Advertisement


Home > Politics - Gossip
జగన్‌ పాదయాత్ర.. సరైన రూటేనా?

-సుదీర్ఘ యాత్రను మొదలుపెట్టిన వైసీపీ అధినేత

-ప్రయోజనాలు ఎలా ఉంటాయో? 

-రాష్ట్ర చరిత్రలో పాదయాత్రలకు ప్రత్యేక ప్రస్థానం

-వైఎస్‌ చరిత్ర సృష్టించారు, మరి జూనియర్‌ వైఎస్‌?

కొన్ని వాయిదాల అనంతరం, కొన్ని అవాంతరాలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర మొదలైంది, సాగుతోంది. గతవారం ఆరంభంలో జగన్‌ పాదయాత్ర మొదలైంది. వరసగా నాలుగురోజుల పాటు సాగిన యాత్ర ఐదోరోజుకు బ్రేక్‌ పడింది. క్విడ్‌ ప్రోకో కేసుల్లో కోర్టు విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో వైసీపీ అధినేత ఒకరోజు పాదయాత్రకు విరామం ఇచ్చి.. హైదరాబాద్‌ వెళ్లి కోర్టుకు హాజరయ్యారు.

అయితే పాదయాత్రకు తొలి అవాంతరం మాత్రమే కాదు.. ప్రతివారం ఉండే వ్యవహారమే. వారంలో ఆరురోజులు మాత్రమే జగన్‌ 'ప్రజాసంకల్ప యాత్ర' సాగుతుంది. ఒకరోజున కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. మినహాయింపు కోసం ట్రై చేసినా వ్యక్తిగత హాజరీ నుంచి మినహాయింపు దొరకలేదు కాబట్టి.. జగన్‌ తప్పనిసరిగా కోర్టుకు హాజరవుతున్నారు. ఈ విషయంలో కోర్టు ఉచిత సలహా కూడా ఇచ్చింది కదా. వారానికి ఒకరోజు విరామం తీసుకోవాలని ఆ రోజున కోర్టుకు హాజరై ప్రజలకు కూడా మంచి సందేశం ఇవ్వాలని కోర్టు వ్యాఖ్యానించింది.

న్యాయస్థానంపై గౌరవం చూపించడం మంచిదే అని, జగన్‌కు కోర్టు సూచించింది. ఈ రకంగా అయితే కోర్టు జగన్‌ను నిందితుడిగానే చూస్తోంది. నిందితుడిగా కోర్టుకు హాజరు కావడంలో తప్పేమీలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే జగన్‌ విరామంతో పాదయాత్ర చేయడంపై అవతల తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెడుతోంది. కోర్టుకు హాజరు కావడమే తప్పు... అనేది తెలుగుదేశం పార్టీ వాదన.

మరి జగన్‌ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే.. దీనిపై బోలెడన్ని వాదోపవాదాలు... జగన్‌పై కేసులు వేసింది తెలుగుదేశం పార్టీ వాళ్లు, కాంగ్రెస్‌ వాళ్లు కలిసి. ఇందులో ఎలాంటి సందేహంలేదు. చంద్రబాబుపై వైసీపీ వాళ్లు కోర్టుకు ఫిర్యాదు చేస్తే వాళ్లు.. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుకు వచ్చారని న్యాయస్థానాలు వ్యాఖ్యానించాయి. అదే జగన్‌ విషయంలో మాత్రం కాంగ్రెస్‌, తెలుగుదేశాలకు రాజకీయ ఉద్దేశాలు ఉన్నట్టుగా కోర్టుకు అనిపించలేదు పాపం!

కోర్టు కోర్టుకూ న్యాయం మారుతున్నప్పుడు వ్యక్తి వ్యక్తి విషయంలో కూడా న్యాయం మారినట్టేనా? ఆరేళ్ల కిందట జగన్‌కు తగిలించిన ఈ కేసుల ఉచ్చు.. అతడిని కొంతమంది దృష్టిలో అవినీతి పరుడుగా చేయగా, అందుకు సంబంధించిన పరిణామాలతో జగన్‌ రాజకీయ జీవితంపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. ఈ ప్రభావం పాదయాత్ర మీద కూడా కొనసాగుతోంది. జగన్‌ పాదయాత్ర చేసినన్ని రోజులూ.. వారానికి ఒకరోజు విరామం తీసుకోవాల్సిందే. ఇది జనాల్లోకి ఏం సందేశాన్ని ఇస్తుంది? అనేది అంత తేలికగా తేలే అంశంకాదు.

జగన్‌ కోర్టుకు హాజరు కావడాన్ని ప్రజలు ఎలా చూస్తారు? అనేది.. వారి వారి రాజకీయ అభిమానాలను బట్టి ఉంటుందా? తటస్థులు ఎలా చూస్తారు? అనేది వచ్చే ఎన్నికల ఫలితాన్ని బట్టి నిర్ధారించుకోవాలేమో! ఏదేమైనా.. జగన్‌ పాదయాత్ర సాగినన్ని రోజులూ.. శుక్రవారం విరామం- కోర్టుకు హాజరు.. అనేఅంశం చర్చలోనే ఉంటుంది. మామూలుగా అయితే శుక్రవారం కోర్టు విచారణకు హాజరుకావడం అనేది.. కామ్‌గా సాగిపోయే వ్యవహారం.

అయితే ఇప్పుడు జగన్‌ వ్యతిరేక మీడియా దాన్ని మరింతగా హైలెట్‌ చేస్తోంది. వారంలో జగన్‌ ఆరురోజుల పాటు పాదయాత్రతో పాజిటివ్‌ ఇంపాక్ట్‌ తెచ్చుకుంటే.. కోర్టు విచారణను భూతద్దంలో చూపి జగన్‌ వ్యతిరేక మీడియా పండగ చేసుకుంటోంది. ఇది తొలివారం పాదయాత్రతోనే క్లారిటీ వస్తున్న అంశం.

చరిత్రను సృష్టిస్తాడా?

రాష్ట్ర చరిత్రలో పాదయాత్రలకు ప్రత్యేక ప్రస్థానం ఉంది. అది వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాదయాత్రతో మొదలైన ప్రభంజనమే. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకూ వైఎస్‌ సాగించిన సుదీర్ఘ 'ప్రజా ప్రస్థానం' పాదయాత్ర అప్పట్లో సంచలనంగా నిలిచింది. మండుటెండలో రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ అంతా నడిచారు. ఆ సమయంలో వైఎస్‌ చేసిన గొప్ప సాహసం అది. ఎందుకంటే.. కాంగ్రెస్‌ పార్టీ రాజశేఖర్‌ రెడ్డి సొంతంకాదు.

అంత కష్టపడి ప్రజల్లోకి వెళ్లి.. పాదయాత్ర సాగిస్తే.. తీరా పార్టీకి అధికారం అందినా.. తనకే సీఎం సీటును అప్పగిస్తారనే నమ్మకంలేదు. అసలు చంద్రబాబు అప్పట్లో సాగించిన మీడియా మేనేజ్‌మెంట్‌ ముందు.. కాంగ్రెస్‌కు అవకాశాలు ఉన్నాయని కూడా ఎవ్వరూ అనుకోలేదు. అలాంటి అపనమ్మకమైన పరిస్థితుల నడుమ, అననుకూల పరిణామాల మధ్యన వైఎస్‌ పాదయాత్ర మొదలైంది. అపూర్వ స్థాయిలో సాగింది.

ఊహించని విజయమే కదా...?

నిజానికి వైఎస్‌ పాదయాత్ర ఎంత గొప్పగా సాగినా.. ఎన్నికలయ్యేంత వరకూ కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందనే అభిప్రాయం కలగలేదు ఎవ్వరిలోనూ. అరె.. వైఎస్‌ అంతదూరం నడిచాడు.. కాబట్టి కాంగ్రెస్‌ గెలుస్తుంది.. అనే విశ్లేషణ చేయలేదు ఎవరూ. అయితే పాదయాత్ర ఫలాలు ఎలా ఉంటాయో.. 2004ఎన్నికల ఫలితాలు చాటి చెప్పాయి. వైఎస్‌ కష్టం ఊరికే పోలేదు.. కాంగ్రెస్‌ పార్టీకి అఖండ విజయం సాధించి పెట్టింది.. అనే విశ్లేషణ అప్పుడు మొదలైంది.

కాంగ్రెస్‌ పార్టీ గెలిచాకా కానీ.. వైఎస్‌ పాదయాత్ర గొప్ప రీతిన సాగింది.. అనేమాట వినిపించకపోవడమే ఇక్కడ గమనించాల్సిన విషయం. ఒకవేళ కాంగ్రెస్‌ నాడు ఓడిపోయి ఉంటే..వైఎస్‌ ది ఒక నిష్ఫల యాత్రగానే మిగిలేది. కాంగ్రెస్‌ సాధించిన అఖండ విజయంతో వైఎస్‌ పాదయాత్ర అపూర్వం అయ్యింది, రాజకీయాల్లోనే పాదయాత్ర ఒక ట్రెండ్‌ అయ్యింది! అన్నింటికీ మించి చెప్పగలిగిన అంశం ఏమిటంటే.. పాదయాత్ర ప్రభావం లోలోపలే ఉంటుంది. ప్రజల్లోనే దాగి ఉంటుంది!

చంద్రబాబు యాత్ర కూడా ఫలించింది!

అంతవరకూ పాదయాత్ర అంటే గుర్తుకొచ్చింది వైఎస్‌ రాజశేఖర రెడ్డే. తీరా వైఎస్‌ అధికారంలోకి వచ్చాకా 2009 నాటికి చంద్రబాబు కూడా వైఎస్‌ను అనుసరించడం మొదలుపెట్టాడు. తను అధికారంలో ఉన్నన్ని రోజుల్లో ఉచిత విద్యుత్‌ అని వైఎస్‌ అంటే, అది సాధ్యంకాదు.. తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి.. అని బాబు ఎద్దేవా చేశాడు.

అయితే 2009 నాటికి చంద్రబాబు కూడా ఉచిత పల్లవి అందుకున్నాడు, తనుకూడా ఉచిత విద్యుత్‌ ఇస్తానని అన్నాడు, నగదు బదిలీ, బోలెడన్ని ఉచితాలు అన్నాడు.. అయితే అవేవీ ఫలించలేదు. 2009 ఎన్నికల్లో తెరాసతో పొత్తు పెట్టుకుని కూడా బాబు సత్తా చాటలేకపోయాడు. ఇక ఆ తర్వాత చివరి ప్రయత్నంగా బాబు వైఎస్‌ అస్త్రం పాదయాత్రను అందుకున్నాడు. అప్పటికి వైఎస్‌ మరణించారు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశాడు.

గమనించాల్సిన విషయం ఏమిటంటే..బాబు పాదయాత్రను ప్రత్యర్థులు లైట్‌ తీసుకోవడం. బాబు పాదయాత్ర ఇంపాక్ట్‌ ఉంటుందని ఎవ్వరూ అనుకోలేదు. పార్టీని బతికించుకోవడానికి ఏవోపాట్లు పడుతున్నాడు చంద్రబాబు.. అనే అభిప్రాయమే అంతటా వినిపించింది. 'మీ కోసం వస్తున్నా..' అంటూ చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర తెలుగుదేశానికి అధికారం సాధించి పెడుతుందని ఎవ్వరూ అనుకోలేదు.

తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి మొత్తం కథంతా మారిపోయింది. విభజన జరిగింది.. తెలంగాణ వేరైంది. అజెండాలన్నీ మారిపోయాయి. సమైక్య, విభజన గొడవల్లో చంద్రబాబు పాదయాత్ర ఒకటి చేశాడు.. వేల కిలోమీటర్ల దూరం నడిచాడు.. కదా.. అనే విషయాన్ని కూడా జనాలు మరిచిపోయారు. పాదయాత్రకాదు కానీ, వేరే వ్యవహారాలు బాబుకు కలిసి వచ్చాయి. అధికారాన్ని అప్పగించాయి. మరి సెంటిమెంటల్‌గా చూస్తే పాదయాత్ర చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినట్టే!

షర్మిల యాత్ర.. ఆమె కాలేదుగా?

వైఎస్‌ 'ప్రజా ప్రస్థానం' యాత్రను చేస్తే ఆయన కూతురు 'మరో ప్రజాప్రస్థానం'అంటూ యాత్ర చేశారు. ఒక మహిళ అలాంటి యాత్రను చేపట్టడం, అంత దూరం నడవడం అత్యంత సాహసమే. స్త్రీల ఆరోగ్యంపై అలాంటి యాత్రలు తీవ్రమైన పరిణామాలను చూపే అవకాశాలుంటాయి. అయితే షర్మిల అన్నింటికీ ఓర్చుకుని ఆ యాత్ర చేశారు.  అయితే ఆమె యాత్ర ఉద్దేశం తను ముఖ్యమంత్రి కావడంకాదు.

అన్నను ముఖ్యమంత్రిని చేయడం.. ఎన్నికల సమయానికి షర్మిల పాదయాత్ర చేసిందన్న విషయం కూడా మరుగున పడిపోయింది. విభజన, ఉద్యమాలు తదితర వ్యవహారాలే గత ఎన్నికల ఫలితాలను శాసించాయి. దీంతో షర్మిల పాదయాత్ర ప్రభావం కనిపించలేదు. కానీ.. ఆమె యాత్ర చేయకపోయుంటే.. వైకాపా పరిస్థితి అంతే. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రస్థాయిలో నిలబెట్టడంలో, జగన్‌ జైల్లో ఉన్న ఆ సందర్భంలో వైకాపా ఉనికిని నిలపడంలో విజయవంతం అయినట్టే లెక్క.

జగన్‌ పాదయాత్ర.. సైలెంట్‌ వేవ్‌ అవుతుందా?

జగన్‌పై కేసులు ఉండని, చంద్రబాబు నాయుడు ఎంత స్థాయిలో అయినా మేనేజ్‌ చేయనీ, ఎంతమంది నేతలు జగన్‌ను వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరని.. తెలుగుదేశం పార్టీ అనుకూలంగా మీడియా బలగం ఎంతగా అయినా పనిచేయనీ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని మాత్రం ఇవేవీ దెబ్బతీయలేవు. ఎందుకంటే.. తెలుగుదేశానికి రాజకీయ ప్రత్యామ్నాయంగా వైసీపీ నిలబడి ఉంది.

జనసేన ఉన్నా.. లేనట్టే, కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ కోలుకునే అవకాశాలులేవు, భారతీయ జనతాపార్టీ తెలుగుదేశానికి తోకగా మిగిలిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీగా వైసీపీ స్ట్రాంగ్‌ బేస్‌ను నిలబెట్టుకుని ఉంది. నంద్యాల బైపోల్‌లో వైసీపీ ఓడిపోయే ఉండవచ్చు.. డెబ్బైవేల ఓట్లను సాధించుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఉపఎన్నికల సందర్భాల్లో సాధించుకున్న ఓట్లతో పోలిస్తే వైసీపీ చాలా బెటర్‌ పొజిషన్లో ఉన్నట్టే. జగన్‌ ఏ కార్యక్రమం చేపట్టినా దానికి జనస్పందన బాగానే ఉంటోంది.

ఇప్పుడు పాదయాత్ర కూడా అలాంటి జన ప్రభంజనంతోనే సాగుతోంది. జగన్‌ సొంతజిల్లాలో పాదయాత్రలా కాకుండా.. జనయాత్రలా సాగిన వైనం స్పష్టంగా అగుపిస్తోంది. ఇది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చే అంశమే. రాష్ట్రమంతా.. జగన్‌ పాదయాత్రకు ఇలాంటి స్పందనే వ్యక్తం అయితే.. వైసీపీలో ఈ ఉత్సాహం రెట్టించవచ్చు. అయితే ఇది మళ్లీ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌గా మారితే ఆ పార్టీకే నష్టం. ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో పాదయాత్ర చేసిన వైఎస్‌, చంద్రబాబులు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నట్టుగా అదే సెంటిమెంటే రిపీట్‌ అయ్యి జగన్‌ కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోవచ్చు. అది మరీ ఆశ్చర్యపరిచే అంశం అయితే కాదు!

కొత్తగా వచ్చే నష్టం ఏమీలేదు...!

సెంటిమెంట్‌ పరంగా చూసుకున్నా, పార్టీ కార్యకలాపాల వరకూ చూసుకున్నా, జనం మధ్యన గడపడం అయినా, క్షేత్ర స్థాయిల్లో పరిస్థితిని అర్థం చేసుకోవడానికి అయినా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర చాలా ఉపయుక్తం అయ్యే అంశమే. ఇంత సమయం పాటు ప్రజలకు అతి తక్కువగా ఉండటం వల్ల జగన్‌కు కూడా వాళ్లకేం కావాలనే అంశంపై పరిపూర్ణమైన అవగాహన వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా తన రాజకీయ వ్యూహాలను కూడా మార్చుకునే అవకాశం ఉంది. జగన్‌కు యాత్రలు కొత్తేంకాదు, దీక్షలూ కొత్తకాదు.

అయితే అవన్నీ వాహనాల్లో వెళ్లిపోయేవి, ఒకచోట కూర్చుని చేసినవి.. అయితే ఇప్పుడు ప్రజలకు అతి దగ్గరగా వెళుతున్నాడు. వాళ్లు తన దగ్గరకు రావాల్సిన అవసరం లేకుండా.. తనే వాళ్ల దగ్గరకు వెళ్తున్నాడు. కాబట్టి ఈ యాత్ర జగన్‌లో ప్రజల విషయంలో మరింత పరిణతి తీసుకువచ్చే అవకాశం ఉంది. జగన్‌ భావోద్వేగాలు, జగన్‌ తీరు.. ప్రజలకు మరింతగా తెలిసే అవకాశం కూడా ఉంది.

ఇది వాస్తవమైన అంశం. పాదయాత్రలతో నేతలకు ప్రజల గురించి తెలియడమే కాదు, నేతల గురించి కూడా ప్రజలకు మరింతగా తెలుస్తుంది. వాళ్లు ప్రజలతో ఎలా నడుచుకుంటున్నారు, ఎక్కడ బస చేస్తున్నారు, వాళ్ల ఆరోగ్యం ఎలా ఉంటుంది, వాళ్లలో ఎంత ఓపిక ఉంది, ఎంతశక్తి ఉంది, వాళ్ల రియాక్షన్లు ఎలా ఉంటాయి.. అనే అంశాలను ప్రజలు దగ్గర నుంచి పరిశీలించడానికి అవకాశాన్ని ఇస్తాయి ఈ తరహా సుదీర్ఘ యాత్రలు. కాబట్టి జగన్‌ గురించి ప్రజలకు మరింతగా అర్థంఅయ్యే అవకాశం ఉంది. అదేమైనప్పటికీ వాళ్లకు క్లారిటీ అయితే వస్తుంది.

అంతిమ అస్త్రాన్ని సంధించేశాడు!

మరోవైపు నుంచి చూస్తే జగన్‌ తన రాజకీయ జీవితంలో ప్రధానమైన అంతిమమైన అస్త్రాన్ని సంధించేశాడు. ఇన్నాళ్లూ జగన్‌ పోరాటం ఒకఎత్తు, ఈ పాదయాత్ర మరోఎత్తు. ఇది చేపట్టాకా ఎటుతిరిగీ అధికారాన్ని సాధించుకోవాల్సిందే. లేకపోతే... జగన్‌ రాజకీయ భవితవ్యం మరింత గందరగోళంలో పడుతుంది. ఈ పాదయాత్ర జగన్‌ను కచ్చితంగా అధికారంలోకి తీసుకురావాల్సిందే.. తీసుకురాలేదంటే.. ఆ తర్వాత మరో ఎన్నిక కోసం చేయడానికి మరేం లేకుండా పోతుంది.

పాదయాత్ర టెంపోని జగన్‌ ఎన్నికల వరకూ మెయింటెయిన్‌ చేయాల్సి ఉంటుంది. 2018లోనే ఎన్నికలు వస్తాయనేది జగన్‌ అంచనా. ఒకవేళ అలా జరగకపోతే.. పాదయాత్ర పూర్తి అయిన తర్వాత మరో ఏడాది వరకూ గనుక ఎన్నికలు రాకపోతే ఈ వేడి కొంత తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి.  కానీ అనుకున్నట్టుగా ఎన్నికలు వస్తే మాత్రం పాదయాత్ర ఫలాలు వేడి వేడిగానే ఉంటాయి.

పార్టీపై అవగాహన.. పక్కాగా వస్తుంది!

పార్టీ స్థితిగతుల మీద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేతకు ఈ యాత్రతో పక్కా అవగాహన వచ్చే అవకాశం ఉంది. సమీక్షలు, సర్వేలు సంగతెలా ఉన్నా.. ఒక్కో నియోజకవర్గంలో రెండు మూడురోజుల పాటు గడపడం వల్ల అక్కడ పార్టీ బలాలు బలహీనతల గురించి కూడా జగన్‌కు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా మార్పులు చేర్పులతో ముందుకు వెళ్లడానికి జగన్‌కు అవకాశాన్ని ఇస్తోంది ప్రజాసంకల్పయాత్ర.

-ఎల్‌.విజయలక్ష్మి