Advertisement


Home > Politics - Gossip
ముందుగా మూడు అసాధ్యాల గురించే చర్చ!

చంద్రబాబునాయుడు ఇవాళ ఉదయం ప్రధాని నరేంద్రమోడీ సమావేశం కాబోతున్నారు. ఉదయం 10.40 గంటలకు వీరి భేటీ జరుగుతుంది. గురువారం రాత్రికే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. దాదాపు ఒక ఏడాదికి పైగా వీరిద్దరి మధ్య భేటీ జరగకుండా ఉన్న నేపథ్యంలో.. ఇవాళ్టి సమావేశానికి చాలా ప్రాధాన్యం ఉంది. వీరిద్దరూ ఏం చర్చిస్తారు.. చంద్రబాబు రాష్ట్రానికి ఏం సాధిస్తారు? అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నిజానికి ఈ సమావేశానికి చంద్రబాబు వద్ద రెండు ఎజెండాలు ఉన్నాయని అనుకోవాలి. ఒకటి బయటకు చెప్పుకునే అభివృద్ది ఎజెండా.. రెండోది రాజకీయ ఎజెండా. మొదటి ఎజెండా కూడా చాలా సుదీర్ఘమైనదే. ఏపీలో ఈ ఏడాదిలో చేపట్టవలసి ఉన్న అనేక పనులను ఇందులో జాబితా కట్టారు. కేంద్రం మొహం చాటేస్తున్న చాలా అంశాలు కూడా అందులో అనివార్యంగా ఉన్నాయి.

అమరావతి, పోలవరం, శాసనసభ నియోజకవర్గాల పెంపు అనేవి.. మూడు అతి ప్రాధాన్య అంశాలుగా చంద్రబాబు భేటీ ఎజెండాలో ఉన్నాయి. ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం నిధులు విడుదల చేయడం, ఈఏపీ పనులకు నిధులు, విభజన చట్టంలోని ఇతర అనేక అంశాలు అమల్లోకి వచ్చేలా చూడడం వంటివి ఆయన జాబితా వారీగా చర్చించనున్నారు.

అయితే ఆయన అగ్రప్రాధాన్యం ఇస్తున్నట్లుగా అందరూ భావిస్తున్న మూడు అంశాల విషయంలోనే అసలు సందేహాలు అనేకం రేగుతున్నాయి. ఈ మూడింటికీ మోడీనుంచి ఏకపక్షంగా సానుకూల ప్రతిస్పందన రాబట్టడం దుర్లభం అని పలువురు భావిస్తున్నారు. అమరావతి గురించి కేంద్రానికి పెద్దగా శ్రద్ధ లేదు. పోలవరంపై వారి అనుమానాలు వారికి ఉన్నాయి.

నియోజకవర్గాల పెంపు విషయంలో ఈ ఎన్నికల్లోగా పెంచే ఆలోచన వారికి ఎంతమాత్రమూ లేదు. నిబంధనల ప్రకారం ఎప్పటికి ఆ పర్వం పూర్తయ్యే అవకాశం ఉంటే అప్పటికి పూర్తి చేస్తే చాలుననే ఉద్దేశంతోనే కేంద్రం ఉన్నదని పలువురి అంచనా.

ఈ నేపథ్యంలో ఆ మూడు అంశాల విషయంలో బాబు ఏం సాధిస్తారనేది చాలా కీలకమైన అంశంగా ఉంది. మిగిలిన అభివృద్ధి పనులకు నిధులసంగతి గానీ.. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడం గురించి గానీ.. తక్షణమే ఒక సానుకూల ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.

అయితే అప్రకటిత (మరియు రహస్య) రాజకీయ ఎజెండాపై చాలా మందికి ఆసక్తి ఉంది. తెదేపా-భాజపా బంధం వచ్చే ఎన్నికల్లో ఉంటుందా? పుటుక్కుమంటుందా? అనే అనుమానం చాలామందిలో ఉంది. ఈ భేటీలో దానికి సంబంధించిన కీలక చర్చలు కూడా జరుగుతాయని.. కాకపోతే.. వాటి ప్రస్తావన అధికారిక ప్రకటనల్లో ఉండకపోవచ్చునని పలువురు భావిస్తున్నారు.

భేటీ అనంతరం.. సంక్షేమపథకాలు, కేటాయింపుల విషయంలో మోడీ చాలా బాగా స్పందించినట్లుగా , తమ వినతులను ఆలకించినట్లుగా.. చంద్రబాబు సింగిల్ గా ప్రెస్ మీట్ పెట్టి చెబితే దానికి ఏమీ విలువ ఉండదు. భేటీ సక్సెస్ కావడం అంటే.. మోడీ తో కలిసి మీడియాతో మాట్లాడి.. మోడీతో ప్రకటన చేయించాలి. అప్పుడే అంతా శుభస్కరంగా జరిగినట్లు భావించగలం.