Advertisement


Home > Politics - Gossip
ఇల్లు కట్టి చూడు.. రాజకీయం చేసి చూడు!

ఓ సామాన్యుడు తన స్తోమతుకు తగ్గట్టుగా ఇల్లు కట్టు కుంటాడు. ఒక్కోసారి స్తోమతుకు మించి ఇల్లు కట్టు కోవడానికీ సామాన్యుడు వెనుకంజ వేయడు. ఎందుకంటే, ఇల్లు అంటే శాశ్వత నిర్మాణం.. శాశ్వత అవసరం. అందుకే, అప్పు చేసన్నా సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలనుకోవడంలో తప్పేమీ లేదు. అదే, రాజకీయనాయకుడైతేనో.? ఇంద్రభవనాన్ని తలపించేలా తన ఇల్లు వుండాలనుకుంటాడు. ఇందులో 'తప్పు' వెతకడానికేమీ వుండదు. కానీ, మన రాజకీయనాయకుల ఇళ్ళు మాత్రం వివాదాస్పదమవుతున్నాయి. ముచ్చటపడి ఇల్లు కట్టుకుంటే, దాని చుట్టూ ఈ రాజకీయమేంటంటూ, ఇప్పుడు పలువురు రాజకీయ ప్రముఖులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. అయ్యోపాపం, మన రాజకీయ ప్రముఖులకు ఈ వివాదం ఎంత తలనొప్పిగా మారిందో కదూ.!

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంద్రభవనం

అసలంటూ, రాజకీయాల్లో 'ఇల్లు' గురించిన చర్చ ప్రారంభమయ్యింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే అనడం అతిశయోక్తి కాకపోవచ్చు. అవునుమరి, అత్యంత విలాస వంతమైన నివాసం ఆయనకుంది. ఒకటి కాదు, చాలానే వున్నాయంటారు తెలుగుదేశం పార్టీ నేతలు. బెంగళూరులో ఒకటి, హైద్రాబాద్‌లో ఇంకోటి, వేరే వేరే చోట్ల ఇంకొన్ని.. అంటూ ఆ 'భవంతుల' చుట్టూ తెలుగుదేశం పార్టీ ఎంత రాజకీయం చెయ్యాలో అంతా చేసింది.. చేస్తూనే వుంది. ఇప్పటికీ జగన్‌ 'ఇంటి'పై టీడీపీ ఆరోపణలు అలాగే వున్నాయి. పదుల సంఖ్యలో గదులు, అందులో మినీ థియేటర్‌.. అబ్బో, జగన్‌ ఇంటి హంగామానే వేరంటారు టీడీపీ నేతలు. అందులో నిజమెంత.? అన్నది వేరే విషయం. అయినా, ఒకప్పుడు దేశంలోనే అత్యంత ధనవంతులైన ఎంపీల్లో వైఎస్‌ జగన్‌ కూడా ఒకరు. ఇందులో వివాదానికి ఆస్కారం లేదు. ఆయన తన ఆస్తుల్ని ఎప్పుడో ఎన్నికల కమిషన్‌ ముందుంచారు. వందల కోట్ల ఆస్తుల్ని చూపించాక, జగన్‌ అంత ఖరీదైన భవంతులు కట్టుకుంటే తప్పేంటి.? అందులో నివసిస్తే తప్పేంటి.? అయినాసరే, ప్రజా జీవితంలో వున్నాక, పేద ప్రజల గురించి మాట్లాడుతున్నాక.. అత్యంత ఖరీదైన భవంతుల్లో వుండడం తగదుగాక తగదు.. అనే వాదనలు లేకపోలేదు. 'బస్తీ మే సవాల్‌.. జగన్‌ ఇళ్ళలోకి వచ్చి చూసు కోండి.. మీరు చెబుతున్న థియేటర్లు, మీరు చెబుతున్నన్ని గదులు వున్నాయేమో..' అంటూ వైఎస్సార్సీపీ నేతలు సవాల్‌ విసరడం మామూలే, ఆ సవాల్‌ పట్టించుకోకుండా టీడీపీ నేతలు చేసే ఆరోపణలు మామూలే.!

నారా చంద్రబాబునాయుడుగారి ఖరీదైన ఇల్లు

పాపం నారా చంద్రబాబునాయుడు..ఎప్పుడూ జేబులో వందరూపాయల నోటు కూడా వుంచుకోరట. అసలు, తనకు డబ్బుతో అవసరం లేదంటారు. చేతికి వాచీ కూడా లేనంత పేదోడ్ని.. అని చెప్పుకుంటుంటారు చంద్రబాబు. చేతికి వాచీనే లేని వ్యక్తికి, ఇంటితో అవసరమేంటట.? లాజిక్కే కదా.! అయినాసరే, హైద్రాబాద్‌లో అత్యాధునిక సౌకర్యాలతో పేద్ధ భవంతిని నిర్మించేసుకున్నారు. ఈ మధ్యనే నిరాడంబరంగా గృహప్రవేశం కూడా జరిగిపోయింది. దాంతో, ఇప్పుడీ 'ఇళ్ళ' గొడవ తెరపైకొచ్చింది. జేబులో వంద రూపాయల్లేవంటారు, చేతికి వాచీ కూడా లేదంటారు, మరి ఈ ఇల్లుని ఇంత ఘనంగా ఎలా కట్టేసుకున్నారు.? అంటూ వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది. తప్పదు మరి, తమ ఇళ్ళ గురించి టీడీపీ ప్రశ్నిస్తున్నప్పుడు.. ఛాన్స్‌ దొరికితే వైఎస్సార్సీపీ ఎందుకు వదిలేస్తుందట. అయినా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చంద్రబాబు సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిన సందర్భ మిది. చేతిలో చిల్లిగవ్వ లేని వ్యక్తికి ఇంత గొప్ప భవంతిని నిర్మించడం ఎలా సాధ్యమయ్యిందో ఆయన చెప్పి తీరా ల్సిందే. పైగా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి.. తన నివాసాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా, తెలంగాణలో నిర్మించు కోవడమేంటో. అంతకు మించి ఆశ్చర్యకరమైన విషయం, కోట్లు వెచ్చించి ఆంధ్రప్రదేశ్‌లో అద్దె భవనాల్లో, అదీ ప్రభుత్వ ఖర్చుతో నివాసముంటున్న చంద్రబాబు.. ప్రజా ధనం దుర్వినియోగమవడంపైనా 'శ్వేతపత్రం' విడుదల చేయక తప్పని పరిస్థితి.

ఇల్లు ఎవరైనా కట్టుకోవచ్చుగానీ...

ఇంటి చుట్టూ ఈ రాజకీయం.. మాట్లాడుకోవడానికే ఒకింత జుగుప్సాకరంగా అన్పిస్తోంది. అయినాసరే, ''నేను నీ 'కింది' మచ్చని వెతుకుతాను.. నా ఒంటి మీద మచ్చల్ని నువ్వు మాత్రం లెక్కపెట్టకూడదు..'' అన్నట్టు అధికారంలో వున్నవారు వ్యవహరిస్తేనే ఇలాంటి చర్చలు తప్పవు. రాజకీయం అంటే జవాబుదారీతనం.. అధికారం అంటే అంతకుమించిన జవాబుదారీతనం.. దురదృష్టవశాత్తూ రాజకీయంలోనూ, అధికారంలోనూ జవాబు దారీతనం కొరవడ్తోంది.!

-సింధు