cloudfront

Advertisement


Home > Politics - Gossip

మీరిలా చేస్తోంటే.. బెల్లంముక్క ఎలా వస్తుంది?

మీరిలా చేస్తోంటే.. బెల్లంముక్క ఎలా వస్తుంది?

విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ పొందడం సంగతి దేవుడెరుగు.. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బెల్లం ముక్క కూడా రాదుట. ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్లం ముక్కయినా రాదని.. హక్కులు అన్నీ సాధిస్తాం అనే నినాదంతో దీక్షలు చేస్తున్న వాళ్లే సెలవిస్తున్నారు. అవును మరి- ఏ బెల్లం ముక్క అయినా ఎలా వస్తుంది? కరుణించాల్సింది ఢిల్లీ అయితే, రాష్ట్రంలోని గల్లీలో పొలికేకలు పెడితే ఎలా వస్తుంది. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా కడపలోనో, విశాఖలోనో, అనంతలోనో దీక్షాడ్రామాలు ఆడితే ఎలా వస్తుంది? అదే ప్రశ్నిస్తున్నారు ప్రజలు.

దీక్షల ముసుగులో సాగుతున్న తమ ఎన్నికల ప్రచార సభలలో భాగంగా.. తెలుగుదేశం పార్టీ తమ ఎమ్మెల్యేలు, ఎంపీలతో అనంతపురంలో రిలే దీక్ష నిర్వహించింది. ఈ సభలో వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంనుంచి బెల్లం ముక్క కూడా రాదని తెగేసి చెప్పేశారు. ఈ సంగతి తాను చంద్రబాబునాయుడుతో కూడా తేల్చి చెప్పేశానని అన్నారు. అయితే ‘నిజమే గానీ.. మనం ఏమీ చేయకుండా కూర్చుంటే ఎలా’ అని చంద్రబాబు అన్నారని కూడా జేసీ సెలవిచ్చారు.

అంటే ఏమిటన్నమాట... కేంద్రంనుంచి సాధించేది ఏమీ లేదనే సంగతి తెలుగుడేశం నాయకుల్లో కింది స్థాయి నుంచి అధినేత వరకు అందరికీ క్లారిటీ ఉంది. కాకపోతే.. ఎన్నికలు ముంచుకు వచ్చేస్తున్న తరుణంలో, ఏమీ రాకపోయినంత మాత్రాన... తాము ఏమీ చేయడం లేదని ప్రజలు నిందించకుండా ఈ దీక్షల పేరుతో డ్రామాలు నడిపిస్తున్నారన్నమాట. నిజానికి  కేంద్రంతో సఖ్యంగా ఉండడం ద్వారా, ఎన్డీయే లో భాగస్వామిగా ఉండడం ద్వారా వారి మీద ఒత్తిడి పెట్టి తమకు కావాల్సింది ఏమిటో సాధించుకోవాల్సిన స్థితినుంచి...  చంద్రబాబునాయుడు ఎలాంటి గత్యంతరంలేని పరిస్థితుల్లో తనను తాను రక్షించుకోవడానికి వారికి లొంగిపోయి.. బేరాలాడుకుని.. అమరావతి నగరానికి రాజధానిని తరలించేశారో ప్రజలందరికీ తెలుసు. ఆ విషయంలో చంద్రబాబు కోరిక నెరవేర్చారు గనుక.. ఇక రాష్ట్రప్రజలకు చేయాల్సిన వాటిని కేంద్రం లైట్ తీసుకుంది. నాలుగేళ్లు మౌనంగా కూర్చున్న చంద్రబాబు... ఎన్నికల సంవత్సరంలో ‘ఎన్డీయేతో తెగతెంపులు’ ఎపిసోడ్ తో శ్రీకారం చుట్టి, ప్రస్తుతం ‘దీక్షల’ ఎపిసోడ్లను సీరియల్ గా నడిపిస్తున్నారు.

బెల్లం ముక్క కూడా రాదని తెలిసి కూడా దీక్షలు, పోరాటం అంటూ ప్రజలను వంచించడం మాత్రం ఘోరం అని అందరూ అనుకుంటున్నారు.