Advertisement


Home > Politics - Gossip
జగన్‌కు ఏ హక్కులూ ఉండవా?

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చాలా అసహ్యంగా ఉన్నాయని ఎవరైనా అభిప్రాయపడితే అది పొరపాటు కాదు. అక్కడి రాజకీయాలు ఎవరికైనా ఈ అభిప్రాయం కలిగించడం సహజం. ముఖ్యంగా టీడీపీ-వైఎస్సార్‌సీపీ మధ్య జరుగుతున్న జుగుప్సాకరమైన రాజకీయం ఆటవిక కాలాన్ని తలపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన మీద కంటే వైకాపా అధినేత జగన్‌పై కక్ష తీర్చుకునేందుకే అత్యధిక సమయం కేటాయిస్తున్నారు. అందుకే ఆయన ఇప్పటివరకు అమరావతి నిర్మాణంలో అడుగు ముందుకు వేయలేకపోయారేమోననే అనుమానం కలుగుతోంది. అసలు జగన్‌పై పోరాడేందుకు లేదా కక్ష తీర్చుకునేందుకు ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తే చంద్రబాబు పరిపాలనపై దృష్టి సారించవచ్చు. జగన్‌ ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్న ఎపిసోడ్‌ను టీడీపీ నాయకులు జీడిపాకంలా ఇంకా సాగదీస్తూనే ఉన్నారు. టీడీపీ నాయకుల అభిప్రాయం ప్రకారం జగన్‌కు ఎలాంటి హక్కులు లేవు. ఉండకూడదు కూడా. ఎందుకు? అతను అక్రమ పెట్టుబడుల కేసులో నిందితుడు కాబట్టి. నిందితుడు ప్రధానిని కలుసుకోవడం తప్పయితే , అతనికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చి ప్రధాని వినతిపత్రాలు స్వీకరించడం తప్పున్నర.

జగన్‌పై కేసులున్న మాట వాస్తవమే. వాటిపై ఇంకా విచారణ జరుగుతోంది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. అంతే. కాని దోషి కాదు. జగన్‌ తప్పు చేశారని ఏ న్యాయస్థానమూ నిర్థారించలేదు. ఆయన ఈమధ్య బెయిల్‌ నిబంధనలు అతిక్రమించారని, కాబట్టి బెయిల్‌ రద్దు చేయాలని దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ న్యాయస్థానం కొట్టేసింది. టీడీపీ నాయకులకు ఈ సంగతి తెలియదా? మాట మాట్లాడితే జగన్‌పై కేసులున్నాయి అంటూ ఇంతెత్తున ఎగిరిపడే టీడీపీ నాయకులకు తమ అధినేత చంద్రబాబుపై కేసులున్నాయనే విషయం గుర్తు లేదా? చాలా కేసులపై స్టే తెచ్చకున్నారు. ఆ విషయం అలా ఉంచితే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 'ఓటుకు నోటు' కేసులో చంద్రబాబు నిందితుడే కదా. విచారణ ఇంకా జరుగుతోంది. ఈ కేసు తరువాత చంద్రబాబు ప్రధానిని ఎన్నిసార్లు కలుసుకున్నారో టీడీపీ నాయకులకు తెలుసు. ప్రధానిని జగన్‌ కలుసుకోవడం తప్పయితే చంద్రబాబు కలుసుకోవడం తప్పున్నర. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి.

అసలు చట్టసభల్లోనే (అసెంబ్లీలు, పార్లమెంటు) బొచ్చెడుమంది నేరుగాళ్లున్నారు. వీరిలో హత్యా నేరారోపణలున్నవారు, కిడ్నాపర్లు, ఆర్థిక నేరస్తులున్నారు. వారిని పెట్టుకొని ప్రధాని, ముఖ్యమంత్రి పరిపాలన చేయడంలేదా? చట్టాలు చేసేది వీరే కదా. మరి వీరికి చట్టాలు చేసే హక్కుందా? ఇక టీడీపీ అనుకూల పత్రిక 'అమ్మ...జగనా' అంటూ ఓ కథనం ప్రముఖంగా ప్రచురించింది. చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న ఇద్దరు సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేయడానికే జగన్‌ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారని, ప్రజా సమస్యలపై మాట్లాడలేదని బ్రహ్మాండమైన కుంభకోణాన్ని బయటకు లాగినట్లుగా కథనం ప్రచురించింది. వాస్తవంగా ఆలోచిస్తే ఇందులో తప్పేముంది? ఆంధ్రజ్యోతి కథనం ప్రకారమే ఇతర అన్ని సమస్యలతోపాటు అధికారుల వేధింపును కూడా జగన్‌ ప్రధానికి తెలియచేశారు. ఇది నాటకమో, ఘోర పాపమో ఎలా అవుతుంది?

సీబీఐ అధికారులేమీ నిష్టాగరిష్టులు కారు. పాలకులకు లొంగనంత నిబద్ధత ఏమీ లేదు. పాలకులు ఏం చేయమంటే సీబీఐ అదే చేస్తుందని ఎప్పుడో రుజువైంది. కాబట్టి దర్యాప్తు సంస్థ అధికారులు నిబంధనలు అతిక్రమించి వేధిస్తే ప్రధానికి ఫిర్యాదు చేయడం తప్పా? ఆయనకే ఎందుకు ఫిర్యాదు చేశారంటే ఆ సంస్థ ప్రధాని కనుసన్నల్లో పనిచేస్తుంది కాబట్టి. ఓటుకు నోటు కేసు ఇంతలా జాప్యం జరగకుండా నత్తనడక నడుస్తోందంటే చంద్రబాబు ఢిల్లీలో చేసిన లాబీయింగ్‌, కేసీఆర్‌తో అనవసరంగా పెట్టుకోకుండా ఉండటమే కారణం కాదా? జైలు శిక్షలు పడినవారికి  తమ శిక్షను రివ్యూ చేయాలని కోరే హక్కు ఉన్నప్పుడు విచారణను మాత్రమే ఎదుర్కొంటున్న జగన్‌కు అన్ని హక్కులుంటాయి. కాదనేందుకు టీడీపీకే కాదు ఏ పార్టీ నాయకులకూ హక్కు లేదు. ఏ పార్టీ నాయకులైనా సరే రాజకీయాలు హుందాగా ఉండాలిగాని దిగజారి వ్యవహరించకూడదు.