Advertisement


Home > Politics - Gossip
హీరో మురిపెం ముగిసిపోతుందా?

వచ్చే ఎన్నికల్లో సినిమా హీరో కమ్‌ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పరిస్థితి ఏమిటి? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు అసెంబ్లీ టిక్కెట్టు అదీ హిందూపురానికే ఇస్తారా? లేక మరో నియోజకవర్గం ఇస్తారా? అదీ కాకపోతే పార్లమెంటుకు పోటీ చేయమంటారా? ఆ అవకాశమూ లేకపోతే రాజ్యసభకు పంపుతామంటారా? బాలయ్య బాబు మీద ఇన్ని సందేహాలేమిటి? ఆయన చంద్రబాబు వియ్యంకుడు మాత్రమే కాకుండా సొంత బావమరిది.

అంతే కాకుండా నందమూరి వారసుల్లో ప్రముఖుడు. కాదనం. కాని రాజకీయాల్లో ఈ బంధాలకు విలువ ఉండదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు రాజకీయ ప్రయోజనాలు ప్రధానం. ఇప్పుడాయనకు బాలయ్య కంటే కుమారుడు లోకేష్‌ భవిష్యత్తు ముఖ్యం. అందుకే కుమారుడి కోసం వియ్యంకుడిని ఏమైనా చేయొచ్చనేది సమాచారం. ఇది ఎంతవరకు నిజమనేది ఎన్నికల సమయానికి తేలుతుంది.

ప్రస్తుత సమాచారం ప్రకారం...వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి లోకేష్‌ను పోటీ చేయించాలని బాబు అనుకుంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న అతన్ని ప్రజానాయకుడిగా ఎక్స్‌పోజ్‌ చేయాలంటే ఎమ్మెల్యేగా ఎన్నిక చేయించాలి. ఎమ్మెల్సీగా ఎన్నిక చేయించినప్పుడే ప్రతిపక్షాలు ప్రధానంగా వైసీపీ విమర్శలు చేసింది. దమ్ముంటే ఎవరైనా ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఉప ఎన్నిక జరిపించి లోకేష్‌ను గెలిపించాలని సవాల్‌ విసిరింది.

దీనిపై చంద్రబాబు స్పందించకపోయినా సవాల్‌ను స్వీకరించిన టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు లోకేష్‌ కోసం రాజీనామా చేస్తామని ముందుకొచ్చారు. కాని లోకేష్‌ గెలుపుపై నమ్మకం లేకనో, ఇతర కారణమో చెప్పలేంగాని పరోక్ష పద్ధతిలో చట్టసభకు పంపారు. దీంతో అతనికి ప్రజలతో నేరుగా సంబంధాలు లేవు. దీన్ని అధిగమించాలంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే. అందుకే సురక్షిత నియోజకవర్గం కోసం చూస్తున్న బాబుకు హిందూపురం కనిపించింది.

టీడీపీకి కోట అయిన ఈ నియోజకవర్గంలో గెలుపు గ్యారంటీ. తొంభై శాతం దీన్నే ఖరారు చేయాలనుకుంటున్నారు. దీంతోపాటు కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలూ పరిశీలనలో ఉన్నాయి. గత ఎన్నికల్లో పదహారు వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన బాలయ్యకు హిందూపురం వదులుకోవడం ఇష్టం ఉండదు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని పలుమార్లు చెప్పాడు. కాని చంద్రబాబు అవకాశం ఇవ్వకపోతే చేసేదేమీ లేదు.

బాలయ్యను హిందూపురంలోనే కాదు, అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయించే ఆలోచన లేదనేది మరో సమాచారం. ఇందుకు కారణం ఆయన వివాదాస్పద ప్రవర్తన. ప్రజా నాయకుడైన బాలయ్య ప్రజలనే కొడుతుండటంతో టీడీపీ పరువు పోతోంది. తన వీరాభిమానులను ఆయన పలుమార్లు చెంప పగలగొట్టిన సందర్భాలున్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా జరగకపోయినా చెడ్డపేరు వచ్చింది. తాజాగా ఇలాంటి ఘటన మరోటి జరిగింది.

అసందర్భంగా ఆగ్రహం ప్రదర్శించడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మైనస్‌ అయింది. సినిమాలను వదులుకోని ఈ హీరో నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించడంలేదు. ఇదంతా చంద్రబాబు దృష్టిలో ఉంది. బాలయ్య ఎమ్మెల్యేగా మళ్లీ ఎన్నికైనా పార్టీకి ప్రయోజనం ఉండదనుకుంటున్నారు. అందుకే ప్రజలతో సంబంధం లేని రాజ్యసభకు పంపితే ఆయన బెడద తీరిపోతుందని అనుకుంటున్నారు.

2014 ఎన్నికలకు ముందు బాలయ్య అభిమానులు టీడీపీలో ఆయన స్థానం ఏమిటో తేల్చాలని పట్టుబట్టారు. లోకేష్‌ నెంబర్‌ 2 స్థానంలో అన్నీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయడం..మొదలైనవన్నీ నందమూరి అభిమానుల్లో అసహనం పెంచాయి. అప్పట్లో  ఎన్నికల షెడ్యూలు విడుదలైనప్పటికీ బాలయ్య విషయంలో బాబు ఏమీ మాట్లాడకపోవడం ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. 2014 ఎన్నికల్లో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, బరిలోకి దిగుతానని బాలయ్య ఎప్పుడో ప్రకటించాడు. తీరా ఎన్నికల 'కాలం' వచ్చినా ఆయనను బరిలోకి దించుతున్నారా? లేదా? అనేది బాబు ప్రకటించలేదు.

చాలామంది అభ్యర్థిత్వాలను ఖరారు చేసినా బాలయ్య గురించి మాట్లాడలేదు. చివరకు హిందూపురం ఇచ్చారు. అప్పట్లో హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి బాలయ్యను పోటీ చేయించాలని పార్టీ ఆలోచన చేసినప్పుడు 'నేను లోక్‌సభకు వెళ్లను. అసెంబ్లీకే పోటీ చేస్తా' అని బాలయ్య ప్రకటించాడు.  ''నాకు రాజకీయాలపై ఆసక్తి ఉంది.

భగవంతుడు నన్ను ఎప్పుడు రాజకీయాల్లోకి వెళ్లమని ఆదేశిస్తే అప్పుడు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను'' అని 2008లో బాలకృష్ణ ప్రకటించాడు. అప్పటి నుంచి బాలయ్య 'అరంగేట్రం' (ప్రత్యక్ష రాజకీయాల్లోకి) కోసం అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదురుచూడగా గత ఎన్నికల్లో సాధ్యమైంది. వచ్చే ఎన్నికల్లో ఏమవుతుందో...!