cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఇదేం పని పవనా!

ఇదేం పని పవనా!

కళ్ల ముందు అన్యాయం కనబడదా!
ఒకప్పుడు కమ్యూనిస్టులు విలువల విషయంలో నిప్పులాంటివారని చెప్పుకొనేవారు. ప్రజా సమస్యల విషయంలో ఇతర పార్టీలకు వారికి మధ్య తేడా ఉండేది. కాలంతో పాటుగా కమ్యూనిస్టులు మారారు. వారికి ఇతర పార్టీలకు మధ్య పెద్ద తేడాలేకుండా పోయింది. పోరాటాల ముసుగులో వసుళ్ల పర్వం మొదలయింది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం– రాష్ట్రం విడిపోతుందని ముందే ఊహించారో ఏమో తెలియదు.. కమ్యూనిస్టులు కొత్త పంథా తొక్కడం మొదలుపెట్టారు. దీనితో ఒకటి– మీడియా సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకోవటానికి ప్రయత్నించటం.

రెండోది– తమ పార్టీలకు ఉన్న వేలకోట్ల రూపాయల విలువైన భవంతులు.. భూములను కాపాడుకోవటం. ఒక దానికి మరొకటి ఊతంగా వాడుకోవటం మొదలుపెట్టారు. ప్రజాహితం కోసం ఏర్పాటు చేసిన మీడియా ఛానల్స్‌, పత్రికలను వందల కోట్లకు బూర్జువాలకు అమ్మేసుకున్నారు. ఇలాంటి వాటిలో ఒకటి 10 టీవీ. ఆంధ్రజ్యోతి ఎవరికీ (ఇటు మైహోం గ్రూపుకు, అటు నిమ్మగడ్డ ప్రసాద్‌కు) ఇబ్బంది లేకుండా రెండు కథనాలు వండి వార్చింది.

కానీ సీపీఐకు చెందిన 99టీవీకి మరో కథ. ఇది ఒకసారి కాదు. రెండుసార్లు అమ్ముడుపోయింది. అమ్మేసింది కూడా ఎవరో చిన్న చిన్న నాయకులూ కాదు. సీపీఎం జాతీయ కార్యవర్గంలో ఉన్న నారాయణ భార్య వసుమతి, రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న చాడా వెంకటరెడ్డి ఇతరులు అనే ప్రచారముంది.  ప్రస్తుతం వీరిలో కొందరిపై చీటింగ్‌ కేసు కూడా నడుస్తోంది. దీనికి ప్రస్తుతం ఓనర్‌ ప్రత్యక్షంగా ఒక జనసైనికుడు. 99 టీవీ దాదాపుగా జనసేన అధికారిక చానలే కాబట్టి– జనసేనానికి ఈ డీల్‌ గురించి తెలియదని అనలేం!

పిడికిలి బిగించి ప్రజలకు అన్యాయం చేస్తే సహించబోనని ఆవేశంతో ఊగిపోయే జనసేనాని పార్టీ దొడ్డిదారిలో ఒక ఛానల్‌ను సొంతం చేసుకోవటం– దానిని విక్రయించిన వారిపై చీటింగ్‌ కేసులు దాఖలు కావటం ఆసక్తికరమే! అసలీ కథేమిటో చూద్దాం..

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ రెండుగా చీలిపోయే సమయానికి సీపీఎం 10టీవీని, సీపీఐ 99 టీవీని ఏర్పాటు చేశాయి. రెండు రాష్ట్రాల్లోను ఉన్న సీపీఐ సానుభూతిపరులు వీటిలో భాగస్వాములు. వీరందరూ ఈ చానల్స్‌ ఏర్పాటుకు ఎంతో కొంత ఇచ్చినవారే! ఇలా సేకరించిన సొమ్ముతో కూకట్‌పల్లిలో ఉన్న సీఆర్‌ వృద్ధాశ్రమంలో ఒక భవంతిలో 99 టీవీని ఏర్పాటు చేశారు. చానల్‌ అంతా పార్టీ సానుభూతిపరులతో నిండిపోవటంతో ఈ ఛానల్‌కు మొదటి నుంచి ప్రజాదరణ లభించలేదు.

ఈ సమయంలో లావణ్యరెడ్డి అనే ఒక వాణిజ్యవేత్తతో టీవీ యాజమాన్యం ఒక ఒప్పందం చేసుకుంది. ఈ చానల్‌ యాజమాన్య బాధ్యతలు ఐదేళ్లపాటు ఆమెకు అప్పచెప్పేడట్లు.. దానికి ప్రతిగా చానల్‌లో కొన్ని షేర్లు ఆమెకు ఇచ్చేడట్లు ఒక ఒప్పందం కుదిరింది. కమ్యూనిస్టుల అసలు దెబ్బ తెలియని ఆమె– ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లిస్తూపోయారు. చానల్‌ భవంతి దగ్గర నుంచి ఎక్వ్వూప్‌మెంట్‌ దాకా అన్నింటికీ బిల్లులు వేస్తూ పోయారు. లావణ్యారెడ్డితో చేసిన ఒప్పందం మీద సీపీఐ ఆగ్రనేత భార్య వసుమతి సంతకాలు కూడా చేసి ఇచ్చారు.

యాజమాన్యం లావణ్యారెడ్డి చేతిలో ఉన్నా– సిబ్బంది అంతా కామ్రేడ్‌లే కాబట్టి పనితీరులో ఏమాత్రం మార్పురాలేదు. చివరకు వేతనాలు చెల్లించటానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనితో మరింత సొమ్ముచెల్లిస్తే తప్ప చానల్‌లోకి ప్రవేశించనివ్వబోమని ఆంక్షలు పెట్టారు. ఒకరోజు తలుపులు తాళం కూడా వేసేశారు. ఈ తంతు కొద్దికాలం సాగింది. లావణ్యారెడ్డిని బయటకు పంపిన తర్వాత– మళ్లీ ఛానల్‌ను నడపటం మొదలుపెట్టారు. ఇది జరిగిన కొద్ది కాలానికి ఆంధ్రలో జనసేనానితో కామేడ్ల్రకు స్నేహం ఏర్పడింది.

అప్పటికే మీడియాతో అనేక ఇబ్బందులు పడుతున్న జనసేనకు ఒక ఛానల్‌ కావాల్సి వచ్చింది. తక్కువ ధరకు లభిస్తోందనుకున్నారో.. ఏమో.. కొందరు అజ్ఞాత జనసైనికులు రంగంలోకి దిగి ఈ ఛానల్‌ను చేజిక్కించుకున్నారు. దీనితో లావణ్యారెడ్డి– 99 టీవీ యాజమాన్యంపై చీటింగ్‌ కేసుపెట్టారు. మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌లో ఈ కేసు నడుస్తోంది. ఇప్పటిదాకా ఈ చానల్‌ భాగస్వాములైన ప్రజలకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. వీరి సంఖ్యే వందల్లో ఉంటుంది.

ఈ మొత్తం వ్యవహారంలో ఆసక్తికరమైన విషయమేమిటంటే– రకరకాల సమస్యలు ఉన్నాయని తెలిసి కూడా జనసేన పార్టీ ఛానల్‌ను కొనుగోలు చేయటం. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ అన్యాయం జరిగినా తాను బాధితుల పక్షాన ఉంటానని ఊగిపోయే పవనుడు– తన కళ్ల ఎదురుకుండా జరుగుతున్న విషయాన్ని పట్టించుకోకపోవటం. ఒకప్పుడు ప్రజారాజ్యం పెట్టి చిరంజీవి, అల్లు అరవిందులు దండుకున్నారానే అపవాదులు అనేకం ప్రచారంలో ఉన్నాయి.

‘నేను కడిగిన నిప్పు..’ అని చెప్పుకొనే పవనుడు అనుచరులు ఇలాంటి పనులు చేస్తుంటే అన్నబాటలో తమ్ముడు నడుస్తాడా అనే అనుమానాలు వస్తాయి? ఈ మొత్తం వ్యవహారంపై జనసేన ఏమంటుందో.. పవనుడు ఎవరి మీద కర్రెళ్ల చేస్తాడో చూడాల్సిందే!
-భావన

వ్యాపారవేత్తలు పుట్టల్లోంచి చీమలు వచ్చినట్టుగా వస్తున్నారు