cloudfront

Advertisement


Home > Politics - Gossip

ప్రధాని మోడీకి అంత సహృదయత ఉందా?

ప్రధాని మోడీకి అంత సహృదయత ఉందా?

వీసమెత్తు అవకాశం వస్తేచాలు.. ప్రధాని నరేంద్రమోడీ.. నీతులు ప్రవచనాలు చెప్పడం ప్రారంభిస్తారు. పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రులకు నమస్కరించడం దగ్గరినుంచి ఆయన జాతిని ఉద్దేశించి చేసే ఉపదేశాలు చాలానే ఉంటాయి. అలాగే... జాతికోసం నిస్వార్థంగా పనిచేసే వారి గురించి కూడా అనేకం చెబుతూ ఉంటారు. నైతికతను, విలువలను ప్రతిపాదిస్తూ ఉంటారు. అలాంటి సందర్బాల్లో ఆయన మోడీబాబా అవతారంలో ఉన్నట్లుగా కనిపిస్తారు.

కానీ.. ఆయన పాటిస్తున్న సంస్కారాలు ఎలాంటివి? ఈ సందేహం ప్రజలకు కొన్ని రోజులుగా కలుగుతోంది. ఇటీవలి ఒక కార్యక్రమానికి సంబంధించి.. సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో మోడీ అంటే ప్రజల్లో చులకన భావం, ఆయనలోని సంస్కారం పట్ల అపనమ్మకం ఏర్పడేలా ఉన్నదంటే అతిశయోక్తికాదు. సభావేదిక మీదకు మోడీ రాగానే అక్కడ ఉన్న పెద్దలంతా లేవడం వారిలో అందరికీ ప్రతినమస్కారం చేస్తూ కరచాలనాలు చేసిన మోడీ, అద్వానీ తనకు నమస్కరిస్తే.. తిరిగి నమస్కరించకపోవడం చూసి జనం నివ్వెరపోతున్నారు. 

తిరిగి అదే వేదిక మీద వెనక్కు వస్తూ.. అద్వానీ మళ్లీ లేచి నిల్చున్నప్పటికీ.. కనీసం ఆయనకేసి చూడకుండా నిర్లక్ష్యంగా వెళ్లిపోవడం.. ఇంకా ఘోరంగా కనిపిస్తోంది. ఇదేం సంస్కారం సారూ అని జనం అనుకుంటున్నారు. అలాంటి కరడుగట్టిపోయిన అధికారాన్ని తలకెక్కించుకుని ప్రవర్తిస్తున్న నరేంద్రమోడీ నుంచి... అన్నాహాజరే లాంటి సామాజిక ఉద్యమకారులు ఆశిస్తున్న సహృదయత లభిస్తుందా.. అని పలువురు ప్రజలు ఇప్పుడు ప్రశ్నించుకుంటున్నారు. ఎందుకంటే.. అన్నా హజారే రైతు సమస్యలపై ఢిల్లీలో ఓ ప్రజాందోళన నిర్వహించాలని అనుకున్నారు.

జనలోక్‌పాల్ ఆధ్వర్యంలో 23న ఢిల్లీలో రైతు సమస్యలపై నిరసన తెలియజేస్తాం అని.. దానికి అనుమతితో పాటూ ఎక్కడ నిర్వహించవచ్చో.. స్థలం కూడా మీరే తెలియజేయండి అంటూ ఆయన ఇప్పటికే కొన్ని నెలలనుంచి కేంద్రంలోని హోం సహా పలుశాఖలకు వినతిపత్రాలు, అనుమతికోసం లేఖలు పంపారు. ఇప్పటిదాకా ఒక్క శాఖనుంచి కూడా.. ఒక్క జవాబు కూడా రాలేదు. దాంతో ఆయన చివరి ఆప్షన్ గా ఈ నిరసనకు అనుమతి ఇచ్చి, స్థలం సూచించాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు.

అయితే  మోడీ దీనికి స్పందిస్తారా లేదా అనేది కీలకం. ఎందుకంటే.. తనకు వ్యతిరేకంగా జరిగే నిరసన విషయంలో ఆయన అన్ని రాజకీయ పార్టీల్లాగానే వ్యవహరిస్తారు. అసలే లోక్ పాల్, లోకాయుక్త బిల్లుకోసం హజారే, మోడీకి ఇప్పటిదాకా 43 లేఖలు రాస్తే ఒక్కదానికి కూడా కనీసం జవాబు కూడా రాలేదట. అలాంటిది.. ఈ నిరసనకు మాత్రం స్పందించి, అనుమతించేంత సహృదయత మోడీకి ఉంటుందా అని పలువురు ఆశ్చర్యపోతున్నారు.