cloudfront

Advertisement


Home > Politics - Gossip

పంచాయతీ ఎన్నికలను ఎగ్గొట్టడం ఎలా?

పంచాయతీ ఎన్నికలను ఎగ్గొట్టడం ఎలా?

గ్రామస్వరాజ్య స్ఫూర్తిని నాశనం చేసేలా ఎన్నికలు నిర్వహించకపోవడం కరెక్టు కాదని, పంచాయతీలకు తక్షణం ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమ మీద వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత బయటపడకుండా, ప్రజల్ని మాయ చేయడానికి, తద్వారా అనుచిత రాజకీయ లబ్ధిపొందడానికి జరుగుతున్న కుట్రలను హైకోర్టు తీర్పు పరోక్షంగా ఎండగట్టినట్టు అయింది. మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనంటూ, కోర్టు మొట్టికాయ వేయడంతో రాష్ట్రప్రభుత్వం స్పందించక తప్పలేదు.

విశాఖ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నదని ప్రకటించారు. అయితే.. వాస్తవంలో పరిశీలిస్తే.. ఈ ఎన్నికలు నిర్వహించకుండా ఎగ్గొట్టడానికి ఎన్నెన్ని రకాల వక్రమార్గాలు ఉన్నాయో వాటన్నిటినీ అన్వేషించడానికి ప్రభుత్వం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది.

పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి తమ ప్రభుత్వం ఎన్నడూ సిద్ధంగానే ఉన్నదని, కాకపోతే బీసీ రిజర్వేషన్ల వ్యవహారం తేలకపోవడం వల్లనే... జాప్యం జరుగుతున్నదని ఇప్పుడు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బీసీ గణన, వారికి పంచాయతీల కేటాయింపు వంటి ఆటంకాలు ఉన్నాయని చెబుతున్నారు.

గతంలో 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో అన్ని వర్గాలకు కలిపి ఇచ్చిన రిజర్వేషన్లు 60 శాతానికి దాటిపోవడం వల్లనే అసలు గొడవ ప్రారంభం అయినట్లుగా తెలుస్తోంది. అప్పట్లో దీనిపై కేసులు నమోదు కావడంతో.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండేలా.. చర్యలు తీసుకోవాలని అప్పట్లో కోర్టు ఆదేశించింది.

ఆ తీర్పను రాష్ట్రప్రభుత్వం అడ్డంగా వాడుకోవాలని చూస్తున్నట్లు అనిపిస్తోంది. బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడం ఇంకా పూర్తి కానందువల్లనే.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేకపోతున్నాం అంటూ.. రాష్ట్రప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతుండడం విశేషం.

ఇన్నేళ్లలో ప్రభుత్వం ఈ విషయం నిగ్గుతేల్చడానికి ఏం చేసిందంటే మాత్రం వారి వద్ద జవాబు లేదు. ఒక పంచాయతీలో వీధిలైటు వెలగకపోయినా సరే.. తన డ్యాష్ బోర్డు ద్వారా తెలిసిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా డాంబికంగా చెప్పుకుంటూ ఉంటారు.

మరి టెక్నాలజీని ఇంతగా వాడే ముఖ్యమంత్రికి బీసీ రిజర్వేషన్లను తేల్చడం మాత్రం సాధ్యంకాదా? చేతకాదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి