Advertisement


Home > Politics - Gossip
కేటీఆర్ ఆయనకు ఏం ఆశ చూపారో?

కేవలం కొన్నిరోజుల్లో ముగిసిపోయిన రాజకీయ డ్రామా.. ఇప్పుడు తెలంగాణలో అనేక అంశాలపై చర్చకు కారణం అవుతోంది. కేటీఆర్ తనకు ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నందుకు ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ మనస్తాపం చెందారు.

కేసీఆర్ కు సన్నిహితుడు అయిన సోమారపు, ఆయన కొడుకు తన క్లాస్ పీకడాన్ని సహించలేకపోయారు. ‘కేటీఆర్ ఆశించినట్లుగా తాను పనిచేయలేకపోతున్నానని.. రాజకీయాలనుంచి తప్పుకుంటానని’ బహిరంగంగా ప్రకటించారు. అంతలోనే ఏదో మాయ జరిగింది. కేటీఆర్ ఆయనను హైదరాబాదు పిలిపించి మాట్లాడారు. ఆ వెంటనే.. ‘కేటీఆర్ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటా. రాజకీయాలనుంచి విరమించుకునే ఆలోచన లేదు’ అంటూ సోమారపు వెనక్కుతగ్గి.. మిన్నకుండిపోయారు.

ఆయన సేవలు పార్టీకి చాలా అవసరం అంటూ కేటీఆర్ కూడా కితాబిచ్చేశారు. ఈ మధ్యలో ఏం జరిగింది. అసలు రాజకీయాలనుంచే తప్పుకోవాలని.. ఆర్టీసీ ఛైర్మన్ హోదాను కూడా కాలదన్నుకోవాలనేంత రేంజిలో విరక్తి చెందిన సోమారపు సత్యనారాయణ మనసు మారేలాగా కేటీఆర్ ఆయనకు ఏం తాయిలం పెట్టారు? అనేది ఇప్పుడు తెరాస రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉంది. సోమారపు సత్యనారాయణ తన నియోజకవర్గంలో తనకంటూ సొంతంగా పట్టున్న నాయకుడు.

ఆయన గతంలో ఇండిపెండెంటు గానూ గెలిచారు. తర్వాత కాంగ్రెస్ తరఫున పీఆర్పీ మీద కూడా గెలిచారు. అనంతర పరిణామాల్లో తెరాసలోకి వచ్చి ఆ పార్టీ తరఫున కూడా గెలిచారు. ప్రజాబలం ఉన్న నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయనకున్న సీనియారిటీ, కేసీఆర్ తో సాన్నిహిత్యం వలన తెరాస సర్కారు ఏర్పడినప్పుడే ఆయనకు మంత్రిపదవి వస్తుందని అంతా అనుకున్నారు. అది దక్కలేదు. తర్వాత, ఆర్టీసీ ఛైర్మన్ అయ్యారు. రాముగండం మునిసిపాలిటీలో అసమ్మతులకు మద్దతు ఇచ్చినందుకు ఆయన కేటీఆర్  సీరియస్ గాతీసుకునే పరిస్థితిని కల్పించారు.

అయితే ఆయనను బుజ్జగించడానికి కేటీఆర్ మంత్రిపదవి ఆశ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రభుత్వంలో కుల సమీకరణల వలన కుదరకపోయినా, వచ్చే ప్రభుత్వంలో మీరు తప్పకుండా మంత్రి అవుతారు.. తప్పుకోవడం ఎందుకు? అంటూ కేటీఆర్ నచ్చజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో తాను విరమించుకుని, కొడుకును ఎమ్మెల్యేగా పోటీలోకి దింపాలని సోమారపు భావిస్తున్నట్లు ఒక ప్రచారం ఉంది.

ఇప్పుడు రాజకీయాల నుంచి విరమించుకుంటే.. దానిపై తిరుగుబాటు ముద్రపడి.. కొడుకు రాజకీయ భవిష్యత్తుకు కూడా ఇబ్బంది అవుతుందని.. అందుకే రాజకీయాల్లో కొనసాగాలని కూడా కేటీఆర్ చెప్పి ఉండొచ్చునని కొందరు అంచనా వేస్తున్నారు. మొత్తానికి సీనియర్ నేత అసంతృప్తి, అలక ఎపిసోడ్ ముగిసిపోయినట్లే ఉంది.