cloudfront

Advertisement


Home > Politics - Gossip

కోదండాస్త్రం... ఇప్పుడు హాట్ కేక్!

కోదండాస్త్రం... ఇప్పుడు హాట్ కేక్!

తెలంగాణ జనసమితి... తెజస... ఈ పార్టీ ఇంకా టాప్ గేర్ లోకి రాలేదు. ప్రజల నోళ్లలో  పార్టీ నానడంలేదు. మరోరకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్తు ప్రజానీకానికి ఈ పార్టీ ఇప్పటికి తెలుసా? అంటే కష్టమే! అయినా సరే... ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి దాదాపుగా తెరాస-యేతర పార్టీలన్నీ కూడా ఉవ్విళ్లూరుతున్నాయి. తెజస ఓకే అంటే చాలు.. వారు అడిగినన్ని సీట్లు ఇచ్చేసి.. పొత్తు పెట్టుకుని ప్రచారంలోకి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. పార్టీకి ఇంకా ప్రజాదరణ తేలకపోయినా.. మిగిలిన పార్టీల్లో వారికి ఎందుకంత క్రేజ్ ఉంటున్నది...?

ఈ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం.. ఆ పార్టీ సారధి... ప్రొఫెసర్ కోదండరామ్. ప్రొఫెసర్ కోదండరామ్ అంటే తెలంగాణ సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కాంగ్రెస్ ఏలుబడి సాగుతున్న రోజుల్లో.. కేసీఆర్-తెరాస రాష్ట్ర సాధనను కొలిక్కి తేలేకపోతున్న తరుణంలో జేఏసీని స్థాపించి.. గట్టి కార్యచరణతో దానిని ముందుకు తీసుకువెళ్లి ప్రభుత్వం మీద ఒత్తిడిపెంచి.. వారిని ఒప్పించి.. ప్రత్యేకరాష్ట్రం అనే స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడిగా ఆయనను ప్రజలు గుర్తుంచుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో కేసీఆర్ తో సమానమైన కీర్తి ఆయనకు ఉంది.

అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. కేసీఆర్ తో విభేదించిన ఆయన తిరిగి తన కాలేజీ పనికి వెళ్లిపోయారు. పదవీవిరమణ తర్వాత.. కేసీఆర్ ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ తెజసను కూడా స్థాపించారు. పార్టీ ఇంకా పూర్తిగా ప్రజల్లోకి వెళ్లకపోయినా.. ఒకసారి ఆయన రాష్ట్రమంతా చుడితే.. క్రేజ్ తప్పక ఉంటుందని అందరికీ తెలుసు. అందుకే అంతా ఆయనతో స్నేహాన్ని కోరుకుంటున్నారు.

చంద్రబాబు నాయుడు సీపీఐ, తెజసలు తమతో పొత్తులకు అనుకూలంగా ఉన్నాయని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ కోదండరాంతో ఎప్పటినుంచో టచ్ లోనే ఉంది. తాజాగా భాజపా కిషన్ రెడ్డి కూడా కోదండరామ్ ను కలిసి పొత్తులకు ప్రయత్నించినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెరాసను ఈ ఎన్నికల్లో ఎదుర్కోవడానికి కోదండాస్త్రం... బ్రహ్మాస్త్రమే అవుతుందని.. అందుకే అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఆయన స్థాపించిన తెజస పార్టీ హాట్ కేక్ లాగా కనిపిస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.