cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఏపీ మళ్లీ చీలితే.. పాపం ఎవరిది?

ఏపీ మళ్లీ చీలితే.. పాపం ఎవరిది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ చీలుతుందా? రాష్ట్రంలో మళ్లీ ప్రాంతీయ ప్రాతిపదికమీద వేర్పాటువాదం ప్రబలడానికి అనుకూలంగా, మనకు మరో ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ ను రెచ్చగొట్టే విధంగా ప్రస్తుతం అసమతుల్య అభివృద్ధి చోటు చేసుకుంటున్నదా? ఏమో గౌరవనీయ రాష్ట్రమంత్రి గారి వ్యాఖ్యలను గమనిస్తే మాత్రం అలాంటి సందేహాలు కలుగుతున్నాయి.

రాష్ట్రం మళ్ళీ రెండుగా చీలే ప్రమాదం ఉత్పన్నం అవుతుందని మంత్రిగారికి ఎందుకు అనిపించిందో తెలియదు గానీ... ఆయనను ముందు జాగ్రత్తగా నింద తమ మీదకు రాకుండా మాటలతో అడ్డుగోడ కట్టేస్తున్నారు. వివరాలలోకి వెళితే... రాష్ట్రమంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒకసారి చీలిపోయే ప్రమాదం కనిపిస్తోంది అంటున్నారు. అలాగని ఆయనకు ఎందుకు అనిపించిందో మనకు తెలియదు.

కానీ, భారతీయ జనతాపార్టీనే అలాంటి పరిస్థితిని కల్పిస్తున్నది అని సోమిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఒక ఓటు-రెండు రాష్ట్రాలు అనే సిద్ధాంతాన్ని భాజపా మళ్లీ తెరమీదకు తెస్తున్నదని వ్యాఖ్యానిస్తున్నారు. పనిలో పనిగా వైఎస్సార్ కాంగ్రెస్ మీద నిందలు వేయడానికి కూడా ఈ అంశాన్ని వాడుకుంటున్నారు. వారు అనవసరంగా భాజపాకు మద్దతిస్తున్నారని ఆయన బాధపడిపోతున్నారు. అందువల్లనే భాజపా చెలరేగుతున్నదని చెబుతున్నారు.

ఒకవేళ భాజపా అలాంటి నినాదం ఇచ్చినంత మాత్రాన, రాష్ట్రవ్యాప్తంగా సమతుల్య అభివృద్ధికి ఉంటే కనుక ఆ నినాదాన్ని ఎవరు పట్టించుకుంటారు? ఈ లాజిక్ ను సోమిరెడ్డి మిస్ అవుతున్నారు.! రాయలసీమలో మరొక రాష్ట్ర రాజధాని కావాలని డిమాండ్ చేసినందుకే భారతీయ జనతా పార్టీ మీద నిందలు వేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది.

మరి సీమవాసులు కూడా సంతృప్తి చెందే అంత అభివృద్ధి అక్కడ చూపిస్తే ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది... అని ప్రజలు అడుగుతున్నారు. ఏదో మసిగుడ్డ కాల్చి వారి మొహంపై పడ వేసినట్లుగా భాజపా గురించి సోమిరెడ్డి మాటలు ఉన్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఒకవేళ రాష్ట్రం మళ్ళీ ముక్కలయ్యేలా సీమ ఉద్యమం జరిగితే కనుక అందుకు ప్రధానంగా తెలుగుదేశం పార్టీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు మొదటి నిందితుడు అవుతారు అని ప్రజలు భావిస్తున్నారు. 

హైదరాబాదులో ఏవిధంగా ప్రగతిని ఒకేచోట పరిమితం చేశారో... అదేపని అమరావతి కేంద్రంగా చేస్తున్నారనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. సీమ వాసులలో అందుకే అసంతృప్తి ప్రబలుతోంది. వాళ్లు రాష్ట్రాన్ని కోరే వరకూ వెళితే కనుక ఆ భావాన్ని చంద్రబాబు మోయాల్సి ఉంటుంది. కనీసం హైకోర్టు కూడా కేటాయించకుండా ఆయన ప్రవర్తిస్తున్న ధోరణి ఇలాంటి వైఖరికి కారణమవుతోంది. సోమిరెడ్డి ఆ విషయాన్ని స్పృహలో వుంచుకొని మాట్లాడితే ఆయనకు వారి పార్టీకి కూడా మంచిది.