Advertisement


Home > Politics - Gossip
కమలమధనం : ఇప్పుడు వెంకయ్య ఉంటేనా?

కేంద్రంలోని మోడీ సర్కారుకు బహుశా ముప్పవరపు వెంకయ్యనాయుడు కేబినెట్ లో లేని లోటు ఇప్పుడు స్పష్టంగా తెలిసి వస్తుండవచ్చు. ఆయనే గనుక కేబినెట్ మంత్రిగా ఉంటే.. ప్రత్యేకించి సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉండి ఉంటే.. ఇప్పుడు ఎంత ఎడ్వాంటేజీగా ఉండేదో కదా.. అని వారు పదేపదే అనుకుంటూ ఉండవచ్చు. ఎందుకో తెలుసా...? ఇప్పుడు మోడీ సర్కారులోని కీలక వ్యక్తులు పాల్పడుతున్న అవినీతి దాఖలాల పేరిట... ఆధారాలతో సహా వ్యవహారాలు బయటకు వస్తున్న తరుణం ఇది.

ఈ అవకాశాన్ని ప్రతిపక్షాలు చాలా చక్కగా వాడుకుంటూ.. ముందు బాధ్యుల్ని పదవులనుంచి తప్పించాల్సిందే విచారణకు ఆదేశించాల్సిందే అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తరుణం ఇది. ‘నీతిమయమైన, ఎలాంటి తప్పుడు వ్యవహారాల ఆరోపణలు కూడా లేని’ ప్రభుత్వం అన్నట్లుగా ఉన్న ఇమేజికి భంగం కలుగుతున్న సమయం ఇది. ఇలాంటి సమయంలో వెంకయ్యనాయుడు గనుక ఉండి ఉంటే.. మీడియా మేనేజిమెంట్ అనేది ఇంకొక రేంజిలో ఉండేదని పార్టీ నాయకులు భావిస్తున్నారు. 

ప్రస్తుతం మోడీ సర్కార్ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. అమిత్ షా కుమారుడు జే అమిత్ షా.. ఒక్క ఏడాదిలో 50 వేల రూపాయల విలువైన కంపెనీని 80 కోట్ల రూపాయలకు తీసుకెళ్లిపోయాడని, తండ్రి ఇమేజిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని వైర్ అనే వెబ్‌సైట్ బయటపెట్టిన  వ్యవహారం ఇప్పుడు కేంద్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని బాగానే వాడుకుంటోంది. దానికి తోడు ప్రధాని మోడీ ఈ విషయంలో కూడా మౌనం వహించడం వారికి కలిసి వస్తోంది. ప్రధానికి ఎంతో సన్నిహితుడైన అమిత్ షా అవినీతికి సంబంధించిన ఆరోపణలు కావడంతో ఆయనను ఇరికించడానికి కాంగ్రెస్ శ్రేణులు తమ వంతు కృషి చేస్తున్నాయి. 

అయితే మీడియాకు సంబంధించినంత వరకు అమిత్ షా మీద వచ్చిన ఆరోపణలు, అవినీతి బాగోతం గురించి వైర్ బయటపెట్టిన వ్యవహారానికి దక్కినంత ప్రచారం, భాజపా నాయకులు సమర్థించుకోవడానికి దక్కడం లేదు. సాధారణంగా అయితే ఇలాంటి సందర్భాలు తలెత్తినప్పుడు.. మిగిలిన మీడియాలలో వైర్ అనే వెబ్ సైట్ క్రెడిబిలిటీ మీదనే ప్రజల్లో సందేహాలు కలిగేలా కథనాలు ప్లాన్ చేయడం పాలకపక్షాలు చేసే పని. ప్రచారాన్ని ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకుంటే.. పాలకులకు ఎడ్వాంటేజీ ఉంటుంది.

రాజకీయాల్లో ఎన్నో ఢక్కా మొక్కీలు తిని, సుదీర్ఘ అనుభవం ఉన్న వెంకయ్యనాయుడు వంటి నాయకుడు కేబినెట్ లో ఉంటే గనుక.. ఇలాంటి పరిస్థితిని సునాయాసంగా చక్కదిద్ది ఉండేవారని పార్టీలో సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. కేబినెట్ లో ఉన్నంతకాలమూ.. ప్రభుత్వానికి ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే.. వాటిని చక్కబెట్టడంలోనూ, ప్రతిపక్షాల విమర్శలను వారి కంటె ఘాటుగా తిప్పికొట్టడంలోనూ వెంకయ్య నాయుడు చాలా చురుగ్గా ఉండేవాళ్లు. ఆయన ఎంత ఘాటుగా స్పందించేవాళ్లంటే.. ప్రతిపక్షాల విమర్శల్లో విలువలేదేమోనని ప్రజలు అనుకునేంతగా ఉండేది.

పైగా మీడియా ద్వారా ప్రతిపక్షాలకు దీటుగా సమాధానం చెప్పడంలోనూ ఆయన వ్యూహాలు వేరుగా ఉండేవి. క్రైసిస్ మేనేజిమెంట్ లో సిద్ధహస్తుడిగా ఉండేవారు. ఇప్పుడు ఆ స్థాయిలో క్రైసిస్ మేనేజిమెంట్ చేయగలవారు కేంద్ర కేబినెట్ లో కనిపించడంలేదని, వెంకయ్య మంత్రివర్గంలో లేని లోటు స్పష్టంగా తెలుస్తున్నదని.. పార్టీ వర్గాలు మధనపడుతున్నాయి.