంశం. కాకపోతే ఇక్కడ ఊరట కలిగించే అంశం ఏంటంటే.. ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో, ఎవరికి వాళ్లు వ్యక్తిగత స్థాయిలో చేసుకున్న సర్వేలు మాత్రమే.

ఇప్పటివరకు ఏ మీడియా సంస్థ లేదా స్వతంత్ర సంస్థ ఈ దిశగా తెలంగాణలో సర్వే చేయలేదు. ఒకవేళ అలాంటి సర్వే జరిగి, అందులో కూడా హరీష్ రావుకు మెజారిటీ వస్తే కనుక కేసీఆర్ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం బెటర్.