cloudfront

Advertisement


Home > Politics - Gossip

తెదేపాకు ‘క్వార్టర్’కూ గతిలేదా?

తెదేపాకు ‘క్వార్టర్’కూ గతిలేదా?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా శవాసనం వేసి ఉన్నదన్న విషయం సత్యం. ఈ ఎన్నికలను వాడుకుని.. కనీసం శాసనసభలో తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోలేకపోతే.. ఇక వచ్చే ఎన్నికల నాటికి అసలు తెలుగుదేశం అనే పార్టీనే ఇక్కడ బతికి ఉండడం కష్టం. అందుకే చంద్రబాబునాయుడు చివరి మెట్టువరకు దిగజారి.. కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అయితే కాంగ్రెస్ తో పొత్తువలన ఏపీలో ప్రజలు తమను అసహ్యించుకోకుండా.. ఆయన ఇప్పటికే ఇది చారిత్రక అవసరం అన్నట్లుగా.. తమ అనుకూల వర్గాలు, ప్రముఖులు, మీడియాలతో ప్రజల్లోకి సంకేతాలు పంపుతూ తన శైలిలో కొత్తడ్రామాలను నడిపిస్తున్నారు.

కాంగ్రెస్ కూడా తెలుగుదేశంతో జట్టుకట్టడానికి ఉత్సాహంగానే ఉన్నది గానీ.. సీట్ల పంపకం వీరికి కుదురుతుందా? అనేది ఇప్పుడు సందేహం. పొత్తులకు ఇతర పార్టీలన్నిటితోనూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. అందులో భాగంగానే.. పార్టీ అంతర్గత సమావేశాల్లో ఏయే పార్టీలు ఎన్నేసి సీట్ల వంతున పంచుకోవాలనే చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 119 సీట్లున్నాయి. 90 సీట్లలో తామే పోటీచేయాలన్నది కాంగ్రెస్ ఉద్దేశం.

మిత్రులందరికీ కలిపి 29 కంటె ఎక్కువ ఇచ్చే స్థితిలో వారు లేరు. అంతకంటె ఎక్కువ సీట్లు ఇస్తే కూటమి మీద తమ పెత్తనం పోతుందనేది వారి భయం. ఎక్కువ సీట్లు ఇస్తే ఫలితాల తర్వాత.. కూటమి పార్టీలు ప్లేటు ఫిరాయించి కేసీఆర్ తో జతకట్టినా ఆశ్చర్యం లేదని వారి భయం. అందుకే 29కి మించి మిత్రులకు ఇవ్వరాదనుకుంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్-తెదేపా రెండు పార్టీలే కూటమిగా ఏర్పడినా కూడా.. 29 అనే సంఖ్య మొత్తం సీట్లలో క్వార్టర్- పావువంతు కంటే తక్కువే!

ఒకప్పుడు అధికారం వెలగబెట్టిన తెలుగుదేశం పార్టీ.. మరీ ఇంత తక్కువ వాటా తీసుకోవడానికి అంగీకరిస్తుందా? అనేది సందేహం. అయితే ప్రస్తుత సభలో ప్రాతినిధ్యం, బలాబలాల పరంగా చూసినప్పుడు తెదేపా పరిస్థితి అంతకంటె ఘోరంగా ఉన్నదన్న మాట వాస్తవం. పైగా లెఫ్ట్, టిజెఎస్ ఇతర పార్టీలు ఏవైనా ఈ కూటమిలో కలిస్తే.. 29లోంచి తెదేపాకు కాస్త కోత పడవచ్చు. ఇలాంటి దుస్థితిలో తెలుగుదేశం గతిలేక పొత్తులకు ఆరాటపడుతున్నదని పలువురు అంటున్నారు.