Advertisement


Home > Politics - Gossip
రాజా– బాలు విభేదాలకు తెరపడనుందా?

ఒకరు ఈ భువిపైన గాన గంధర్వుడు. మరొకరు దక్షిణాది సినీ సంగీత రంగానికి మకుటం లేని మహారాజు. వీరిద్దరి మధ్య విభేదాలు వస్తే– అది తారా స్థాయిలోనే ఉంటాయి. బాలు వరల్డ్‌ టూర్‌లో ఉన్న సమయంలో తాను కంపోజ్‌ చేసిన పాటలు పాడవద్దంటూ ఇళయరాజా లీగల్‌ నోటీసులు పంపటం.. ఆ తర్వాత బాలు ఆ విషయం గురించి బహిరంగంగా ఆవేదన చెందటం కూడా తెలిసిందే. దీనికి కారణాలు ఇద్దరూ ఇప్పటి దాకా బహిరంగంగా చెప్పలేదు.

బాలు కుమారుడు చరణ్‌ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. అతనికి ఆర్థికంగా సాయం చేయటానికి బాలు తన ప్రపంచయాత్ర మొదలుపెట్టారు. దీనికి ఆర్గనైజర్‌ చరణే. అదే సమయంలో ఇళయరాజా కూడా వరల్డ్‌ టూర్‌ చేయాలనుకున్నారు. ‘మీ యాత్రను కొద్దికాలం వాయిదా వేసుకోండి..’ అని బాలును అడిగినట్లు సమాచారం. దీనికి బాలు అంగీకరించలేదు. దీనితో బాలుకు.. అమెరికాలో ప్రపంచయాత్ర ఆర్గనైజర్స్‌కు.. ఇళయరాజా లీగల్‌ నోటీసులు పంపారు.

దీనితో వీరిద్ధరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇద్దరు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వ్యాఖ్యలు కూడా చేసుకున్నారు. ‘‘ఇళయరాజా చాలా గొప్పవాడు.. ఆ గొప్పతనాన్ని అందరూ అంగీకరించాల్సిందే..’ అంటూ బాలు వ్యాఖ్యలు చేస్తే– ‘గొప్పవాళ్ల వాళ్ల గొప్పతనం గురించి చెప్పటంలో తప్పేముంది..?’ అంటూ ఇళయరాజా ప్రతివ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో–  వచ్చే నెల 5వ తేదీన ఇళయరాజా– తొలిసారి తెలుగు నేల మీద– సంగీత విభావరి నిర్వహించటానికి పూనుకున్నారు. టెంపుల్‌బెల్స్‌ అనే సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం శాటిలైట్‌ రైట్ల కోసం అనేక ఛానల్స్‌ పోటీ పడుతున్నాయి. బుక్‌మైషోలో టిక్కెట్‌ అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. పూర్తి తెలుగు పాటలతో నిర్వహించే ఈ విభావరి– బాలుపై రాజా చేస్తున్న సంగీత సమరమే అని చెప్పాలి.

ఎందుకంటే– 1990లలో వచ్చిన హిట్‌ పాటలన్నీ బాలు– రాజా కాంబినేషన్‌లోవే. ఆ సమయంలో పది సినిమాల్లో ఎనిమిది– ఇళయరాజా సంగీతంతో వచ్చినవే. ఇళయరాజా సంగీతంతో అని ప్రముఖంగా పేర్కొంటూ  పోస్టర్లు వేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. సినిమా ప్లాప్‌ అయినా పాటలు తెలుగు దేశాన్ని ఊపేసిన సందర్భాలెన్నో. (దీనికి ఒక ఉదాహరణ మహర్షి.. ఈ సినిమా అట్లర్‌ ప్లాప్‌.. కానీ పాటలు కొత్త ట్రెండ్‌ సృష్టించాయి). ఈ పాటలన్నీ పాడింది బాలునే.

అయితే ఈ సారి కాన్సర్ట్‌లో మనో, చిత్రలాంటి సింగర్స్‌ పాడతారని ఇళయరాజా ప్రకటించారు. ఈ మధ్య హైదరాబాద్‌ వచ్చిన ఇళయరాజా ఒక ఇంటర్వ్యూలో కాన్సర్ట్‌లో పాడే సింగర్స్‌ గురించి ప్రస్తావించినప్పుడు– ‘ఎవరు గంధర్వులు కారు. పాటలు పాడేవారు పైలోకాల నుంచి ఊడిపడ్డారా?  ఎవరైనా పాడవచ్చు..’ అని బాలుపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. దీనితో రాజా–బాలుల మధ్య సయోధ్య కుదరదని అందరూ అనుకున్నారు.

ఈ నేపథ్యంలో–  తాను విభావరిలో పాడటానికి సిద్ధమేనంటూ రాజాకు బాలు సందేశం పంపినట్లు తెలిసింది. ఇటు ఇళయరాజాకు, అటు బాలుకు అత్యంత సన్నిహితుల్లో మనో ఒకరు. అందుకే మనో ఈ మధ్యవర్తిత్వానికి పూనుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇళయరాజా మలేసియాలో ఉన్నారు. ఆయన సోమవారం రాత్రి తిరిగి వస్తారు. ఆ తర్వాత వీరిద్దరూ ముందు ఫోన్‌లో మాట్లాడుకొనే అవకాశముంది.

ఇదే కనక జరిగితే ఇళయరాజా–బాలు అభిమానులకు పండగేనని చెప్పాలి. ఒక వైపు ఈ పరిణామాలు ఇలా ఉంటే– నవంబర్‌ 26వ తేదీన రహమాన్‌ షో కోసం ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ముందు ఈ షోను సూఫీ నైట్‌గా తీర్చిదిద్దాలనుకున్నారు. కానీ హైదరాబాద్‌లో తెలుగు పాటలు తప్పనిసరిగా పాడాలనే డిమాండ్‌లు వచ్చాయి. దీనితో ఈ కాన్సర్ట్‌లో తెలుగు పాటలు కూడా చేర్చారు. అయితే ఆ రోజుల్లోనే హైదరాబాద్‌లో వరల్డ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సమిట్‌ జరగనుంది.

ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన రెండు వేల మంది మహిళా వాణిజ్యవేత్తలు దీనిలో పాల్గొంటారు. దీనిలో ట్రంప్‌ కుమార్తె ఇవాంక కూడా ఒక స్పీకర్‌.  దీనితో హైదరాబాద్‌లోని మొత్తం హోటల్స్‌, ఇతర ప్రాంగణాలను తెలంగాణా ప్రభుత్వం ముందే బుక్‌ చేసి పెట్టుకొంది. ఇలాంటి పరిస్థితుల్లో రహమాన్‌ షో జరుగుతుందా? లేదా అని వేచి చూడాల్సిందే...

– భావన
-(fbackfm@gmail.com)