cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఇది ఆర్కే రెండు కళ్ల సిద్దాంతం

ఇది ఆర్కే రెండు కళ్ల సిద్దాంతం

తప్పులేదు. తప్పదు. మనిషి అన్నవాడికి ఎవరికైనా అవ్వా కావాలి.. బువ్వా కావాలి అన్న కోరిక వుండడం సహజం. ఎందుకంటే మనిషి కదా? ఆంధ్రజ్యోతి ఆర్కేకు కూడా ఇలాంటి కోరిక అంతర్లీనంగా వుందేమో అనిపిస్తోంది ఈవారం ఆయన రాసిన కొత్త పలుకు చదువుతుంటే..

వాస్తవానికి ఆర్కే మనసా వాచా కర్మణా చంద్రబాబు మనిషి అనిపిస్తుంది ఎవ్వరికైనా. ఎందుకంటే ఆయన పత్రిక వార్తలు, ఆయన వండివార్చే వ్యాసాలు, ఆయనలో పేరుకున్న జగన్ వ్యతిరేకత, ఇవన్నీ కలిసి బయట నుంచి చూసేవారికి అలాగే అనిపిస్తాయి. ఆయన లోపల ఏమిటన్నది ఆయనకే తెలియాలి.

ఇలాంటి నేపథ్యంలోనే ఆయన కొన్నేళ్ల క్రితం కేసీఆర్ తో సున్నం పెట్టుకున్నారు. దెబ్బతిన్నారు. పోరాడారు. ఆఖరికి రాజీపడ్డారు. ఇప్పుడు ఆయన-కేసీఆర్ గట్టి దోస్త్ లు అనే చెప్పాలి. ఇక తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఆయన దోస్త్. అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఆయనకు రెండు కళ్లు. ఈ ఎన్నికలు అయితే కేసీఆర్ కు అనుకూలంగానే వుండేలా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి.

ఇలాంటి టైమ్ లో చంద్రబాబు నేరుగా కేసీఆర్ కు వ్యతిరేకంగా వెళ్తే చాలా విపరిణామాలు సంభవిస్తాయి. ఒకటి కేసీఆర్ కు ఇక చంద్రబాబు శాశ్వత శతృవు అయిపోతాడు. రెండు ఇప్పుడు చంద్రబాబు కేసీఆర్ వ్యతిరేక వర్గానికి అన్నివిధాలా మద్దతు ఇస్తే, రాబోయే ఆంధ్ర ఎన్నికల్లో బాబు వ్యతిరేక వర్గానికి కేసీఆర్ మద్దతు ఇచ్చే ప్రమాదం వుంది.

చంద్రబాబు కారణంగా కేసీఆర్ ఇబ్బందుల్లో పడినా, ఈయన కారణంగా ఆయన ఇబ్బందుల్లో పడినా ఆర్కే రెండు కళ్లకు సమస్యనే.

ఊహించని విపత్తు
అందుకే ఇద్దరు చంద్రులు కలవాలనే వ్యూహం కొన్నాళ్ల క్రితం రూపుదిద్దుకుంది. కానీ ఎక్కడ సమస్య వచ్చిందంటే, భాజపాతో బాబు బంధం తెగిపోవడంతో. అస్సల ఈ విపత్తు ఎవ్వరూ ఊహించనిది. భాజపాతో బంధం తెంపుకోవాలని బాబు అనుకోలేదు. బాబుకు ఇష్టంలేదు. కానీ అలా జరిగిపోయిందంతే. ఇప్పుడు అదే సమస్య అయింది. అలా తెగిపోకుండా వుండి వుంటే తెలంగాణలో తెరాస-భాజపా-తేదేపా మహాకూటమి ఏర్పాటై కాంగ్రెస్ ను కిందకు పడేసి తొక్కేసి వుండేవాళ్లు.

కానీ ఇప్పుడు అనివార్యంగా కాంగ్రెస్ కొమ్ము కాయాల్సిన పరిస్థితి బాబుకు వచ్చింది. ఇదే జరిగితే కేసీఆర్ కు ఏమైనా సమస్య అవుతుందేమో? అన్నది ఆర్కే అనుమానం అలియాస్ భయంగా కనిపిస్తోంది. ఆంధ్ర కన్ను ఓకె. ఎన్నికలు వచ్చినపుడు చూసుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ కన్నును కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత, తక్షణ కర్తవ్యం ఆర్కే తన మీద వున్నాయని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

అందుకే ఈవారం కొత్త పలుకు మొత్తం బాబును కాస్త హెచ్చరిస్తున్నట్లుగా, భయపెడుతున్నట్లుగా సాగింది. కాంగ్రెస్ తో వెళ్లడం అంటే మరిన్ని సమస్యలు కొని తెచ్చుకోవడం మినహా మరేమీకాదని, ఎనభై సీట్లు కేసీఆర్ పార్టీకి పక్కా అని, ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ తో కోరి కయ్యం తెచ్చిపెట్టే, కాంగ్రెస్ తో పొత్తు అవసరమా? అనే రీతిలో కొత్త పలుకు మొత్తంసాగింది.

ఇప్పుడు ఆర్కే అనుకునేది ఒకటేలా కనిపిస్తోంది. కేసీఆర్ కు తెలంగాణ వదిలేయాలి. కాంగ్రెస్ ను ఒంటరిని చేసి, తెలుగుదేశం తన మానాన తను పోటీచేయాలి. గెలిస్తే, గెలుస్తుంది లేకుంటే లేదు. దీనివల్ల బాబుకు వ్యతిరేకంగా కేసీఆర్ ఏమీచేయరు. కేసీఆర్ అధికారానికి తెలంగాణలో సమస్య వుండదు.

ఆర్కే తన దోస్త్ లు ఇద్దరూ రెండుచోట్ల ముఖ్యమంత్రులుగా వున్నారన్న హ్యపీ నోట్ తో వుంటారు. ఒక విధంగా బాబు కూడా ఈ దిశగా వెళ్లడానికి అవకాశం వుంది. ఎందుకంటే కాంగ్రెస్ తో ఆంధ్రలో పొత్తు ఎలాగూ సాధ్యంకాదు. తెలంగాణలో పెట్టుకున్నా వచ్చేవి అరకొర సీట్లు. వాటి కోసం ఆశించి, బలహీనమైన వాడిని మిత్రుడుని చేసుకుని, బలమైన కేసీఆర్ ను శతృవును చేసుకోవడం అవసరమా?

ఒక విధంగా చెప్పాలంటే ఆర్కే సలహా కమ్ హెచ్చరిక కమ్ కొత్త పలుకు కరెక్ట్ గానే వుందనుకోవాలి.
-ఆర్వీ