cloudfront

Advertisement


Home > Politics - Gossip

అప్పటిదాకా మిమ్మల్ని నమ్మడం కష్టమే సార్!

అప్పటిదాకా మిమ్మల్ని నమ్మడం కష్టమే సార్!

‘ఇప్పటికి కూడా చేయకపోతే.. ఎప్పటికీ చేయలేం’ అనే డైలాగు మనం చాలా సినిమాల్లో చాలా రకాలుగా వింటూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి అభిప్రాయానికి వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. ‘ఈ ఎన్నికల్లోగా ప్రాణం పోయకుంటే.. ఇక పార్టీ ఎప్పటికీ బతికిబట్టకట్టే అవకాశం లేదు’ అనేదే వారి అభిప్రాయంగా మారినట్లుంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఒక ఊపు తీసుకురావడానికి కొత్త ఇన్చార్జి ఊమెన్ చాందీతో సహా, పార్టీలో మిగిలిన నాయకులంతా నానా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

రాష్ట్రాన్ని విభజించినందుకు ప్రజల్లో వెల్లువెత్తిన ఆగ్రహమే, ఏపీలో తమ పార్టీ పుట్టిముంచిందనే వాస్తవం వారికి తెలుసు. కాకపోతే.. మోడీ సర్కార్ ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం అనేది వారికి కనిపిస్తున్న ఏకైక ఆశాకిరణం. ఏపీకి తమ పార్టీ మాత్రమే ప్రత్యేకహోదా ఇవ్వగలదు.. ఇస్తుంది అంటూ, రాహుల్ యూపీఏ-3 ప్రభుత్వ సారధిగా గద్దెఎక్కిన వెంటనే.. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే ఫైలుపై తొలిసంతకం చేస్తారంటూ.. రాష్ట్ర ప్రజలను నమ్మించడానికి ఎవరివంతు కష్టం వారు పడుతున్నారు.

అయితే కాంగ్రెస్ నాయకులతో విషయంలో కూడా అచ్చంగా, భాజపా లాగానే ప్రజలకు అనేక సందేహాలు కలుగుతూ ఉన్నాయి. భారతీయ జనతాపార్టీ కూడా (హోదా మాటెత్తకపోయినా) విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు లాంటి సమస్త విభజన చట్టపు హామీలను నెరవేర్చడానికి భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నదని అంటూ ఉంటుంది. కాకపోతే.. ఏపీ ప్రజలను మాయలో పెట్టడానికి ఉద్దేశించిన ఇలాంటి ప్రకటనలు అన్నీ.. రాష్ట్ర భాజపా నాయకులు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకలు మాత్రమే మాట్లాడుతున్నారు.

ఢిల్లీ పెద్దలు పెదవి విప్పి స్పష్టమైన హామీలు ఇవ్వనందునే ఇవాళ ఏపీలో భాజపా.. ఒక్కసీటు గెలిస్తేచాలు అని మురిసిపోయే స్థాయిలో శవాసనం వేస్తున్నది. మరి అదే మాదిరిగా కాంగ్రెస్ కూడా వ్యవహరిస్తే ఎందుకు నమ్మాలి. తొలి సంతకం ఏపీ ప్రత్యేకహోదా ఫైలుమీదనే పెడతాననే సంగతి రాహుల్ స్వయంగా చెప్పాలి. అలా చెప్పించగలిగితేనే కాంగ్రెస్ రాష్ట్రంలో ఊళ్లు తిరుగుతూ ప్రజలను ఓట్లు అడగడానికి సాహసించాలి.

ఏపీ గురించి మోడీ పెదవి విప్పకుండా డ్రామాలు ఆడినట్టే, రాహుల్ కూడా పెదవి విప్పకుండా డ్రామాలాడుతూ.. రాష్ట్ర నేతలతో కల్లబొల్లి ప్రకటనలు చేయించి.. ఓట్లు దండుకోవాలని చూస్తే.. ప్రజలు అంత వెర్రిబాగులవాళ్లేం కాదు.