Advertisement

Advertisement


Home > Politics - Gossip

నిఘా వర్గాలకు పని పెరిగింది!

నిఘా వర్గాలకు పని పెరిగింది!

ప్రభుత్వంలో స్టేట్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ పేరుతో నిఘావర్గాలు విడివిడిగా ఉంటాయి. వీరు మరీ గూఢచారుల్లాగా తమ ఆచూకీ ఎవరికీ తెలియకుండా రహస్యంగా తిరుగుతూ ఉంటారని కాదు గానీ.. నిత్యం ప్రజల్లో ఉంటూ, వారిలో మారుతున్న ఆలోచనలు పోకడలు పసిగట్టి ఎప్పటికప్పుడు తమ తమ ప్రభుత్వాలకు చేరవేస్తుంటారు. శాంతి భద్రతలు, భద్రతా వ్యవహారాలు కూడా వీరి పరిధిలో ఉంటాయి. కానీ వీరు ఎక్కువగా.. ఆయా ప్రభుత్వాల గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారు? రాజకీయంగా ఎవరు ఎవరిని కలుస్తున్నారు? సమీకరణాలు ఎలా మారుతున్నాయి? లాంటి అంశాల మీద ఎక్కుగా దృష్టి కేంద్రీకరిస్తుంటారు. అందుకే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వేర్వేరుగా ఇంటెలిజెన్స్ వ్యవస్థల్ని మెయింటైన్ చేస్తుంటాయి.

ఇప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు బాగా పని పెరిగినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే... 370వ అధికరణాన్ని రద్దుచేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక మూల చిన్న విధ్వంసక చర్యలైనా చోటు చేసుకునే ప్రమాదం ఉంటుందని కేంద్రం అంచనా వేస్తోంది. జమ్మూ కాశ్మీరుకు సంబంధించినంత వరకు అక్కడ ఇంటర్నెట్, కమ్యూనికేషన్ వ్యవస్థల్ని కూడా కంట్రోల్ చేయడం ద్వారా... 370 రద్దు తర్వాత.. ఎలాంటి స్థితిగతులు ఉన్నాయో బాహ్య ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

అదే సమయంలో అక్కడ చాలా పెద్ద సంఖ్యలో భద్రతాబలగాలను కూడా మోహరించారు. చిన్న చిన్న నిరసనలు కూడా జరిగినట్లు నమోదుకాలేదు. అయితే ఈ సున్నితమైన అంశం, ఉగ్రవాద కార్యకలాపాలతో కూడా ముడిపడి ఉన్నందున దేశంలో పలు ప్రాంతాలకు ఇప్పటికే స్ప్రెడ్ అయి ఉన్న ఉగ్రవాదులు ఎక్కడో ఒకచోట అల్లర్లు సృష్టించవచ్చునని కేంద్ర సర్కారు ఆందోళన చెందుతోంది. అందుకే నిఘావర్గాలను అప్రమత్తం చేసింది.

పార్లమెంటు ముగిసిన తర్వాత.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నాయకులతో మోడీ సమావేశం నిర్వహించినప్పుడు కూడా.. ప్రజల్లోకి వెళ్లినప్పుడు నాయకులంతా తమపాలన గురించి, నిర్ణయాల గురించి ఏం అనుకుంటున్నారో తెలుసుకుని రావాలంటూ సందేశం ఇచ్చారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బృందాలు మొత్తం అదేపనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

అంతో ఇంతో ఆశావహ పరిణామం ఏంటంటే... ఈ నిర్ణయాన్ని జమ్మూ కాశ్మీరుకు చెందిన సమస్యగానే అంతా చూస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింల సమస్య అన్నట్లుగా రంగు పులమడానికి కొందరు ప్రయత్నించినా ప్రజలు అలా చూడలేదు. దీనివల్ల శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. కానీ.. నిఘావర్గాలు మాత్రం ఎక్కడ ఎలాంటి ఆందోళనలు వ్యక్తం అవుతున్నా.. వాటిని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?