cloudfront

Advertisement


Home > Politics - Gossip

జగన్‌, పవన్‌.. ప్రేక్షకులు మాత్రమే.!

జగన్‌, పవన్‌.. ప్రేక్షకులు మాత్రమే.!

తెలంగాణలో ఎన్నికల హంగామా మొదలైంది. అసెంబ్లీ రద్దు నిర్ణయం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జనం వద్దకు వెళుతున్నారు. 'జన ఆశీర్వాద సభ' పేరుతో ఎన్నికల సమరశంఖం పూరించబోతున్నారు కేసీఆర్‌. ఈరోజు సాయంత్రం హుస్నాబాద్‌ బహిరంగ సభతో టీఆర్‌ఎస్‌, ఎన్నికల ప్రచారం షురూ అయినట్లే. 105 మంది అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించేసిన దరిమిలా.. గులాబీ శ్రేణులు ప్రచార బరిలోకి ఆల్రెడీ దిగిపోయినట్లే.

కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీ, వామపక్షాలు, తెలంగాణ జనసమితి.. ఇవన్నీ ఇప్పుడు తెలంగాణలో అభ్యర్థుల్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి. వీటన్నిటిలోకీ టీఆర్‌ఎస్‌ తర్వాత కాస్త మెరుగ్గా వున్న పార్టీ ఏదన్నా వుందంటే అది కాంగ్రెస్‌ మాత్రమే. బీజేపీ - టీడీపీ.. 'నువ్వా.? నేనా.?' అన్నట్లు పోటీ పడాలేమో అభ్యర్థుల ఎంపిక విషయంలో. సీట్ల పరంగా కాస్తో కూస్తో ఎడ్జ్‌ బీజేపీకే కన్పిస్తోంది టీడీపీతో పోల్చితే. వామపక్షాల పరిస్థితి అంతంతమాత్రంగానే వుందిప్పుడు. కొత్తగా పుట్టిన తెలంగాణ జనసమితి పరిస్థితీ ప్రస్తుతానికి గందరగోళమే. టీఆర్‌ఎస్‌లో టిక్కెట్లు దక్కనివారు ఇతర పార్టీల వైపు ఎంతమేరకు చూస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌.

ఇక, 2014 ఎన్నికల్లో ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఈ ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించబోతుందన్న దానిపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టతాలేదు. తెలంగాణ నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఒకరిద్దరు నేతలు కన్పిస్తున్నా, వారెవరూ పార్టీని తెలంగాణలో లీడ్‌ చేసే పరిస్థితి లేదన్నది ఓపెన్‌ సీక్రెట్‌. తెలంగాణ బాధ్యతల్ని గతంలో వైఎస్‌ జగన్‌, తన సోదరి షర్మిలకి అప్పగించారు. కానీ, ఆమె ఆ తర్వాత రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. ఏపీ నుంచి ఎంపీగా షర్మిల పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతున్న దరిమిలా.. ఆమె మళ్ళీ తెలంగాణలో వైఎస్సార్సీపీ బాధ్యతల్ని స్వీకరించే అవకాశాలు లేనట్లే. సో, తెలంగాణలో వైఎస్సార్సీపీ చేతులెత్తేసినట్లే భావించాల్సి వుంటుంది.

ఇంతకీ, జనసేన పార్టీ పరిస్థితి ఏంటట.? ఆ పార్టీ తరఫున తెలంగాణ నేతలెవరూ ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటనా చేయలేదుగానీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, తెలంగాణ ఎన్నికల విషయంలో జనసేన 'తటస్థంగా' వుండాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఏపీ రాజకీయాలపైనే ఫోకస్‌ పెట్టింది జనసేన. అయినాసరే, అక్కడ కూడా ఆ పార్టీకి పూర్తిస్థాయిలో 'నిర్మాణం' పూర్తవని పరిస్థితి. దాంతో జనసేన, తెలంగాణ రాజకీయాల గురించి ఆలోచించడం అన్న ప్రస్తావనే హాస్యాస్పదం.