cloudfront

Advertisement


Home > Politics - Gossip

పరువు పోకుండా ఎలా? బాబు కుస్తీలు!

పరువు పోకుండా ఎలా? బాబు కుస్తీలు!

పరిస్థితులు అంతా బాగున్నప్పుడు ఇబ్బడి ముబ్బడిగా పాజిటివ్ ప్రచారం తెచ్చుకోవడం ఎలాగో ఆయనకు బాగా తెలుసు. కానీ.. పరిస్థితులు వక్రదృష్టితో చూస్తున్నప్పుడు, వికటించినప్పుడు కనీసం పరువు పోకుండా బయటపడడం ఎలాగో కొత్త! అందుకే ఇప్పుడు ఆర్థికవేత్తలు, పార్టీ సీనియర్లు, మేధావులతో కలసి కుస్తీలు పడుతున్నారు. కేంద్రం- రాష్ట్రం మధ్య ఆర్థిక వనరులు, ప్యాకేజీ నిధుల విషయంలో లెక్కల్లో వస్తున్న తేడాలు.. ఏతావతా రాష్ట్ర సర్కారు పరువు తీస్తాయేమో అని వారు భయపడుతున్నారు. తమ పరువు పోకుండా ఉండేలా.. ఏదో ఒక మధ్యేమార్గం చూసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది గానీ.. కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది.

నిధులకు సంబంధించి అన్ని అంశాల్లోనూ కేంద్ర – రాష్ట్ర లెక్కల మధ్య పీటముడి బిగుస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. 14వ ఆర్థిక సంఘం అమల్లోకి వచ్చేవరకు తొలి పదినెలల రెవెన్యూలోటును భర్తీ చేయడం అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారుతోంది. ఏపీ సర్కారు సమర్పించిన లెక్కల్లో తప్పులు ఉన్నాయని కేంద్రం అంటోంది. అవి తప్పులే అని తేలినాగానీ, తాము ఒప్పుకున్నా గానీ.. తమ పరువే పోతుందనేది చంద్రబాబు సర్కార్లో మెదలుతున్న భయం. 

పరిస్థితిని అంతదాకా రానివ్వకూడదనేది వారి ఆరాటంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో గట్టిగా అడ్డు పడితే.. వచ్చే నిధులు కూడా రాకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే చంద్రబాబు సర్కారు ఈ విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. ఈ పదినెలల రెవెన్యూలోటు ఫైనల్ గా 4000 కోట్లు మాత్రమేనని.. ఇక ఈ విషయంలో వేరే ఆలోచన లేదని కేంద్రం అంటోంది. ఏపీ అధికారులు ఈ విషయంలో మెతగ్గా అడిగే ధోరణిలో ఉన్నారు. 

ఇదివరలో ఆ పదినెలల రెవెన్యూలోటు 7500 కోట్లు అని కేంద్రం ఒప్పుకుంది. ఆ తర్వాత.. ఏపీ లెక్కలు మారడంతో పేచీ వచ్చింది. ఎటూ గతంలో 7500 కోట్లకు ఒప్పుకున్నారు గనుక.. ఆ మేరకు మిగిలిన 3500 కోట్లు ప్రస్తుతానికి ఇచ్చేయండి అని ఏపీ అడుగుతోంది. అలా జరిగినా కూడా ఏపీ లెక్కలు తప్పని తేలినట్లే. అందువల్ల ముందు ఆ మూడున్నర వేలకోట్లు ఇచ్చేయండి.. ఆ తర్వాత మేం చెప్పిన లెక్కలు కరెక్టో కాదో తేల్చడానికి వైవీ రెడ్డి నేతృత్వంలో ఒక కమిటీ వేయండి. ఆ కమిటీ తేల్చిన ప్రకారం వెళ్దాం అని ఏపీ ప్రతిపాదిస్తోంది. 

అలా జరిగితే.. కమిటీలు తేల్చేది గట్రా ఎప్పటికో.. అప్పుడు ఎలా తేలినా.. దాని మీకు పెద్దగా ప్రజల దృష్టి వెళ్లదు గనుక.. పరువు కాపాడుకోవచ్చునని వారి ఆలోచన. అయితే కేంద్రం మాత్రం ‘జాన్తా నై’ అంటోంది. లెక్క తేలిన తర్వాతనే చెల్లింపు అని.. దీన్ని మళ్లీ కమిటీల పేరుతో సాగదీయడం కుదరదని అంటోంది. ఈ ప్రతిష్టంభన వద్ద.. పరువు కాపాడుకోవడం ఎలాగా అని బాబు సర్కార్ మల్లగుల్లాలు పడుతున్నట్లుంది.