Advertisement


Home > Politics - Gossip
జగన్ కు నష్టమెంతో... తెదేపాకు అంతే ప్రమాదం!

ప్రత్యర్థిని బలహీన పరిస్తేచాలు పరోక్షంగా అది తాము బలపడినట్టే అనేది సాధారణ యుద్ధనీతి. అందులో ఎలాంటి సందేహంలేదు. ప్రత్యర్థిని బలహీన పరచి, ఆ బలాన్ని తమలో కలిపేసుకుంటే.. తాము ఇంకా బలపడినట్లే అనేది కూడా పైన చెప్పుకున్న యుద్ధనీతికి అనుబంధ నీతి. అది యుద్ధంలో నిజమే కావొచ్చు. కానీ రాజకీయాల్లో అచ్చంగా నిజం కాకపోవచ్చు.

ఒక్కొక్క సారి ప్రత్యర్థి బలగాల్ని తెచ్చి తమలో కలిపేసుకోవడం ప్రమాదకరంగా కూడా మారుతుంది. ఇది ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఎదురవుతున్న పరిస్థితి. అటు శ్రీకాకుళంలో కోలగట్ల వీరభద్రస్వామి వైసీపీకి రాజీనామా చేసిన విషయం కావొచ్చు, ఇటు అనంతపురంలో గుర్నాధరరెడ్డి, కర్నూలులో ఎంపీ బుట్టా లు తెదేపాలో చేరుతారనే ప్రచారం కావొచ్చు... ఇవన్నీ వైసీపీకి నష్టమే అనడంలో సందేహంలేదు. కానీ తెలుగుదేశానికి లాభమేనా? అనేది కాస్త సందేహాస్పదంగా ఉంది.

చంద్రబాబునాయుడు 2019లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకోసం అన్నిరకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రానికి కీలకమైన రాజధాని అమరావతి, పోలవరం లాంటి వాటిని.. ‘నేను లేకపోతే పూర్తికావు’ అనే దశలో ప్రజల ఎదుట నిలిపి.. వాటికోసమైనా తనకే ఓట్లు వేయాలని అడగడం... అలాగే జగన్ కు ప్రజాదరణ పెరగకుండా అభివృద్ధి నిరోధకుడిగా ప్రచారం చేయడం, ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉన్న కీలక నాయకులను బెదిరించి ప్రలోభపెట్టి ఏదో ఒకరీతిగా తమ పార్టీలో కలిపేసుకోవడం లాంటివి ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు. 

వైసీపీ నాయకులను ఫిరాయింపజేసి తెదేపాలో కలుపుకోవడానికి ఆయన అనేక ఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగానే.. శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ కోలగట్ల వీరభద్ర స్వామి రాజీనామా చేశారు. అలాగే రాయలసీమ నాయకులు కొందరు వైసీపీని వీడి తెదేపాలో చేరుతారనే ప్రచారం కూడా కొన్ని రోజులుగా జరుగుతోంది. వీరిలో బుట్టా రేణుక, గుర్నాధరెడ్డి తదితరులు ఉన్నారు. అయితే ఈ చేరికలంతా తెలుగుదేశానికి బలమేనా అంటే మాత్రం డౌటే!

ఎందుకంటే.. వీరి చేరికలతో ఆయా జిల్లాల పార్టీ రాజకీయాలు ముఠా కుమ్ములాటల మయంగా మారిపోయే ప్రమాదం కూడా ఉంది. తెదేపా అధికార పార్టీ గనుక.. ఎంతగా అసంతృప్తి ఉన్నా.. ప్రస్తుతానికి ఎవరూ పార్టీని వీడి బయటకు పోవడానికి సాహసించకపోవచ్చు. కానీ.. ఒకరి కింద ఒకరు గోతులు తవ్వుకుంటూ ఒకరి ఓటమికి ఒకరు ప్రయత్నించడం అనేది సర్వ సాధారణంగా మారుతుంది. ఇప్పటికే వైసీపీ నుంచి వచ్చిన వలస నాయకులతో తెలుగుదేశానికి తల బొప్పి కడుతోంది. ఆయా నియోజకవర్గాల్లో పాత నాయకులనుంచి బాగా ప్రతిఘటన ఎదురవుతోంది. ఇలాంటి నేపథ్యంలో కొత్తగా మరిన్ని చికాకులను తెచ్చిపెట్టుకునే ఆలోచన చంద్రబాబు ఎందుకు చేస్తున్నారో అర్థం కాని సంగతి. 

ప్రత్యర్థి జగన్ ను బలహీన పరుస్తున్నాం అని ఆయన సంతోషిస్తూ ఉండవచ్చు గానీ.. వైసీపీ నుంచి మైనస్ అవుతున్న వారినందరినీ తన పార్టీలో ప్లస్ చేసుకోవడం వల్ల... అంతర్గత కుమ్ములాటల రూపేణా చంద్రబాబు మెడలో గుదిబండ తగిలించుకున్నట్లే అని పలువురు పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.